పొలిటికల్‌ రీ సౌండ్‌ | Loudspeaker and bulldozer becoming key terms in Indian political lexicon | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ రీ సౌండ్‌

Published Thu, Apr 21 2022 5:45 AM | Last Updated on Thu, Apr 21 2022 5:52 AM

Loudspeaker and bulldozer becoming key terms in Indian political lexicon - Sakshi

మసీదుల్లో లౌడ్‌ స్పీకర్‌లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే చేస్తున్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా రీ సౌండ్‌ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్‌ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్‌ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో  నష్టమెంత?

మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్‌ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చేస్తున్న డిమాండ్‌ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్‌ఎస్‌ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్‌ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్‌ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది.

శబ్ద కాలుష్యమంటే?
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు.

ఆరోగ్యంపై ప్రభావం
శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది.

అమల్లో ఉన్న నిబంధనలేమిటి?
బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్‌ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్‌ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్‌ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement