ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్‌స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్‌స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.
మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్
లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
లౌడ్‌స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
Published Thu, May 5 2022 5:04 AM | Last Updated on Thu, May 5 2022 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment