Kesineni Srinivas
-
ఏమండోయ్ నాని గారు.. క్షమాపణలు చెప్పించండి
సాక్షి, అమరావతి : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించగా.. తాజాగా కేశినేని గత ఐదేళ్ల కాలాన్ని స్వర్ణయుగమంటూ వ్యాఖ్యానించడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తుచేసి.. చంద్రబాబు చేత క్షమాపణలు చెప్పించండని అన్నారు. (ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం) ‘ఏమండోయ్ నాని గారు (కేశినేని నాని).. చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగి పోయి, నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు. రోజుకు పదికోట్ల ప్రజల సోమ్ముతో ధర్మపోరాటం, ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశారు. నేడు మీరేమేూ గత ఐదేళ్లు స్వర్ణ యుగం, కేంద్ర మంత్రులందరు ఏపీకి అండగా నిలిచారని చెప్పారు (కేంద్రం ఇచ్చింది నిజమేలే). తన స్వార్థ రాజకీయూల కోసమే బీజేపీపై తప్పుడు ప్రచారం చేశానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినాగాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ ఫ్లె ఓవర్ ప్రారంభం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై కేశినేని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అండతోనే వంతెన నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణానికి గానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దికిగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కపార్టీలోనే ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కార్యకర్తలు సైతం విస్మయానికి గురవుతున్నారు. -
ఎంపీ కేశినేనికి లోకేష్ ఫోన్
విజయవాడ: ఎంపీ కేశినేని నానికి మంత్రి నారా లోకేష్ ఫోన్ చేశారు. బస్సుల వివాదంపై ఎవరితో మాట్లాడవద్దని ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, తాను విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదామని లోకేష్ ఆయనతో చెప్పారు. సోమ, మంగళవారాల్లో తాను చేసిన వ్యాఖ్యల గురించి కేశినేని లోకేష్‌కు వివరించారు. పార్టీ, సీఎం చంద్రబాబు, మీరూ ముఖ్యమని లోకేష్‌తో అన్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని ఏపీ రవాణ శాఖ అవినీతిమయంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. -
ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన
విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదికి పూర్తిస్థాయి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.220 కోట్ల వ్యయంతో రమేష్ ఆస్పత్రి నుంచి స్కూబ్రిడ్జి వరకు రూ.1.47 కి.మీ. మేర ఆరు వరుసల్లో నిర్మించనున్నట్లు మంత్రి దేవినేని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ చింతలు తీరతాయని, వారి చిరకాల వాంఛ తీరుబోతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4వేల కోట్లతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వంతెన అమరావతి నగరానికి గేట్ వేగా మారుతుందని ఎమ్మెల్యే గద్దె పేర్కొన్నారు. -
‘మీకు టికెట్ ఇస్తారో లేదో చూసుకోండి’
విజయవాడ: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసే అర్హత ఎంపీ కేశినేని నానికి లేదని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టిన ఘనుడు కేశినేని అని ఆయన అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ గురించి కాదు.. ముందు మీకు టీడీపీ టికెట్ ఇస్తారో లేదో చూసుకోండి. నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి స్వప్రయోజనాల కోసం కేశినేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
ఆరెంజ్ ట్రావెల్స్‌పై పోలీసుల కక్ష సాధింపు
విజయవాడ: ఆరెంజ్ ట్రావెల్స్‌పై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ట్రావెల్స్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఏడాది మార్చి 17న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో పోలీసులు ఆ బస్సును తమ ఆధీనంలో పెట్టుకున్నారు. రిలీజ్ చేయాలని కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతర్ చేశారు. బస్సును రిలీజ్ చేయొద్దని టీడీపీ నేతలు చెబుతున్నారని పోలీసులు పేర్కొనటం గమనార్హం. దీంతో పటమట పోలీస్ స్టేషన్ ఎదుట ఇవాళ ఆరెంజ్ ట్రావెల్స్ సిబ్బంది నిరసన చేపట్టారు. గతంలో ఇదే బస్సు వివాదంలో ఎంపీ కేశినేని నాని తలదూర్చారు. ఆరెంజ్ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చారు. అంతేకాకుండా అధికారులు తమ మాట వినకపోవడంతో కేశినేని నాని, బోండా ఉమ...దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
గూండాగిరీ బాధ్యులపై చర్యలేంటి?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన ఘటనలో బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ సాధారణ పరి పాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్య దర్శి, కమిషనర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు టీడీపీ నేతలైన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, మేయర్ కోనేరు శ్రీధర్‌లకు సైతం నోటీసు లిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ 13కు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల బరితెగింపుపై ‘సాక్షి’లో గత నెల 27న ‘ఐపీఎస్‌పై గూండాగిరీ’ పేరుతో ప్రచురితమైన వార్తా కథనాన్ని చూసి స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు దీనిని ఏసీజే దష్టికి తీసు కెళ్లారు. దీనిని ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కమిటీకి నివేదించగా, మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు ఏసీజే ‘సాక్షి’ కథనాన్ని పిల్‌గా పరిగణించారు. -
ఎంపీ కేశినేనికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: విజయవాడ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) కమిషనర్‌పై దాడి ఘటనలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులు 11 మందికి నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వర్ రావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, ఆంధ్రప్రదేశ్ హోం శాఖ, ట్రాన్స్ పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, ఏపీ డీజీపీ ,విజయవాడ సీపీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. -
నష్టాలొచ్చినా నడపగలిగే శక్తి నాకుంది
-
ఏడాదిగా జీతాలివ్వని కేశినేని..!
-
ఏడాదిగా జీతాలివ్వని కేశినేని..!
