Union Rural Development
-
రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలు
⇒ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయింపు ⇒ 60 శాతం గృహాలు ఎస్సీ, ఎస్టీలకు ప్రతిపాదించిన తెలంగాణ ⇒ 2016–17కు గాను రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద 2016–17కు గాను రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. ఇటీవల జరిగిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు చెందిన సాధికారిక కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. 2016–17కు గాను ముందుగా నిర్ణయించిన లక్ష్యం 38,097 గృహాలకు అదనంగా 12,862 గృహాల నిర్మాణానికి తెలంగాణ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సాధికారిక కమిటీ ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర లక్ష్యం 50,959 గృహాలకు చేరుకుంది. ఈ మొత్తం గృహాలలో 30,575 గృహాలను (60 శాతం) ఎస్సీ, ఎస్టీలకు, 3,566 గృహాలను మైనారిటీలకు కేటాయిస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని పథకాల నిధులు రాష్ట్ర నోడల్ ఖాతాకు బదిలీ చేయాలని, గత ఏప్రిల్ నాటికి వ్యయం కాని రూ.36.44 కోట్లను ఇందిరా ఆవాస్ యోజన కింద పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణానికి వినియోగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుందని సాధికారిక కమిటీ పేర్కొంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు పథకం వివరాలు, స్థానిక వనరుల లభ్యత, శిక్షణ పొందిన మేస్త్రీల అవసరం తదితర విషయాలపై అవగాహన కల్పించడానికి క్యాంపులు నిర్వహించాలని ఆదేశించింది. ఆధార్ సీడింగ్‌కు లబ్ధిదారుడి అనుమతి తీసుకోవాలని సూచించింది. ‘ఉపాధి’ ద్వారా నిర్మించండి.. గృహాల నిర్మాణానికి కనీసం 90 నుంచి 95 దినాలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులను పనిలోకి తీసుకోవాలని సాధికారిక కమిటీ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో పీఎంఏవై కింద గృహాల నిర్మాణంలో స్వచ్ఛ భారత్ మిషన్ లేదా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.12 వేల చొప్పున వినియోగిస్తూ టాయిలెట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు స్వయంగా గృహాన్ని నిర్మించుకోవాలి లేదా లబ్ధిదారుడి పర్యవేక్షణలో గృహ నిర్మాణం జరగాలి. ఇందులో కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండరాదు. అయితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌హెచ్‌సీఎల్) ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్నందున.. లబ్ధిదారులకు బదులుగా టీఎస్‌హెచ్‌సీఎల్ నిర్మాణం చేపట్టడానికి మినహా యింపు మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించాలని సాధికారిక కమిటీ స్పష్టం చేసింది. -
కేంద్రం ఇవ్వదు.. రాష్ట్రం అడగదు
ఉపాధిహామీకి నిధుల కొరత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలు పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి పనులు చేసిన కూలీలకు వేత నాలిచ్చేందుకూ నిధుల కొరత ఏర్పడింది. నిన్నమొన్నటివరకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో కూలీలకు వేతనా లను తామే నేరుగా చెల్లిస్తామని ప్రకటించిన కేంద్రం.. పక్షం రోజులుగా వేతన చెల్లింపుల ను నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సుమారు రూ.40 కోట్ల మేర వేతన చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆగిన వేతన చెల్లింపులు... గత నెల 1 నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఎన్ఈఎఫ్ఎంఎస్) ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నేరుగా వేతనాలు అందుతున్నాయని.. ఉన్నట్టుండి జనవరి 20 నుంచి చెల్లింపులు నిలిచిపోయా యని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఉపాధిహామీకి కేటాయించిన నిధులను ఉత్తరాది రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఎగరేసు కు పోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. నిధుల విషయమై ఉత్తరాది రాష్ట్రాల నేతలు బలమైన లాబీయింగ్ చేస్తున్నారని, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల నేతలు పట్టించుకోక పోవడంవల్లనే నిధులు రావడం లేదని సర్పంచుల సంఘాలు అంటున్నాయి. మరోవైపు వేతన కాంపోనెంట్ పెరిగితేనే మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు కానున్నాయి. గ్రామాలలో రూ. 600 కోట్ల ఉపాధిహామీ మెటీరియల్ కాంపో నెంట్ నిధులతో సిమెంట్ రహదారులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.. వేతన కాంపోనెంట్‌ను పెంచేందుకు అవసర మైన నిధులను కేటాయించడంలేదు. ‘ఉపాధి’ కూలీల అవస్థలు... అటు కేంద్రం నిధులివ్వక.. ఇటు రాష్ట్రం పట్టించుకోక వేతనం కోసం ఉపాధి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధి కూలీల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపి.. కేంద్రం ఉపాధిహామీ నిధుల్లో మరింత కోత పెట్టే ప్రమాదం ఏర్పడనుంది. కేంద్రం సకాలంలో నిధులివ్వకపోయినా కూలీలకు వేతన చెల్లిం పులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణా భివృద్ధి శాఖకు రివాల్వింగ్ ఫండ్‌ను అందిస్తే మేలని సర్పంచులు సూచిస్తున్నారు. -
‘ఉపాధి’ అమల్లో రాష్ట్రానికి 4 అవార్డులు
ఢిల్లీలో జరిగిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 10వ వార్షికోత్సవంలో ప్రదానం అవార్డులు అందుకున్న ఉన్నతాధికారులు ఎస్పీసింగ్, అనితా రాంచంద్రన్ సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రానికి నాలుగు అవార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉపాధి హామీలో సామాజిక విలీనం (సోషల్ ఇన్‌క్లూజన్), పారదర్శకత-జవాబుదారీతనం (ట్రాన్స్పరెన్సీ-అకౌంటబిలిటీ), ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించిన జిల్లా, ఉపాధి పనులు చేసుకున్న ఉత్తమ గ్రామం కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 10వ వార్షికోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, గ్రామీణాభివృద్ధి విభాగం డెరైక్టర్ అనితా రాంచంద్రన్, సోషల్ ఆడిట్ విభాగం డెరైక్టర్ సౌమ్య కిడాంబి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, కరీంనగర్ జిల్లా చందుర్తి గ్రామ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ అవార్డులను అందుకున్నారు. ఉపాధి కూలీ స్థాయి నుంచి రైతు స్థాయికి ఎదిగిన మెదక్ జిల్లా రాఘవపూర్‌కు చెందిన కొమ్మిడి వెంకట్రామిరెడ్డిని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఉపాధి హామీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన వారిలో గ్రామీణాభివృద్ధి విభాగం జాయింట్ కమిషనర్ సైదులు, పలు గ్రామాల సర్పంచులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కూ అవార్డులు... ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ చేతుల మీదుగా ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు అవార్డులను అందుకున్నారు. అలాగే ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేసినందుకు వైఎస్సార్ జిల్లా అత్యుత్తమ జిల్లా అవార్డు గెలుచుకుంది. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కె.వి.రమణ, జిల్లా ప్రాజెక్డు డెరైక్టర్ బాలసుబ్రమణ్యం ఈ అవార్డులను అందుకున్నారు. దీంతోపాటు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని జరుగు గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఉత్తమ సేవలకుగాను ఏపీలో తపాలాశాఖకూ రెండు అవార్డులు దక్కాయి. -
మోదీని కలిసిన ఎంపీ కేశినేని
విజయవాడ : నియోజకవర్గ పరిధిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి సంబంధించి చేపట్టనున్న ప్రణాళికలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని అందజేశారు. బుధవారం పార్లమెంట్ భవన్ పదో చాంబర్లో ఎంపీ నాని పీఎంను కలిసి నియోజకవర్గపరిధిలో చేపడుతున్న పథక ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని ప్రధానమంత్రితో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గొల్లమందల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు వివరించారు. సంసద్ ఆదర్శ గ్రామాల అభివృద్ధికి కేంద్ర గ్రామీణ శాఖ రూపొందించిన 71 పారా మీటర్ల అంశాల మేరకు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసినందుకు, పార్లమెంటు పరిధిలో 263 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారంతో చేస్తున్న కార్యక్రమాలపై పీఎం ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు. టాటా ట్రస్ట్ తయారుచేసిన సూక్ష్మప్రణాళిక పూర్తి నివేదికను సమర్పించే కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ ప్రధాని మోదీని ఆహ్వానించగా వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు నాని పేర్కొన్నారు. -
తెలుగు, కన్నడ రాష్ట్రాలకు నిధులివ్వండి
* కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరిన కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను సమయానుసారంగా విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి వెంకయ్య సోమవారం బీరేంద్ర సింగ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సకాలంలో నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను, 13వ ఆర్థిక మండలి నిధులను వారంలోపే విడుదల చేయడానికి గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ హామీ ఇచ్చారు. -
గ్రామీణాభివృద్ధి కోర్సులకు కేరాఫ్.. ఎన్ఐఆర్డీ
ఇన్స్టిట్యూట్ వాచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ).. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1964లో ఏర్పాటైన సంస్థ. తొలుత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాలు, పరిశోధనలు, విశ్లేషణలకే పరిమితమైన ఈ సంస్థ 2008 నుంచి గ్రామీణాభివృద్ధికి సంబంధించి అకడెమిక్ శిక్షణను కూడా ప్రారంభించింది. తక్కువ వ్యవధిలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందింది. గ్రామీణాభివృద్ధి నిర్వహణ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎన్ఐఆర్డీపై ఫోకస్.. ఎన్ఐఆర్డీ నిర్వహిస్తున్న కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్ వెలువడుతుంది. పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రస్తుతం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్ఐఆర్డీ జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు, తర్వాత దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి/ మార్చి నెలల్లో ఉంటుంది. దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు. ఇది నిర్వివాదాంశం. ఇదే కారణంగా దేశంలో గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించిన పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు, అవసరమైన కార్యనిర్వాహక నైపుణ్యాలను అందించేందుకు తగిన వేదిక ఉండాలని భావించిన కేంద్ర ప్రభుత్వం 1964లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఉద్యోగులకు శిక్షణతో మొదలై ఎన్ఐఆర్డీ తొలుత గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఆయా పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు పరిమితమైంది. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా పంచాయతీరాజ్, డీఆర్డీఏ, రూరల్ డెవలప్మెంట్ తదితర అనేక శాఖలకు చెందిన వేల మంది ఉద్యోగులు, అధికారులు కార్యనిర్వాహక నైపుణ్యాలు సాధించారు. 2008 నుంచి విద్యార్థుల కోసం 2008 వరకు రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ తీరుతెన్నుల విశ్లేషణ, సలహాలు, నివేదికలు, అంతర్గత శిక్షణకు పరిమితమైన ఎన్ఐఆర్డీ.. తాజా గ్రాడ్యుయేట్లను కూడా దేశ ప్రగతి చోదకులుగా రూపొందించాలని సంకల్పించింది. ఇందుకోసం వారికి ముందుగానే ఆయా అంశాలపై అవగాహన కల్పించాలని భావించింది. ఈ రెండు ప్రధాన లక్ష్యాలుగా అకడెమిక్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. మొట్టమొదటిసారి 2008లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడాది వ్యవధి గల ఈ కోర్సులో విద్యార్థులకు గ్రామీణాభివృద్ధికి చెందిన అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు.. రెండు వారాల ఫీల్డ్ విజిట్స్, ఇంటర్న్షిప్స్ వంటి కార్యక్రమాలను తప్పనిసరి చేసింది. వీటి ద్వారా విద్యార్థులకు క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోవడం, వాటికి తగిన పరిష్కారాలు సూచించేలా నైపుణ్యాలు లభిస్తాయి. అకడెమిక్ అవార్డ్లు 2008లో పూర్తిస్థాయిలో అకడెమిక్ కోర్సుల వైపు అడుగులు వేసిన ఎన్ఐఆర్డీ స్వల్ప వ్యవధిలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. 2012లో బ్లూంబర్గ్ - యూటీవీ నుంచి బీ-స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్; 2013లో డీఎన్ఏ- ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అవార్డ్లు లభించడమే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయంగానూ గుర్తింపు ఎన్ఐఆర్డీకి అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. యునెస్కో, యునిసెఫ్ వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలతోపాటు మరెన్నో అంతర్జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థల గుర్తింపు కూడా పొందింది. అంతేకాకుండా ఆయా సంస్థలతో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలను ఏర్పర్చుకుంది. ప్లేస్‌మెంట్స్.. నో టెన్షన్ ఎన్ఐఆర్డీలో పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ భరోసా లభిస్తోంది. ప్రతి బ్యాచ్‌లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు సగటున రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కొలువులను ఖాయం చేసుకుంటున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసిన నేపథ్యంలో పలు కార్పొరేట్ సంస్థలతోపాటు జాతీయ ఉపాధి హామీ పథకం, ఇతర గ్రామీణాభివృద్ధి పథకాల నిర్వాహక సంస్థలు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఆధునిక సదుపాయాలతో క్యాంపస్ ఎన్ఐఆర్డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు.. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వినియోగించుకునేలా ఆధునిక కంప్యూటర్స్, లేబొరేటరీ, వేల సంఖ్యలో పుస్తకాలతో ల్యాబ్, హాస్టల్ వసతి వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నిరంతరం ఓరియెంటేషన్ లెక్చర్స్, సెమినార్స్ ద్వారా విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు.. తద్వారా కోర్సు పూర్తి చేసుకునే సమయానికి పూర్తి స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఎన్ఐఆర్డీ. వెబ్సైట్: www.nird.org.in దూర విద్య కోర్సులు కూడా ఏడాది వ్యవధిలో పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్‌మెంట్‌తోపాటు.. ఈ రంగంలోని ఔత్సాహిక విద్యార్థులు, ఉద్యోగస్తుల కోసం దూర విద్య కోర్సులు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మూడు కోర్సులు దూర విద్యా విధానంలో అందుబాటులో ఉన్నాయి. అవి.. * పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్మెంట్ కోర్సు వ్యవధి: సంవత్సరం. * పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్, కోర్సు వ్యవధి: ఏడాది * పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ జియో స్పాటియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. కోర్సు వ్యవధి: ఆరు నెలలు ఇన్స్టిట్యూట్ డిస్టెన్స్ విభాగంలో అందిస్తున్న మూడు కోర్సులకు.. యూజీసీ నేతృత్వంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనుమతి కూడా ఉంది. యువతను, ఇతర ఔత్సాహికులను గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇన్స్టిట్యూట్.. ఎన్ఐఆర్డీ. ఎన్నో దశాబ్దాలుగా ఈ రంగానికి సంబంధించి అకడెమిక్, రీసెర్చ్ పరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్ఐఆర్డీలో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో రూరల్ డెవలప్మెంట్ అంశాలతోపాటు స్కిల్ డెవలప్మెంట్, ఐసీటీ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ తదితర అన్ని విభాగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూ.. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎన్ఐఆర్డీ ముందుకు సాగుతోంది. అటు రీసెర్చ్ కోణంలోనూ వందల సంఖ్యలో జర్నల్స్‌ను ప్రచురించి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. - ఎస్.ఎం. ఇలియాస్ హెడ్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, ఎన్ఐఆర్డీ - హైదరాబాద్ -
ముండే మృతిపై సర్వత్రా దిగ్భ్రాంతి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర శాసన సభకు ఐదు సార్లు ఎన్నికైన ముండే, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికై, ఇటీవలే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖను చేపట్టారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్, మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు ముండే మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీజేఎల్పీ సమావేశం వాయిదా ముండే అకాల మరణంతో మంగళవారం జరగాల్సిన బీజేఎల్పీ సమావేశం ఈ నెల 23కు వాయిదా పడింది. బీజేపీ కార్యాలయంలో ముండే శ్రద్ధాంజలి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, జగదీశ్ శెట్టర్లు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ముండే గుణ గణాలను కొనియాడారు. బీజేపీ గొప్ప నాయకుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శాసన సభ నుంచి శాసన మండలికి ఈ నెల 19న జరుగనున్న ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా కేఎస్. ఈశ్వరప్ప మంగళవారం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ముండే మృతితో నామినేషన్ సమర్పణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.