ముండే మృతిపై సర్వత్రా దిగ్భ్రాంతి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర శాసన సభకు ఐదు సార్లు ఎన్నికైన ముండే, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికై, ఇటీవలే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖను చేపట్టారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్, మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు ముండే మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బీజేఎల్‌పీ సమావేశం వాయిదా
ముండే అకాల మరణంతో మంగళవారం జరగాల్సిన బీజేఎల్‌పీ సమావేశం ఈ నెల 23కు వాయిదా పడింది. బీజేపీ కార్యాలయంలో ముండే శ్రద్ధాంజలి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, జగదీశ్ శెట్టర్‌లు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ముండే గుణ గణాలను కొనియాడారు. బీజేపీ గొప్ప నాయకుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శాసన సభ నుంచి శాసన మండలికి ఈ నెల 19న జరుగనున్న ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా కేఎస్. ఈశ్వరప్ప మంగళవారం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ముండే మృతితో నామినేషన్ సమర్పణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.