- పైగా అదనంగా 3 నెలల వేతనం చెల్లించినట్టు అసత్య ప్రచారం - దీంతో కేశినేని కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సిబ్బంది సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన ట్రావెల్స్ సంస్థ తమ సిబ్బందిని నట్టేట ముంచింది. దాదాపు ఏడాదిగా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కేశినేని ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డునపడ్డారు. పైగా బకాయిలతో పాటు అదనంగా మూడు నెలలు జీతాలు చెల్లించినట్లు అసత్య ప్రచారం చేయించుకుంటోంది. దీంతో కంగుతిన్న ఏపీ, తెలంగాణలోని డ్రైవర్లు, ఇతర సిబ్బంది సోమవారం విజయవాడలోని కేశినేని కార్యాలయానికి చేరుకుని సంస్థ ప్రతినిధులను నిలదీశారు. ఈ నెల 15లోగా జీతాలు చెల్లించకుంటే తమ కుటుంబాలతో సహా ఈ నెల 17న ఆందోళన దిగుతామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలోని కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది దాదాపు 80 మంది సోమవారం విజయవాడలోని సంస్థ కార్యాలయానికి వచ్చారు. రావాల్సిన బకాయిలపై సంస్థ ప్రతినిధులను నిలదీశారు. కానీ డ్రైవర్ల గోడును ఆ ప్రతినిధులు పట్టించుకోలేదు. ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో ఉన్నారని, ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరని కసురుకున్నారు. అంతకుమించి మాట్లాడితే పోలీసులతో లోపలేయిస్తామని బెదిరించారు. దీంతో సంస్థ ప్రతినిధులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేశినేని నాని ఆంతరంగికుడు ఫణి అక్కడికి చేరుకుని డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ నెల 15న వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేస్తామని, లేకపోతే 16న ఎంపీ కేశినేని నానితో చర్చకు అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారు. ఈ నెల15లోగా జీతాలు చెల్లించకపోతే కుటుంబసభ్యులతో కలసి 17న విజయవాడలో ర్యాలీ నిర్వహించి, కేశినేని నాని కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని డ్రైవర్లు, ఇతర సిబ్బంది హెచ్చరించారు. -
బేతాళ కథ చంద్రన్యాయం
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! విక్రమార్క! ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పకపోతే ‘‘సూరిబాబు సోదరులు’’ ట్రావెల్స్‌లో ప్రయాణం చేసి దుర్మరణం పాలవుదువు గాక! పట్టువదలని విక్రమార్కుడు బజాజ్ బైక్ మీద దూసుకుంటూ వస్తున్నాడు. విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడు నవ్వాడు. ‘ఏంటి విక్రమార్కా ఎప్పుడూ లేంది కొత్తగా బైక్ మీద వస్తున్నావేంటి?’ అని అడిగాడు బేతాళుడు. ‘అవును బేతాళా..! నాకా వయసు మీదకొస్తోంది. ఇదివరకటిలా నిన్ను భుజాలపై మోయాలంటే నా వల్ల కావడం లేదు. ఆయాసం వచ్చేస్తోంది. అందుకే బైక్ అయితే నువ్వు వెనకాల కూర్చుంటావ్ హాయిగా పోవచ్చు’ అన్నాడు విక్రమార్కుడు. చెట్టు కొమ్మపై వేలాడుతోన్న బేతాళుడిని దింపి బైక్ పై వెనక కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు విక్రమార్కుడు. బేతాళుడు మెచ్చుకోలుగా చూసి... ‘అది సరే కానీ... ఇపుడు నీకో కథ చెబుతాను. అలసట తెలీకుండా సావధానంగా విను’ అని చెప్పడం మొదలు పెట్టాడు.‘విక్రమార్కా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యనే నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అపుడు ఆ బస్సు డ్రైవర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే అధికారులు తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తప్పు చేస్తే ఎలాగ అని ప్రతిపక్షానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దాంతో అధికారులనే నిలదీస్తారా అని జగన్ పై కేసులు పెట్టారు. నిన్న కాక మొన్న టిడిపి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో ఆర్టీయే కమిషనర్ కార్యాలయంపైనే దాడికి దిగారు. ఏకంగా గన్‌మెన్‌ని తోసి పారేశారు. ఇంత చేసినా వారిపై ఎలాంటి కేసులూ లేవు. జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టే ముందు మంత్రివర్గమే ప్రత్యేకంగా భేటీ అయి ఆయనపై కేసులు పెట్టాలని తీర్మానించింది. మరి ఆర్టీయే కమిషనర్‌పై దాడి విషయంలో మంత్రివర్గం సమావేశం కూడా కాలేదు. ఒకే ప్రభుత్వం అపుడు అలా. ఇపుడు ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటంటావ్? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో... నీ బైక్‌తో పాటు నువ్వు కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సు కింద పడిపోతావు’ అని బేతాళుడు హెచ్చరించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణం బండి గేర్ మార్చి... ‘బేతాళా.. జగన్మోహన్ రెడ్డి అధికారులను ప్రశ్నించిన ఘటనతో ప్రభుత్వం చేసిన తప్పు బయటపడిపోయింది. దివాకర్ ట్రావెల్స్ టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డిదే కాబట్టి ప్రభుత్వ పరువు పార్టీ ప్రతిష్ఠ కూడా నాశనమవుతాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ భయంతోనే అందరి దృష్టినీ మరల్చడానికి అసలు కేసు పక్కన పెట్టి జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక కేశినేని నాని, బోండా ఉమ విషయానికి వస్తే... వాళ్లిద్దరూ చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం చేశారు. అలాగని వారిని అరెస్ట్ చేశారనుకో అప్పుడూ పార్టీ పరువు పోతుంది. పైగా వాళ్లు సొంత పార్టీ వాళ్లు కాబట్టి కాపాడుకోక తప్పదు. అందుకే వాళ్ల చేత ఉత్తుత్తి సారీలు చెప్పించి చేతులు దులిపేసుకున్నారు’ అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుని సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు బైక్‌తో సహా మాయమై చెట్టుకు వేలాడాడు. – నానాయాజీ -
ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేశినేని నాని
విజయవాడ: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ కేశినేని నాని సోమవారం ప్రారంభించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 70 ఏళ్ల స్వాతంత్ర్యం - త్యాగాలను స్మరిద్దాం పేరుతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన స్వాతంత్య్ర సమరం నాటి ఫొటోలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. -
దేవాలయాల కూల్చివేత అమానుషం
మచిలీపట్నం (చిలకలపూడి) : రహదారుల అభివృద్ధిలో భాగంగా విజయవాడలో 42 ఆలయాలను కూల్చివేయడం అమానుషమైన చర్య అని బీజేపీ బందరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ పంతం గజేంద్ర అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా ధర్నా జరిగింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డౌన్.. డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు కూల్చివేయడమే కాకుండా బీజేపీ నాయకులపై తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఆలయాలు కూల్చివేయటంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ, ఎంపీలను పరుష పదజాలంతో దూషించడం హేయమన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆలయాలను విచక్షణారహితంగా కూల్చివేస్తున్నారని ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ తదితర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా యువమోర్చ నాయకుడు చిలంకుర్తి పృధ్వీప్రసన్న మాట్లాడుతూ ఆలయాల కూల్చివేత విషయంలో బీజేపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఉడత్తు శ్రీనివాసరావు, మల్లాది వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి సుబ్బయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు వ్యూహం..బెడిసి కొట్టింది!
⇒పీఠాధిపతులు, మఠాధిపతుల సభ భగ్నానికి యత్నం ⇒మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసు అనుమతి ఇవ్వని వైనం ⇒వర్షాన్ని సైతం లెక్కచేయక తరలివచ్చిన అభిమానులు ⇒మంత్రి కామినేనికి వ్యతిరేకంగా నినాదాల హోరు ⇒ఎంపీ కేశినేని క్షమాపణ చెప్పాలని, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ ⇒దేవాలయాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ విజయవాడ : నగరంలో పది రోజులుగా జరిగిన దేవాలయాల విధ్వంసానికి వ్యతిరేకంగా పీఠాధిపతులు, మఠాధిపతులు సోమవారం నిర్వహించిన సభను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేసిన యత్నం బెడిసి కొట్టింది. దేవాలయాల కూల్చివేతపై ఆగ్రహంతో ఉన్న నగరవాసులు ఈ సభకు తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయక స్వామీజీల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. దేవాలయాలను పరిరక్షిస్తామంటూ శివస్వామి చేయించిన ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరూ చేశారు. అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు... సమావేశం నిర్వహించుకోవడానికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి నిర్వాహకులు రెండు రోజులుగా అనుమతి కోరుతున్నా పోలీసులు ఇవ్వలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్లను పరిశీలించి వెళ్లిన తరువాత.. సభ నిర్వహించుకోవడానికి రెండు గంటల సమయంలో అనుమతి ఇచ్చారు. దీంతో సమితి నిర్వాహకులు అప్పటికప్పుడు వేదికను ఏర్పాటు చేసి మూడున్నర సమయానికి పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈలోగా సభికులు కూడా తరలిరావడంతో సమావేశం ప్రారంభమై యథాతథంగా సాగింది. పీఠాధిపతులతో నిర్వహించాలనుకున్న ర్యాలీని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. దానికి అనుమతివ్వలేదు. సమావేశం వద్దకు వచ్చేవారి వాహనాలను పలుచోట్ల పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో వాహనాలను అక్కడే పార్కింగ్ చేసి కాలినడకన వేదిక వద్దకు చేరుకున్నారు. మంత్రి కామినేనికి వ్యతిరేకంగా నినాదాల హోరు... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వేదిక వద్దకు వస్తుంటే గో బ్యాక్ అంటూ కొంతమంది నినాదాలు చేశారు. ‘విగ్రహాలు కూల్చివేస్తున్నప్పుడు ఎక్కడున్నావ్.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావ్..’ అంటూ నిలదీశారు. వేదిక పైకి వచ్చిన కామినేని శ్రీనివాస్ కాసేపు కూర్చుని తన ప్రసంగం పూర్తికాగానే వెనుక నుంచి చల్లగా జారుకున్నారు. సమావేశం జరుగుతున్నంతసేపూ ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు మార్మోగాయి. పీఠాధిపతులు ప్రసంగాలు ప్రారంభించిన తరువాత మాత్రం అందరూ శ్రద్ధగా విన్నారు. దేవాలయాల కూల్చివేతలో కీలకపాత్ర పోషించిన ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎలకు వ్యతిరేకంగా స్వామీజీలు మాట్లాడినప్పుడు సభలో పాల్గొన్నవారు చప్పట్లు కొట్టి హర్షం తెలియచేశారు. ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ అహ్మద్‌బాబును, కమిషనర్ వీరపాండియన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సమావేశంలో అన్ని విషయాలూ చర్చించుకుందామని నిర్వాహకులు వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు. ఇక ఏ దేవాలయం జోలికి వచ్చినా... రాష్ట్రంలోని అన్ని దేవాలయాల సమాచారం తమకు పంపించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధి కొనగళ్ల విద్యాధరరావు సూచించారు. ఆయా దేవాలయాలను ప్రభుత్వం, అధికారులు తొలగించాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల ప్రతినిధులందరినీ సంఘటితం చేసేందుకు తమ సమితి వేదికవుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దేవాలయాలను పరిరక్షిస్తామని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటామని, గోవులను రక్షించే విషయంలో ఏ విధమైన అవాంతరాలు ఎదురైనా కలిసికట్టుగా ఎదిరిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. -
టీడీపీ, బీజేపీ నేతల మధ్య ముదిరిన వివాదం
పీఠాధిపతుల ర్యాలీని నీరుగార్చేందుకు ప్రభుత్వ యత్నం నిర్వహించేందుకే హిందూధర్మ పరిరక్షణ కమిటీ నిర్ణయం టీడీపీ, బీజేపీ నేతల మధ్య ముదిరిన వివాదం గోశాలలో ఇరువర్గాల బాహాబాహీ నరేంద్రమోదీపై ఎంపీ కేశినేని నాని ఫైర్ హుటాహుటిన ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు కేంద్రం, రాష్ట్రంలో మిత్రపక్షాలుగా అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆలయాల కూల్చివేత అంశం చిచ్చురగిల్చింది. పైచేయి సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సోమవారం విజయవాడలో పీఠాధిపతులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్న నేపథ్యంలో పరిస్థితిని చల్లబరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన ఐదుగురు మంత్రులతో కమిటీని వేసింది. విజయవాడ : ఆలయాలను రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగా కూల్చివేయడంతో పది రోజులుగా విజయవాడ నగరం వేడెక్కింది. సాక్షిలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో రాజధాని పరిధిలో ఏ ఇద్దరు కలిసినా ఆలయాల కూల్చివేతపైనే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ అంశమే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో నేపథ్యంలో సోమవారం పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు, స్వామీజీలు, హిందూ ధర్మపరిరక్షణ సమితి ముఖ్యలు వన్‌టౌన్‌లోని వినాయకుడు గుడి నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని విజయవంతం చేసేందుకు హిందూధర్మ పరిరక్షణ కమిటీ ప్రయత్నిస్తుండగా, నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం చర్యలు ప్రారంభించింది. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ నేతలు ఆలయాల కూల్చివేత విషయంలో వైరివర్గాలుగా మారారు. అంతటితో ఆగకుండా ఆదివారం బాహాబాహీకి దిగారు. ఫలితంగా నగరంలో ఉద్రిక్తత నెలకొంది. పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. మంత్రుల కమిటీ ఏర్పాటు ఆలయాలను కూల్చివేసిన పదిరోజుల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఐదుగురు మంత్రులతో కమిటీని వేశారు. మాణిక్యాలరావు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాసరావుతో కూడిన ఈ కమిటీ ఆది వారం సాయంత్రం హడావుడిగా సమావేశమై ఆలయాల కూల్చివేతపై చర్చించింది. ఈ సమావేశానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. భేటీ అనంతరం కూల్చిన ఆలయాలను పరిశీలించిన కమిటీ వాటిని పునర్నిర్మిస్తామంటూ హామీ ఇచ్చింది. ఎప్పటిలోగా నిర్మిస్తామనేది స్పష్టమైన హామీ ఇవ్వలేదు. బీజేపీ నేతలతోనూ మాట్లాడామని.. ఇక ఆలయాలు విషయంలో ఏ విధమైన ఇబ్బందీ ఉండబోదంటూ సర్ది చెప్పేందుకు మంత్రులు ప్రయత్నించారు. మంత్రుల హామీతో తృప్తి చెందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు సోమవారం పీఠాధిపతుల ర్యాలీని యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయాల కూల్చివేతపై భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ర్యాలీకి పీఠాధిపతులు, మఠాధిపతులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రాకపోయినా వెనక్కు తగ్గకూడదని భావిస్తున్నారు. బీజేపీ నేతలపై బుద్దా వర్గం దాడి బీజేపీ నేతలకు మిత్రపక్షం నుంచే ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. నగరంలో కూల్చివేసిన ఆలయాలను పరిశీలించిన అనంతరం గోశాలను పరిశీలించిన బీజేపీ అత్యుత్తమ కమిటీ ప్రతినిధులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ప్రధాన కార్యాదర్శి సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వర్గంతో వచ్చి వారిని అడ్డుకున్నారు. విలేకరులతో మాట్లాడకుండా వాగ్వాదానికి దిగారు. రెండు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగడంతో పోలీ సులు కల్పించుకుని బీజేపీ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో సురేష్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడాల్సి వచ్చింది. -
అరే.. ఎవడ్రా వీడు..వీళ్ల ఓట్లు మాకు అక్కర్లేదు
దేవుడా... అభివృద్ధి పేరుతో ఆలయాల విధ్వంసం నిన్న శనీశ్వరాలయం.. సీతమ్మవారి పాదాలు... నేడో రేపో విజయేశ్వరస్వామి.. వినాయక గుళ్లు ? అర్జున వీధి 100 అడుగుల విస్తరణ, గోశాల వద్ద మరోసారి స్థల సేకరణ ధర్మ పరిరక్షణ సంఘం నేతలపై ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు అర్ధరాత్రి వేళ గజదొంగలు ఊళ్లు, ఇళ్లపై పడి కొల్లగొట్టడం ఇప్పటివరకు మనం విన్నాం.. నగరం నిద్దరోయాక ప్రభుత్వ అధికారులు దర్జాగా దగ్గరుండి మరీ ప్రాశస్త్యం గల ఆలయాలను ధ్వంసం చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అంతేకాదు విగ్రహాలను మాయం చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులను ఒకరోజు ముందే అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసు బలంతో, అధికార మదంతో సర్కారు సాగిస్తున్న అరాచకం పరాకాష్టకు చేరింది. ఇప్పుడు వీరి కన్ను కెనాల్ రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి, విజయేశ్వరస్వామి ఆలయాలపై పడింది. విజయవాడ సెంట్రల్ : రాజధాని నగరంలో దేవుళ్లకు రక్షణ కరువైంది. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. మందపల్లి తరువాత అంతటి చరిత్ర గల శనీశ్వరస్వామి ఆలయాన్ని, 90 ఏళ్ల నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి గుడిని, భవానీపురంలోని స్వయంభు అమ్మవారి ఆలయాన్ని అధికారులు ఇటీవలే ధ్వంసం చేశారు. సీతమ్మవారి పాదాలను పెకలించారు. రోడ్ల విస్తరణ, సుందరీకరణ పేరుతో అడ్డగోలుగా ఆలయాలు, మసీదులు, చర్చిలను కూలగొడుతున్నారు. భవానీపురం, వన్‌టౌన్, రామవరప్పాడు, గవర్నర్‌పేట, కృష్ణలంక, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 44 ఆలయాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాలను సాకుగా చూపి అడ్డగోలుగా ప్రార్థనాలయాలను ధ్వంసం చేస్తున్నారు. చారిత్రక ప్రాశస్త్యం గల ప్రార్థనాలయాలను కూల్చివేయాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇచ్చి, ప్రత్యామ్నాయ స్థలాలను చూపాల్సిన బాధ్యతను మాత్రం అధికారులు విస్మరిస్తున్నారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. అర్ధరాత్రి అవుతోందంటే.. ఆలయ కమిటీలకు వణుకే.. అర్ధరాత్రి అవుతోందంటే ఆలయ కమిటీలకు వణుకు పుడుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు భారీ సంఖ్యలో వెళ్లి ఆలయాలను కూలగొడుతున్నారు. అడ్డువచ్చే వారిపై కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యుల్ని ముందురోజే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పవిత్రంగా చూసుకొనే ఆలయాల్లోకి అధికారులు, సిబ్బంది చెప్పులు, బూట్లతో వెళ్లి విగ్రహాలను తొలగించడంతో భక్తులు నొచ్చుకుంటున్నారు. ఈ విధుల్లో పాల్గొనే కొందరు సిబ్బంది మద్యం సేవించి ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ బాబు.ఎ పోకడలపై అన్ని వర్గాల ప్రజలూ మండిపడుతున్నారు. ఆలయ ప్రాశస్త్యం ఇదీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కెనాల్ రోడ్డులో 1940లో నిర్మించారు. కోరి కొలిచే భక్తులకు కొంగుబంగారమై స్వామివారు భాసిల్లుతున్నారు. కాణిపాకం వినాయకుడి గుడి తరువాత అంతటి ప్రసిద్ధి చెందినదిగా ఈ ఆలయానికి పేరుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకొనే భక్తులు ముందుగా గణపయ్యకు ప్రణమిల్లుతారు. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారు ఇక్కడి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర సందర్భంగా నగరానికి వచ్చినప్పుడు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు. అరే.. ఎవడ్రా వీడు.. సీఐ వెంకటేశ్వరరావు వీడ్ని ఎత్తుకెళ్లిపో.. వీళ్లందర్ని ఇక్కడ నుంచి లాగేయ్!... వీళ్ల ఓట్లు మాకు అక్కల్లేదు.. నేను, కలెక్టర్ దగ్గరుండి అడ్డంగా ఉన్న దేవాలయాలను పగలగొట్టిస్తాం.. మీకు చేతనైంది చేసుకోండి చూస్తాం.. ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టిస్తాం..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని). -
‘మహా’గణపతిం.. మనసాస్మరామి..
విజయవాడ కల్చరల్ : రాజధాని నగరం విజయవాడలో తొలిసారిగా ఏర్పాటుచేసిన 63 అడుగుల భారీ గణనాథుడు భక్తులను కనువిందు చేశాడు. మహా గణపతిని దర్శించేందుకు గురువారం లక్షలాదిగా తరలిరావడంతో దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డూండీ గణేశ సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో గురువారం ఉదయం కలశస్థాపన, మూర్తి ప్రాణప్రతిష్ఠ, ఏకవిశంతి పత్రిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రామారావు బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన 6,300 కేజీల లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్వామిని దర్శించి పూజలు చేశారు. సాయంత్రం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన నృత్యప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. లాస్య కూచిపూడి అకాడమి, అభినయ ఆర్ట్స్ అకాడమి చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు అలరించాయి. కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రేడియో జాకీ వేణుశ్రావణ్ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 11 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వేదిక కన్వీనర్ శ్రీనాథుని గంగాధర రామారావు ‘సాక్షి’కి తెలిపారు. ట్రాఫిక్ సమస్య భారీ గణనాథుడ్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించింది. బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. నిర్వాహకుల బంధుజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సామాన్యులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలుమార్లు భక్తులు నిర్వాహకులతో ఘర్షణ పడ్డారు. వివాదాస్పద మైన చానల్ నిర్వాకం డూండీ గణేశ సేవా సమితి నిర్వాహకులు 63 అడుగుల భారీ గణనాథుడిని ఏర్పాటుచేయగా, అదంతా తామే చేశామని, విగ్రహాన్ని కమిటీతో కలిపి తామే ఏర్పాటుచేశామని ఓ వార్త చానల్ ప్రసారం చేయడంపై కమిటీ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండుగ రోజు ఆ చానల్లో పలుమార్లు ఇదే విషయం ప్రసారం చేయడం, చానల్‌కు సంబంధించిన బ్యానర్లు విగ్రహం వద్ద ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కోగంటి సత్యం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉత్సవాలను డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నామని, చానల్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. -
మోదీని కలిసిన ఎంపీ కేశినేని
విజయవాడ : నియోజకవర్గ పరిధిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి సంబంధించి చేపట్టనున్న ప్రణాళికలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని అందజేశారు. బుధవారం పార్లమెంట్ భవన్ పదో చాంబర్లో ఎంపీ నాని పీఎంను కలిసి నియోజకవర్గపరిధిలో చేపడుతున్న పథక ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని ప్రధానమంత్రితో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గొల్లమందల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు వివరించారు. సంసద్ ఆదర్శ గ్రామాల అభివృద్ధికి కేంద్ర గ్రామీణ శాఖ రూపొందించిన 71 పారా మీటర్ల అంశాల మేరకు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసినందుకు, పార్లమెంటు పరిధిలో 263 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారంతో చేస్తున్న కార్యక్రమాలపై పీఎం ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు. టాటా ట్రస్ట్ తయారుచేసిన సూక్ష్మప్రణాళిక పూర్తి నివేదికను సమర్పించే కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ ప్రధాని మోదీని ఆహ్వానించగా వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు నాని పేర్కొన్నారు. -
టాప్ సీక్రెట్!
మంత్రి ఉమ ఇంటికి వెళ్లిన ఎంపీ కేశినేని నాని ఇద్దరూ కలిసి ఒకే కార్లో ప్రయాణం విజయవాడ : తెలుగుదేశం పార్టీలో వైరి వర్గాలు ఒక్కటయ్యాయా.. ఉన్నట్లుండి ఇరువురు ముఖ్య నేతలు ఒకే కారులో వెళ్లడం వెనుక అంతర్యం ఏమిటీ.. అంటూ సొంత పార్టీ నాయకులే ముక్కునవేలేసుకున్నారు. ఇప్పటివరకు టీడీపీకి చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మంత్రి ఉమ అందరినీ కలుపుకొని వెళ్లాలంటూ ఎంపీ కేశినేని నాని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ క్యాడర్ కూడా రెండుగా విడిపోయి పదవుల కోసం పోటీ పడ్డాయి. దీంతో ఇరువురు కలిసి పని చేయాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హితవు పలికారు. నేరుగా చంద్రబాబు కేశినేనిని ఇంటికి పిలిపించి మరీ చెప్పి పంపించారు. అయినా, కొన్ని సందర్భాల్లో ఎంపీ నాని మాత్రం మంత్రి ఉమ తీరును తప్పుపడుతూనే ఉన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద పైలాన్ విషయంలో మూడు రోజుల క్రితం ఎంపీ, మంత్రి వర్గీయులు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరువురు నేతలు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలిసి ఉండటం విశేషం. చంద్రాలలో ఆటల పోటీలు ప్రారంభించిన తర్వాత మైలవరంలోని ఆస్పత్రికి వెళ్లి లోకేశ్ జన్మదిన వేడుకల్లోనూ పాల్గొన్నారు. అర్ధగంటపాటు చర్చలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేతలు కేశినేని, దేవినేని ఏకంగా ఒకే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనేది మాత్రం టాప్ సీక్రెట్. ఎంపీ కేశినేని నాని ఉదయం చంద్రాలలో జరిగే 78 గ్రిగ్ పోటీలు ప్రారంభించేందుకు వెళుతూ గొల్లపూడిలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఇంటికి వచ్చారు. ఇద్దరు సుమారు అరగంట పాటు ఇంట్లో మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనేది మాత్రం వెల్లడి కాలేదు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి ప్రయత్నించగా, మళ్లీ మాట్లాడతామని బదులిచ్చారు. మొత్తంమీద ఈ పరిణామం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. -
హాట్ సీట్
ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ బుద్దా వెంకన్నకు ఎంపీ కేశినేని నాని మద్దతు బచ్చుల అర్జునుడి వైపు మొగ్గు చూపుతున్న మంత్రి దేవినేని ఉమ సీఎంను ప్రసన్నం చేసుకునే పనిలో పంచుమర్తి అనూరాధ నాకే ఇవ్వాలంటున్న వర్ల రామయ్య విజయవాడ : తెలుగుదేశం పార్టీలో పదవుల పోరు ముదురు పాకానపడింది. ఇప్పటికే స్థానిక పదవులు తమకంటే.. తమకంటూ.. అక్కడక్కడా టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగుతున్నారు. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి కేటారుుంచాలనే విషయంపై గుడివాడలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని, ఇప్పటికిప్పుడు వచ్చిన కార్పొరేట్ నాయకులకు పదవులు ఎలా ఇస్తారంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బుద్దా వెంకన్న పరిస్థితేంటి.. : ఎమ్మెల్సీ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బుధవారం రాత్రి గుడివాడలో టీడీపీ ముఖ్య నాయకులు సమావేశమై చర్చించారు. తనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మంత్రి దేవినేని ఉమాను కోరారు. అయితే, మంత్రి ఉమ మాట్లాడుతూ ‘మీరు అప్పీలు చేశారు. పరిశీలిద్దాం..’ అన్నారు. దీంతో బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు విషయం పరిశీలనకే పరిమితమనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే తన వద్దకు అర్జునుడు, వర్ల రామయ్య పేర్లు వచ్చినట్లు మంత్రి చెప్పడంతో బుద్దా వెంకన్నకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడిన వెంకన్నకు తర్వాత పదవులు చాలా ఉన్నాయంటూ నచ్చజెప్పి బాగా ఖర్చు చేరుుంచారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది. దీంతో మంత్రి తీరుపై బుద్దా వెంకన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అరుుతే, ఎన్నికల సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని, దానిని దృష్టిలో పెట్టుకుని తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. మంత్రి మద్దతు ఎవరికీ..? : మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ అరుుతే తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారంటూ నేరుగా ఆయనతో మాట్లాడేందుకే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు ఎవరికనేది ఇంకా స్పష్టంకాలేదు. అరుుతే టీడీపీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడుకే ఆయన మద్దతు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడుముక్కలాటే.. బీసీలకే తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. బుద్దా వెంకన్న, పంచుమర్తి అనూరాధ, బచ్చుల అర్జునుడు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనే విషయం చర్చనీయూంశమైంది. వర్ల రామయ్య కూడా తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. సీనియర్ నాయకుడినైన తనను మరిచిపోవద్దంటూ పలువురికి ఇప్పటికే విన్నవించారు. అయితే, బీసీలకు తప్ప ఎస్సీలకు అవకాశం లేదని, ఏదైనా ఉంటే పరిశీలిద్దామంటూ కొందరు నాయకులు చెప్పినట్లు సమాచారం. ఎవరి మాట నెగ్గేనో...: మంత్రి దేవినేని ఉమా బచ్చుల అర్జునుడికే తన మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇక.. ఎంపీ కేశినేని నాని పార్టీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నారు. ఈ ఇద్దరి మద్దతుదారుల్లో ఎవరిని పదవి వరిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉమా తీరుపై ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నందున తప్పకుండా ఎంపీ అనుచరుడికే ఎక్కువ అవకాశం లభిస్తుందనేది టీడీపీలో పలువురి వాదన. మరోపక్క పంచుమర్తి అనూరాధ ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. అవసరమైతే ఎంత ఖర్చుచేసైనా పదవిని చేజిక్కించుకోవాలని, ఇందుకు చంద్రబాబు ద్వారా ప్రయత్నం చేయడమే సరైన మార్గమనే ఆలోచనలో ఆమె ఉన్నారు. మంచి రాజకీయ అవగాహన కలిగిన అనూరాధ మేయర్‌గా పనిచేసి నగరంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో మొదట అనుకున్న ప్రకారం అనూరాధకే పదవి దక్కే అవకాశమూ లేకపోలేదు. -
పనిచేయని సుజనా సూత్రం.. తెరపైకి బీసీల ఐక్యమంత్రం!
మంత్రి ఉమాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న బీసీ ఎమ్మెల్యేలు అండగా మరో మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ సమస్యలపై సీఎం వద్దే తేల్చుకోవాలని నిర్ణయం విజయవాడ : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య అదిపత్యపోరు రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ జిల్లా పరిశీలకుడు సుజనా చౌదరి చేసిన ఉపదేశం ఏమాత్రం పనిచేయలేదు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా జిల్లాలోని సొంత పార్టీకే చెందిన ఒక మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఉమా తీరుపై బీసీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఎంపీ కేశినేని నాని స్పష్టంచేశారు. ‘పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రి ఉమా వైఖరిపై ఆక్రోశంతో ఉన్నారు. కానీ, ఎవరూ బయటపడటంలేదు. నేను మాత్రమే బయపడుతున్నా..’ అని కేశినేని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుజనాచౌదరి నగరానికి వచ్చి సమావేశం ఏర్పాటుచేసి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నేతల మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. అయితే, కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తాము సుజనా చౌదరి చెబితే సర్దుకుపోలేమని, నేరుగా సీఎం వద్దే తేల్చుకుంటామని వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. మంత్రి ఉమాకు చెక్ పెట్టేందుకు..! నామినేటెడ్ పోస్టుల విషయంలో మంత్రి ఉమా ఆదిపత్యానికి చెక్ పెట్టి తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు కలిసి రెండు రోజుల క్రితం జిల్లాలోని ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ మంత్రి దేవినేని తీరుపైనే చర్చ సాగినట్లు తెలిసింది. జిల్లాలో ఒక ఎంపీతోపాటు పలువురు బీసీ నేతలు ఉన్నారు. వీరికి కాపు సమాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే బీసీ నేతలకు అండగా నిలిచి ఆ వర్గానికి నేతగా తాను చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది. సీఎం వద్దకు పంచాయితీ! ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. సీఎం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఆ సమయంలో సీనియర్ నేతలు తమ ఆవేదనను సీఎంకు వివరించే అవకాశం ఉందని సమాచారం. సీఎం కూడా పార్టీకి సంబంధించి నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. -
టీడీపీలో పవన్ కల్లోలం!
విజయవాడ పార్లమెంట్ సీటుపై తెలుగు దేశం పార్టీలో గందరగోళం నెలకొనడానికి పవన్ కళ్యాణ్ కారణమని మీడియా కోడై కూస్తోంది. పవన్ వల్లే కేశినేని శ్రీనివాస్(నాని)కి విజయవాడ సీటు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడ స్థానానికి పవన్ కళ్యాణ్ తరపున అభ్యర్థిని సూచించమని టీడీపీ కోరిందట. దీంతో తనకు సన్నిహితుడైన నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పేరును పవన్ సూచించడంతో గందరగోళం మొదలయిందంటున్నారు. కేశినేని బుజ్జగించేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినట్టు సమాచారం. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఎంచుకోవాలని నానికి సూచించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేసేందుకు మానసికంగా సిద్దమయ్యానని, విజయవాడ సీటు తనకే ఇవ్వాలని చంద్రబాబును నాని కోరినట్టు తెలిసింది. విజయవాడ ఈస్ట్ స్థానంలో దేవినేని నెహ్రూ, వంగవీటి రాధలతో తలపడడం కష్టమని నాని భావిస్తున్నారు. పెనమలూరులో మాజీ మంత్రి పార్థసారథి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని వెనుకంజ వేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న తనకే టికెట్ వస్తుందని భావించిన కేశినేని నానికి ఇప్పుడు ఊహించని విధంగా పవన్ ఎఫెక్ట్ తగిలింది. పవన్ సూచించిన పొట్లూరికే విజయవాడ టీడీపీ టిక్కెట్ ఖాయమంటున్నారు. అసలు వరప్రసాదే వెనుకుండి పవన్ కళ్యాణ్‌తో జనసేన పార్టీ పెట్టించారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ పార్టీకి పెట్టుబడి పెట్టింది కూడా పొట్లూరి అని కూడా అంటున్నారు. అందుకే విజయవాడ సీటుకు ఆయన పేరును పవన్ సూచించారని చెబుతున్నారు. -
కేశినేనికి చంద్రబాబు షాక్!
విజయవాడ: కేశినేని శ్రీనివాస్(నాని)కి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై నాని పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. విజయవాడ లోక్‌సభ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో కేశినేని హతాశులయ్యారు. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాని సుముఖంగా లేరని సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తనకే ఎంపీ సీటు వస్తుందన్న దీమాతో ఉన్న నాని పార్టీ నిర్ణయంతో అవాక్కయ్యారు. సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు టిక్కెట్టు రాకపోవడంపై చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని నాని తెలిపారు. వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్రావులకు ఇప్పటికే చేయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేశినేనికి షాక్ ఇచ్చారు. కొత్త పేర్లను తెరపైకి తెచ్చారు. కేఎల్ యూనివర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, ఎన్నారై కోమటి జయరాం పేర్లపై అభిప్రాయ సేకరణ జరిపి చంద్రబాబు తనదైన రాజకీయం ప్రదర్శించారు. -
తెలుగుదేశంలో సీట్ల లొల్లి
సాక్షి, విజయవాడ : ఆశావహుల సంఖ్య పెరిగిపోవడంతో విజయవాడ పార్లమెంట్ స్థానంపై ప్రతిష్టంభన తొలగలేదు. పాదయాత్ర సందర్భంగా ఎంపీ సీటు ఇస్తామంటూ కేశినేని శ్రీనివాస్ (నాని)ని తెరపైకి తెచ్చి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు ఖర్చుచేయించారు. ఇప్పుడాయన స్థానంలో పారిశ్రామికవేత్త పీవీపీ ప్రసాద్, ఎన్ఆర్ఐ కోమటి జయరాం పేర్లు పరిశీలిస్తున్నారు. పార్టీకి రూ.25 కోట్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఏదో విధంగా చంద్రబాబును ఒప్పించి భీపారం తెచ్చుకునేందుకు కేశినేని శ్రీనివాస్ హైదరాబాద్‌లోనే మకాంవేశారు. సీటు వచ్చేదెవరికో.. రానిదెవరికో.. అవనిగడ్డ సీటు కోసం స్థానిక నేతలతోపాటు పార్టీలోకి నూతనంగా వచ్చిన మాజీ మంత్రి బుద్ధప్రసాద్, ముత్తంశెట్టి కృష్ణారావు పోటీ పడుతున్నారు. బుద్ధప్రసాద్ తాను సీనియర్ని అంటుంటే, జెడ్పీ ఎన్నికల్లో రూ.25 కోట్లు ఖర్చుచేసినందున తనకే ఇవ్వాలని ముత్తంశెట్టి పట్టుబడుతున్నారు. కైకలూరు సీటును ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కోరుతుండగా, మాజీ మంత్రి పిన్నమనేని కూడా కన్నేశారు. బందరు సీటుకు నియోజకవర్గ ఇన్చార్జి కొల్లు రవీంద్రతోపాటు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ లంకిశెట్టి బాలాజీల మధ్య పోటీ నడుస్తోంది. నూజివీడు సీటు కోసం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, బచ్చుల అర్జునుడు మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.పద్మజ్యోతితో మంచి డీల్ కుదిరితే ఆమెకు తిరువూరు, నందిగామల్లో ఒక సీటు కేటాయించాలని.. లేనిపక్షంలో అక్కడ పార్టీ తరఫున పనిచేస్తున్న నల్లగట్ల స్వామిదాస్, తంగిరాల ప్రభాకర్లకే సీటు కేటాయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గరంగరంగా గన్నవరం.. గన్నవరం పేరెత్తితేనే టీడీపీ నేతలకు వెన్నుల్లో చలిపుట్టుకొస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, ఆయన సోదరుడు దాసరి జైరమేష్ హైదరాబాద్‌లోనే మకాం పెట్టి సీటు తమకే కావాలంటూ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వల్లభనేని వంశీ మోహన్ కూడా ఈ సీటు కోసం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. టికెట్ విషయంలో ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చివరి నిమిషం వరకు ఈ సీటు ఖరారు కాదంటున్నారు. ఈ సీట్ల మాటేమిటి.. విజయవాడ సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయించగా.. తనకే కావాలంటూ బొండా ఉమామహేశ్వరరావు పట్టుబడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం ముస్లింలతోపాటు వైశ్యులు రంగంలోకి దిగారు. వన్‌టౌన్‌కు చెందిన ఒక ఆడిటర్ రూ.5 కోట్లతో సీఎం రమేష్ వద్ద కూర్చుని సీటు కోసం పైరవీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మరికొంతమంది వైశ్యులు రంగంలోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లిం పెద్దలు హైదరాబాద్ వెళ్లి నాగుల్‌మీరా లేదా ఖలీల్లలో ఒకరికి సీటు ఇవ్వాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పు సీటు కోసం గద్దె రామ్మోహన్, సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీటు దక్కకపోతే తిరుగుబాటు చేయడానికి రామ్మోహన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సినీనటుడు బాలకృష్ణ సీటు ఖరారయితే తప్ప పెనమలూరు సీటు ఖరారు కాదు. ఇక్కడ నుంచి కూడా ఐదారుగురు ఆశావహులు ఉండడంతో ఈ సీటు కేటాయింపు చివర్లో జరగవచ్చు. -
దేవినేని ఉమా అసంతృప్తి !
