మోదీని కలిసిన ఎంపీ కేశినేని
విజయవాడ : నియోజకవర్గ పరిధిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి సంబంధించి చేపట్టనున్న ప్రణాళికలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని అందజేశారు. బుధవారం పార్లమెంట్ భవన్ పదో చాంబర్‌లో ఎంపీ నాని పీఎంను కలిసి నియోజకవర్గపరిధిలో చేపడుతున్న పథక ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని ప్రధానమంత్రితో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గొల్లమందల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు వివరించారు.
సంసద్ ఆదర్శ గ్రామాల అభివృద్ధికి కేంద్ర గ్రామీణ శాఖ రూపొందించిన 71 పారా మీటర్ల అంశాల మేరకు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసినందుకు, పార్లమెంటు పరిధిలో 263 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారంతో చేస్తున్న కార్యక్రమాలపై పీఎం ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు. టాటా ట్రస్ట్ తయారుచేసిన సూక్ష్మప్రణాళిక పూర్తి నివేదికను సమర్పించే కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ ప్రధాని మోదీని ఆహ్వానించగా వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు నాని పేర్కొన్నారు.