Prayer halls
-
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
బంగ్లాదేశ్‌లో మత కలహాలు
ఢాకా/కోల్‌కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది. కోల్‌కతాలో ఇస్కాన్ నిరసన బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. -
ప్రార్థనా మందిరానికి పాఠశాల స్థలమా?
విజయవాడ: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించడాన్ని ఆ గ్రామస్తులు నిరసిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 సెంట్ల భూమిని ప్రార్థనా మందిరం నిర్మించుకునేందుకు గన్నవరం ఎమ్మెల్యే వంశీ కేటాయించారు. దీంతో ఆ భూమిని పొందినవారు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వంశీ నిర్ణయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల స్థలాన్ని ఏ అధికారంతో మతపరమైన కార్యక్రమాలకు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలంలో హైస్కూల్‌కు అనుబంధంగా జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైస్కూల్ గ్రౌండ్లో గ్రామస్తులు సమావేశమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు. హైస్కూల్ వద్ద ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టగా పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ సబ్ కలెక్టర్, రూరల్ తహసీల్దార్లు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. -
అర్ధరాత్రి ప్రార్థనాలయాల తొలగింపు
విజయవాడ : విజయవాడలోని వన్‌టౌన్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి కార్పొరేషన్ అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో చేపట్టిన ప్రార్థనాలయాల తొలగింపు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. భవానీపురం భాష్యం పాఠశాల సమీపంలో ఉన్న రామాలయం, దర్గాలను యంత్రాలతో తొలగించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పలువురుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.