
హాట్ సీట్
ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ
బుద్దా వెంకన్నకు ఎంపీ కేశినేని నాని మద్దతు
బచ్చుల అర్జునుడి వైపు మొగ్గు చూపుతున్న మంత్రి దేవినేని ఉమ
సీఎంను ప్రసన్నం చేసుకునే పనిలో పంచుమర్తి అనూరాధ
నాకే ఇవ్వాలంటున్న వర్ల రామయ్య
విజయవాడ : తెలుగుదేశం పార్టీలో పదవుల పోరు ముదురు పాకానపడింది. ఇప్పటికే స్థానిక పదవులు తమకంటే.. తమకంటూ.. అక్కడక్కడా టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగుతున్నారు. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి కేటారుుంచాలనే విషయంపై గుడివాడలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని, ఇప్పటికిప్పుడు వచ్చిన కార్పొరేట్ నాయకులకు పదవులు ఎలా ఇస్తారంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బుద్దా వెంకన్న పరిస్థితేంటి.. : ఎమ్మెల్సీ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బుధవారం రాత్రి గుడివాడలో టీడీపీ ముఖ్య నాయకులు సమావేశమై చర్చించారు. తనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మంత్రి దేవినేని ఉమాను కోరారు. అయితే, మంత్రి ఉమ మాట్లాడుతూ ‘మీరు అప్పీలు చేశారు.
పరిశీలిద్దాం..’ అన్నారు. దీంతో బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు విషయం పరిశీలనకే పరిమితమనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే తన వద్దకు అర్జునుడు, వర్ల రామయ్య పేర్లు వచ్చినట్లు మంత్రి చెప్పడంతో బుద్దా వెంకన్నకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడిన వెంకన్నకు తర్వాత పదవులు చాలా ఉన్నాయంటూ నచ్చజెప్పి బాగా ఖర్చు చేరుుంచారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది. దీంతో మంత్రి తీరుపై బుద్దా వెంకన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అరుుతే, ఎన్నికల సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని, దానిని దృష్టిలో పెట్టుకుని తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నారు.
మంత్రి మద్దతు ఎవరికీ..? : మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ అరుుతే తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారంటూ నేరుగా ఆయనతో మాట్లాడేందుకే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు ఎవరికనేది ఇంకా స్పష్టంకాలేదు. అరుుతే టీడీపీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడుకే ఆయన మద్దతు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
మూడుముక్కలాటే..
బీసీలకే తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. బుద్దా వెంకన్న, పంచుమర్తి అనూరాధ, బచ్చుల అర్జునుడు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనే విషయం చర్చనీయూంశమైంది. వర్ల రామయ్య కూడా తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. సీనియర్ నాయకుడినైన తనను మరిచిపోవద్దంటూ పలువురికి ఇప్పటికే విన్నవించారు. అయితే, బీసీలకు తప్ప ఎస్సీలకు అవకాశం లేదని, ఏదైనా ఉంటే పరిశీలిద్దామంటూ కొందరు నాయకులు చెప్పినట్లు సమాచారం.
ఎవరి మాట నెగ్గేనో...: మంత్రి దేవినేని ఉమా బచ్చుల అర్జునుడికే తన మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇక.. ఎంపీ కేశినేని నాని పార్టీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నారు. ఈ ఇద్దరి మద్దతుదారుల్లో ఎవరిని పదవి వరిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉమా తీరుపై ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నందున తప్పకుండా ఎంపీ అనుచరుడికే ఎక్కువ అవకాశం లభిస్తుందనేది టీడీపీలో పలువురి వాదన. మరోపక్క పంచుమర్తి అనూరాధ ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. అవసరమైతే ఎంత ఖర్చుచేసైనా పదవిని చేజిక్కించుకోవాలని, ఇందుకు చంద్రబాబు ద్వారా ప్రయత్నం చేయడమే సరైన మార్గమనే ఆలోచనలో ఆమె ఉన్నారు. మంచి రాజకీయ అవగాహన కలిగిన అనూరాధ మేయర్‌గా పనిచేసి నగరంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో మొదట అనుకున్న ప్రకారం అనూరాధకే పదవి దక్కే అవకాశమూ లేకపోలేదు.