Destruction of temples
-
బంగ్లాదేశ్‌లో మత కలహాలు
ఢాకా/కోల్‌కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది. కోల్‌కతాలో ఇస్కాన్ నిరసన బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. -
ఆలయ ఘటనలపై 'సిట్' స్పీడ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం జరిగిన ఆలయ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జెట్ స్పీడ్‌తో పనిచేస్తోంది. గతేడాది సెప్టెంబర్ 5 నుంచి పలు ఆలయాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసం తదితర ఘటనలపై విచారణకు ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో 16 మందితో కూడిన సిట్.. సంక్రాంతి రోజుల్లోనూ నిర్విరామంగా విధులు నిర్వహించింది. దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో.. సిట్ కూడా దర్యాప్తు ప్రక్రియలో స్పీడ్ పెంచింది. బృందంలోని 16 మంది వేర్వేరు టీమ్‌లుగా విడిపోయి ముఖ్యమైన కేసులను భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుట్ర కోణంపై ఆరా ముఖ్యమైన 16 కేసులపై సిట్ దర్యాప్తు చేపట్టింది. వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్), కేసు డైరీ తదితర అన్ని వివరాలను సేకరించింది. వాటిలో ఇప్పటికే 50 శాతంపైగా కేసులను నిగ్గు తేల్చిన పోలీసులు అరెస్టులు కూడా చేశారు. అయితే ఆ 16 ప్రధాన కేసులపై దృష్టి సారించిన సిట్ వాటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనేది కూడా ఆరా తీస్తోంది. గత మూడు రోజుల్లో విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసింది. సిట్ చీఫ్ అశోక్‌కుమార్ స్వయంగా రామతీర్థం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులు, అర్చకులు, విజయనగరం జిల్లా పోలీసుల నుంచి పలు వివరాలు సేకరించారు. జిల్లా స్థాయిలో దర్యాప్తు బృందాలు ముఖ్యమైన ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తుండగా.. మిగతా కేసుల విషయంలో ఆయా జిల్లాల స్థాయిలో స్థానిక పోలీసులతో దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు దర్యాప్తు వివరాలను సిట్‌కు అందజేస్తాయి. జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో పనిచేసే స్థానిక పోలీస్ టీమ్‌లకు అవసరమైన సమయంలో సిట్ దిశా నిర్దేశం చేస్తోంది. దీనివల్ల మొత్తం కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి అవుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
సోము వీర్రాజు.. కన్నాలా వ్యవహరించకు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాగా.. మరొకటి టీడీపీ బీజేపీ అంటూ ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం కావడం సంతోషకరమైన విషయంగా భావించాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని ఆశించాం. కానీ మూస ధోరణిలో మతం గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు రథయాత్ర చేస్తామన్నారు.. అది ఎందు కోసం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై ప్రజలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు విచారణ ప్రారంభించ లేదు’ అన్నారు ‘ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు.. మరొకరు చంద్రబాబు నాయుడు పంపిన బీజేపీ నాయకులు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు అజెండా చదివి పదవి కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల వలలలో మీరు పడొద్దు. రాముడు అందరి దేవుడు. ఆయనని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. గతంలో అద్వానీ ప్రతి పక్షంలో రథయాత్ర చేస్తే అందరూ సహకరించారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండగా రథయాత్ర ఎందుకోసం చేయాలి. మీరు పద్దేనిమిది నెలల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి ఏం ప్రాజెక్టులు తీసుకువచ్చారో.. రథయాత్ర ప్రారంభించడానికి ముందు ఆలోచించండి. మేనిఫెస్టో అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోండి’ అన్నారు. (చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!) ‘సీఎం జగన్ పాలనలో దేవాలయాల విషయంపై రాజీ పడే పరిస్థితి లేదు. నిందితులపై చర్యలు కఠినంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మీరు గుర్తించరా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్న విషయం గమనించండి’ అని కోరారు. -
మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు విగ్రహాల విధ్వంసం ఘటనలను తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకున్న తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ఘటనల్లో టీడీపీ స్కెచ్ పక్కాగా అమలైనట్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అందుకు కారణమైన సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సానుకూల ప్రచారం రాకుండా ఉండేందుకే ఆలయ ఘటనలను ఆసరాగా తీసుకుని ఆలజడిని రేపుతున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేవాలయాల్లో విగ్రహాల ధ్వంస రచనకు పాల్పడటం, పాత ఘటనలను కొత్తగా తెరమీదకు తెచ్చి అలజడి రేపడం, ఎటువంటి ఘటనలు జరగకపోయినా జరిగినట్టు దుష్ప్రచారం చేయడం వంటి చర్యలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైన దురదృష్టకర ఘటన గతేడాది సెపె్టంబర్ 5న జరిగింది. ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇటువంటి సున్నితమైన అంశాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరిగాయి. టీడీపీ, బీజేపీలు రంగంలోకి దిగి దేవుడి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మతపరమైన అలజడులను సృష్టించే ప్రయత్నాలు చేయగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకోగలిగారు. అయినప్పటికీ వరుస ఘటనలు జరగడం, వాటిని ఆసరాగా తీసుకుని విపక్షాలు రాద్ధాంతం చేయడం తెలిసిందే. ఇలా సెపె్టంబర్ 5 తర్వాత దేవాయాలకు సంబంధించి 44 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 29 కేసులను చేధించిన పోలీసులు 81 మందిని అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజకీయ కుట్ర కోణాన్ని గుర్తించారు. తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీలకు చెందిన వారికి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని గుర్తించి, 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా ఘటనల్లో అరెస్టు అయిన వారి పూర్వాపరాలను ఆరా తీస్తున్న పోలీసులు తాజాగా మరికొన్ని నిజాలను గుర్తించారు. మద్దమ్మ ఆలయ ఘటనలో నలుగురు టీడీపీ నేతలు కర్నూలు జిల్లా మద్దికెర పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దమ్మ దేవాలయంలో గతేడాది డిసెంబర్ 20వ తేదీన గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటనలో ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిలో ఒక నిందితుడు ఎస్డీ ఫక్రుద్దీన్ బాషా టీడీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. మరో నిందితుడు రామాంజనేయులు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నల్ల దాసరిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మరో నిందితుడు కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన జయరాముడు. అతని తల్లి 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున్ మద్దతుతో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసింది. మరో నిందితుడు గొల్ల పెద్దయ్య టీడీపీ కార్యకర్త కావడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ కీలక నేతల పాత్రపై ఆరా తీస్తున్నారు. బుచ్చయ్య డైరెక్షన్! రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుని విగ్రహాన్ని మలినంతో అపవిత్రం చేశారంటూ ఉద్దేశ పూర్వకంగా వివిధ సామాజిక మాధ్యమాలలో టీడీపీకి చెందిన వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్ష చేయించడంతో అది జీవ సంబంధ మలినం కాదని రిపోర్టు వచ్చింది. ఈ కేసులో వెల్లంపల్లి ప్రసాద్‌బాబు (బాబు ఖాన్ చౌదరి)ను పోలీసులు అరెస్టు చేశారు. చిటికెన సందీప్ (టీడీపీ), అడపా సందీప్ (బీజేపీ), కరుటూరి శ్రీనివాసరావులు నిందితులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన చిటికెన సందీప్ టీడీపీ మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరికి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఇదంతా బుచ్చయ్య చౌదరీ డైరెక్షన్లోనే జరిగిందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పనిగట్టుకుని దుష్ప్రచారం – విశాఖ జిల్లా గోలుగొండ మండలం ఏటిగైరంపేటలో రామాలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ.. గతంలో ఎప్పుడో దెబ్బ తిన్న విగ్రహం తాజాగా దెబ్బతిన్నట్టు సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు పైల సత్తిబాబు, కల్లిద నరేష్‌లు తప్పుడు ప్రచారం చేయించారు. – వారిని అరెస్టు చేసిన క్రమంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి హడావుడి చేశాడు. ఈ ఘటనలో ఆయన పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వినాయకుడి విగ్రహంపై జరిగిన దుష్ప్రచారం వెనుక ఉన్న టీడీపీ నేతలు ఎవరు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. – వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండ వేయడం, కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురాన్ని ధ్వంసం చేశారని, ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని, గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శృంగేరి శంకర మఠంలో సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేశారంటూ పలు ఘటనల్లో వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతల వెనుక ఉన్న వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. – శ్రీకాకుళం జిల్లా సోంపేటలో హనుమంతుని విగ్రహం, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో దెబ్బతింటే ఇప్పుడు జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన వారి వెనకుండి కథ నడిపిన సూత్రధారుల కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. -