సాక్షి, విజయవాడ : టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) తనపై దుష్ర్పచారం చేస్తూన్నారంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా పార్టీ పరిశీలకుడు సుజానాచౌదరి వద్ద ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌డే ఉత్సవాలతో పాటు పార్టీకి సంబంధించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సుజానా చౌదరి ఆదివారం మధ్యాహ్నం బందరురోడ్డులోని ఒక హోటల్లో బస చేసినప్పుడు దేవినేని ఉమా వ్యక్తిగతంగా కలిసి తన నిరసన తెలియజేశారు. కేశినేని నాని తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా జిల్లాలోని పార్టీ ముఖ్యనేతల వద్ద మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తన ప్రతిష్టే కాకుండా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుదని చెప్పారు.ఈ అంశాన్ని తాను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లతానని చెప్పగా, సుజనా చౌదరి వారించి పరిస్థితిని ఇక్కడే చక్కదిద్దుకుందామని సర్థి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణులకు తలనొప్పి.... ఇప్పటికే కేశినేని, దేవినేని మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పోరు తారాస్థాయికి చేరుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే జి ల్లాలో పార్టీ తీరు అంతంత మాత్రంగా ఉండగా... ఇ ప్పుడు ఇరువురు ముఖ్యనేతలు నువ్వా-నేనా అన్న ట్లు తలపడుతూ ఉండటం కలవరపాటుకు గురిచేస్తుంది. చంద్రబాబు వద్దకు జిల్లా ముఖ్యులు.... నగరంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు పార్ధీవశరీరాన్ని చూడడానికి హైదరాబాద్ వెళ్లారు. అక్కినేని మృతదేహాన్ని సందర్శించిన అనంతరం వారంతా వెళ్లి చంద్రబాబునాయుడ్ని కలిశారు. అదే సమయంలో జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి చర్చకు రాగా కేశినేని-దేవినేని మధ్య విభేదాలు, ఇటీవల కాళేశ్వరీ రవీ ప్లెక్సీల వివాదం గురించి వివరించినట్లు తెలిసింది. దీంతో పరిస్థితి చక్కదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చి వారిని పంపారని సమాచారం. -
కేశినేనిపై బాలయ్య అభిమానుల గుర్రు!
సాక్షి, విజయవాడ: టీడీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) కాళేశ్వరీ ట్రావెల్స్ అధినేత చలసాని రవి మధ్య ప్రారంభమైన ఫ్లెక్సీల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఎన్టీఆర్ సొంత జిల్లాలోనే సినీనటుడు బాలకృష్ణ ఫొటోలను తీసివేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నాని హుకుం జారీ చేయడాన్ని బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలయ్య ఫ్లెక్సీలు కానీ, ఫొటోలు కానీ తీయించి వేసే సాహసం ఇప్పటి వరకు జిల్లాలో ఏ తెలుగుదేశం నాయకుడు చేయలేదని, కేశినేని నాని ఏ అండ చూసుకుని ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. సామాజిక వర్గంలోనూ చర్చ..... కేశినేని నాని, కాళేశ్వరీ రవి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ముఖ్యంగా జిల్లాలో బలంగా ఉన్న ఈ సామాజికవర్గంలో ఉన్న ఈ ఇరువురు ముఖ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకోవడం సామాజిక వర్గంలో కలకలం రేపింది. ‘తెలుగుదేశంలో ప్లెక్సీల లొల్లి’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం ఈ సామాజిక వర్గంలో చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే ఇదే సామాజిక వర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమాతో, గద్దె రామ్మోహన్‌కు సఖ్యత లేకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. చీలిపోతున్న ట్రాన్స్‌పోర్టు రంగం.... సీమాంధ్ర ప్రాంతంలో ట్రావెల్స్ యజ మానులంతా కేశినేని ట్రావెల్స్, కాళేశ్వరీ ట్రావెల్స్ అధినేతల కన్ను సన్నల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య వ్యాపార పరంగా తప్ప వ్యక్తిగతంగా విభేధాలు లేకపోవడంతో ట్రాన్స్‌పోర్టు రంగంలోని వారంతా ఇద్దరితోనూ కలిసిమెలిసి ఉంటున్నారు. ప్రస్తుతం కేశినేనినాని, కాళేశ్వరీ రవి మధ్య ఏర్పడిన వివాదం ముదరడంతో ట్రాన్స్‌పోర్టు రంగాన్ని కూడా కుదిపేస్తోంది. అయితే బాలకృష్ణ ఎప్పుడు వచ్చినా కేశినేని నానిని పట్టించుకోకుండా కాళేశ్వరీ రవితోనే ఉండటం కేశినేనికి ఆగ్రహం తెప్పించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.