Navanirmana Sena in Maharashtra
-
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎమ్మెన్నెస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై : నాసిక్‌లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు శివసేనలో చేరారు. ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లైన నిలేష్ శెలార్, శోభనా షిందే బుధవారం మాతోశ్రీలో ఉద్దవ్ సమక్షంలో శివసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము ఊహించినట్టుగా ఎమ్మెన్నెస్‌తో అభివృద్ధి జరగలేదని, అందుకే తాము శివసేనలో చేరినట్టు వారు పేర్కొన్నారు. ఎమ్మెన్నెస్‌కు షాక్ నాసిక్ మేయర్ ఎన్నికలు ఎమ్మెన్నెస్‌కు మరింత సమస్యగా మారనుంది. గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన ఎమ్మెన్నెస్ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం చేపట్టింది.ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెన్నెస్‌తో బీజేపీ తెగదెంపులు చేసుకుంది. మళ్లి శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒంటరైన ఎమ్మెన్నెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడిచి వెళ్లిపోయారు. వారిద్దరూ శివసేనలో చేరడం మరింత షాక్‌కు గురి చేసింది. మహాకూటమికే అధికారం: ఉద్దవ్ ఠాక్రే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమాను శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యక్తం చేశారు. శివసేనలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లకు స్వాగతం ఆయన స్వాగతం పలికారు. శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని తమ అభ్యర్థి మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
సేనలో సర్దుకున్న విభేదాలు
సాక్షి ముంబైః మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)లో నెలకొన్న విభేదాలకు ఎట్టకేలకు సోమవారం తెరపడింది. ఎమ్మెన్నెస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వసంత్ గీతే ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ప్రకటించడంతోపాటు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. తన సూచనల ప్రకారం నాసిక్ కార్పొరేషన్లో పదవులు కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉనా, ఠాక్రేతో భేటీ అయ్యాక చల్లబడ్డారు. దీంతో నాసిక్ లో గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం అంతమయింది. మరికొన్ని నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్ ఠాక్రేకు ఈ పరిణామం సంతోషం కలిగిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకుడైన నాసిక్ ఎమ్మెల్యే గీతే గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం విధితమే. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ పదవుల కేటాయింపుపై ఆయన నిరసన వ్యక్తంచేశారు. ఇది జరిగిన అనంతరం ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎంతో పట్టుందని భావించిన నాసిక్‌లో ఎమ్మెన్నెస్ ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్ ఠాక్రే వసంత్ గీతేను కొంత దూరంగా ఉంచడం ప్రారంభించారు. పార్టీ నిర్ణయాలు తీసుకోవడంపై అవినాశ్ అభ్యంకర్కు బాధ్యతలు అప్పగించారు. ఇలా పరోక్షంగా ఎమ్మెల్యే ఉత్తమరావ్ ఢికలేను ప్రోత్సహించడంతో ఆయన ప్రత్యర్థి అయిన గీతేలో అసంతృప్తి అధికమయింది. ఈ నేపథ్యంలో నాసిక్‌కు చెందిన కొందరు పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలతోపాటు ఆయన పార్టీని వీడనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాజ్ ఠాక్రే అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో గీతేతోపాటు ఆయన సన్నిహితులు హాజరుకాలేదు. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నందునే గీతే సమావేశానికి రాలేదని పలువురు నాయకులు అనుకున్నారు. దీంతో గీతేతోపాటు ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడం ఖాయమని భావించారు. అదేవిధంగా ఆయన బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాజ్ ఠాక్రే నాసిక్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే గీతే వివాదం తీవ్రరూపం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకొని స్వయంగా రంగంలోకి దిగారు. వసంత్ గీతేను బుజ్జగించేందుకుగా నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దరేకర్, దీపక్ పాయిగడేను గీతే నివాసానికి పంపించారు. వీరి భేటీ అనంతరం ఒక్కసారిగా ఆయనలో మార్పు కన్పించింది. ‘పార్టీపై నిరసన వ్యక్తం చేయడానికే సమావేశానికి రాలేదన్న పుకార్లుఅబద్ధం. నా కాలికి గాయంకారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో సమావేశానికి వెళ్లలేదు’ అని వివరణ ఇచ్చారు. పార్టీ వీడనున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలను అవాస్తమని స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్‌లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తనకు పార్టీపై ఎందుకు అసంతృప్తి ఉంటుందని మీడియాను ప్రశ్నించారు.