అరే.. ఎవడ్రా వీడు..వీళ్ల ఓట్లు మాకు అక్కర్లేదు
దేవుడా... అభివృద్ధి పేరుతో ఆలయాల విధ్వంసం నిన్న శనీశ్వరాలయం.. సీతమ్మవారి పాదాలు... నేడో రేపో విజయేశ్వరస్వామి.. వినాయక గుళ్లు ? అర్జున వీధి 100 అడుగుల విస్తరణ, గోశాల వద్ద మరోసారి స్థల సేకరణ ధర్మ పరిరక్షణ సంఘం నేతలపై ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు అర్ధరాత్రి వేళ గజదొంగలు ఊళ్లు, ఇళ్లపై పడి కొల్లగొట్టడం ఇప్పటివరకు మనం విన్నాం.. నగరం నిద్దరోయాక ప్రభుత్వ అధికారులు దర్జాగా దగ్గరుండి మరీ ప్రాశస్త్యం గల ఆలయాలను ధ్వంసం చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అంతేకాదు విగ్రహాలను మాయం చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులను ఒకరోజు ముందే అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసు బలంతో, అధికార మదంతో సర్కారు సాగిస్తున్న అరాచకం పరాకాష్టకు చేరింది. ఇప్పుడు వీరి కన్ను కెనాల్ రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి, విజయేశ్వరస్వామి ఆలయాలపై పడింది. విజయవాడ సెంట్రల్ : రాజధాని నగరంలో దేవుళ్లకు రక్షణ కరువైంది. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. మందపల్లి తరువాత అంతటి చరిత్ర గల శనీశ్వరస్వామి ఆలయాన్ని, 90 ఏళ్ల నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి గుడిని, భవానీపురంలోని స్వయంభు అమ్మవారి ఆలయాన్ని అధికారులు ఇటీవలే ధ్వంసం చేశారు. సీతమ్మవారి పాదాలను పెకలించారు. రోడ్ల విస్తరణ, సుందరీకరణ పేరుతో అడ్డగోలుగా ఆలయాలు, మసీదులు, చర్చిలను కూలగొడుతున్నారు. భవానీపురం, వన్‌టౌన్, రామవరప్పాడు, గవర్నర్‌పేట, కృష్ణలంక, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 44 ఆలయాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాలను సాకుగా చూపి అడ్డగోలుగా ప్రార్థనాలయాలను ధ్వంసం చేస్తున్నారు. చారిత్రక ప్రాశస్త్యం గల ప్రార్థనాలయాలను కూల్చివేయాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇచ్చి, ప్రత్యామ్నాయ స్థలాలను చూపాల్సిన బాధ్యతను మాత్రం అధికారులు విస్మరిస్తున్నారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. అర్ధరాత్రి అవుతోందంటే.. ఆలయ కమిటీలకు వణుకే.. అర్ధరాత్రి అవుతోందంటే ఆలయ కమిటీలకు వణుకు పుడుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు భారీ సంఖ్యలో వెళ్లి ఆలయాలను కూలగొడుతున్నారు. అడ్డువచ్చే వారిపై కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యుల్ని ముందురోజే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పవిత్రంగా చూసుకొనే ఆలయాల్లోకి అధికారులు, సిబ్బంది చెప్పులు, బూట్లతో వెళ్లి విగ్రహాలను తొలగించడంతో భక్తులు నొచ్చుకుంటున్నారు. ఈ విధుల్లో పాల్గొనే కొందరు సిబ్బంది మద్యం సేవించి ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ బాబు.ఎ పోకడలపై అన్ని వర్గాల ప్రజలూ మండిపడుతున్నారు. ఆలయ ప్రాశస్త్యం ఇదీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కెనాల్ రోడ్డులో 1940లో నిర్మించారు. కోరి కొలిచే భక్తులకు కొంగుబంగారమై స్వామివారు భాసిల్లుతున్నారు. కాణిపాకం వినాయకుడి గుడి తరువాత అంతటి ప్రసిద్ధి చెందినదిగా ఈ ఆలయానికి పేరుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకొనే భక్తులు ముందుగా గణపయ్యకు ప్రణమిల్లుతారు. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారు ఇక్కడి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర సందర్భంగా నగరానికి వచ్చినప్పుడు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు. అరే.. ఎవడ్రా వీడు.. సీఐ వెంకటేశ్వరరావు వీడ్ని ఎత్తుకెళ్లిపో.. వీళ్లందర్ని ఇక్కడ నుంచి లాగేయ్!... వీళ్ల ఓట్లు మాకు అక్కల్లేదు.. నేను, కలెక్టర్ దగ్గరుండి అడ్డంగా ఉన్న దేవాలయాలను పగలగొట్టిస్తాం.. మీకు చేతనైంది చేసుకోండి చూస్తాం.. ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టిస్తాం..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని).