అరే.. ఎవడ్రా వీడు..వీళ్ల ఓట్లు మాకు అక్కర్లేదు
దేవుడా...
అభివృద్ధి పేరుతో ఆలయాల విధ్వంసం
నిన్న శనీశ్వరాలయం.. సీతమ్మవారి పాదాలు...
నేడో రేపో విజయేశ్వరస్వామి.. వినాయక గుళ్లు ?
అర్జున వీధి 100 అడుగుల విస్తరణ,
గోశాల వద్ద మరోసారి స్థల సేకరణ
ధర్మ పరిరక్షణ సంఘం నేతలపై ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు
అర్ధరాత్రి వేళ గజదొంగలు ఊళ్లు, ఇళ్లపై పడి కొల్లగొట్టడం ఇప్పటివరకు మనం విన్నాం.. నగరం నిద్దరోయాక ప్రభుత్వ అధికారులు దర్జాగా దగ్గరుండి మరీ ప్రాశస్త్యం గల ఆలయాలను ధ్వంసం చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అంతేకాదు విగ్రహాలను మాయం చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులను ఒకరోజు ముందే అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసు బలంతో, అధికార మదంతో సర్కారు సాగిస్తున్న అరాచకం పరాకాష్టకు చేరింది. ఇప్పుడు వీరి కన్ను కెనాల్ రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి, విజయేశ్వరస్వామి ఆలయాలపై పడింది.
విజయవాడ సెంట్రల్ : రాజధాని నగరంలో దేవుళ్లకు రక్షణ కరువైంది. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. మందపల్లి తరువాత అంతటి చరిత్ర గల శనీశ్వరస్వామి ఆలయాన్ని, 90 ఏళ్ల నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి గుడిని, భవానీపురంలోని స్వయంభు అమ్మవారి ఆలయాన్ని అధికారులు ఇటీవలే ధ్వంసం చేశారు. సీతమ్మవారి పాదాలను పెకలించారు. రోడ్ల విస్తరణ, సుందరీకరణ పేరుతో అడ్డగోలుగా ఆలయాలు, మసీదులు, చర్చిలను కూలగొడుతున్నారు. భవానీపురం, వన్‌టౌన్, రామవరప్పాడు, గవర్నర్‌పేట, కృష్ణలంక, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 44 ఆలయాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాలను సాకుగా చూపి అడ్డగోలుగా ప్రార్థనాలయాలను ధ్వంసం చేస్తున్నారు. చారిత్రక ప్రాశస్త్యం గల ప్రార్థనాలయాలను కూల్చివేయాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇచ్చి, ప్రత్యామ్నాయ స్థలాలను చూపాల్సిన బాధ్యతను మాత్రం అధికారులు విస్మరిస్తున్నారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు.
అర్ధరాత్రి అవుతోందంటే.. ఆలయ కమిటీలకు వణుకే..
అర్ధరాత్రి అవుతోందంటే ఆలయ కమిటీలకు వణుకు పుడుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు భారీ సంఖ్యలో వెళ్లి ఆలయాలను కూలగొడుతున్నారు. అడ్డువచ్చే వారిపై కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యుల్ని ముందురోజే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పవిత్రంగా చూసుకొనే ఆలయాల్లోకి అధికారులు, సిబ్బంది చెప్పులు, బూట్లతో వెళ్లి విగ్రహాలను తొలగించడంతో భక్తులు నొచ్చుకుంటున్నారు. ఈ విధుల్లో పాల్గొనే కొందరు సిబ్బంది మద్యం సేవించి ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ బాబు.ఎ పోకడలపై అన్ని వర్గాల ప్రజలూ మండిపడుతున్నారు.
ఆలయ ప్రాశస్త్యం ఇదీ
వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కెనాల్ రోడ్డులో 1940లో నిర్మించారు. కోరి కొలిచే భక్తులకు కొంగుబంగారమై స్వామివారు భాసిల్లుతున్నారు. కాణిపాకం వినాయకుడి గుడి తరువాత అంతటి ప్రసిద్ధి చెందినదిగా ఈ ఆలయానికి పేరుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకొనే భక్తులు ముందుగా గణపయ్యకు ప్రణమిల్లుతారు. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారు ఇక్కడి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర సందర్భంగా నగరానికి వచ్చినప్పుడు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు.
అరే.. ఎవడ్రా వీడు..
సీఐ వెంకటేశ్వరరావు వీడ్ని ఎత్తుకెళ్లిపో.. వీళ్లందర్ని ఇక్కడ నుంచి లాగేయ్!... వీళ్ల ఓట్లు మాకు అక్కల్లేదు.. నేను, కలెక్టర్ దగ్గరుండి అడ్డంగా ఉన్న దేవాలయాలను పగలగొట్టిస్తాం.. మీకు చేతనైంది చేసుకోండి చూస్తాం.. ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టిస్తాం..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని).