ఢాకా/కోల్‌కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది.
శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి.
హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది.
కోల్‌కతాలో ఇస్కాన్ నిరసన
బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment