గ్రామీణాభివృద్ధి కోర్సులకు కేరాఫ్.. ఎన్‌ఐఆర్‌డీ | NIRD is careof for rural development courses | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధి కోర్సులకు కేరాఫ్.. ఎన్‌ఐఆర్‌డీ

Published Fri, Aug 1 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

గ్రామీణాభివృద్ధి కోర్సులకు కేరాఫ్.. ఎన్‌ఐఆర్‌డీ

గ్రామీణాభివృద్ధి కోర్సులకు కేరాఫ్.. ఎన్‌ఐఆర్‌డీ

ఇన్‌స్టిట్యూట్ వాచ్
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ).. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1964లో ఏర్పాటైన సంస్థ. తొలుత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాలు, పరిశోధనలు, విశ్లేషణలకే పరిమితమైన ఈ సంస్థ 2008 నుంచి గ్రామీణాభివృద్ధికి సంబంధించి అకడెమిక్ శిక్షణను కూడా ప్రారంభించింది. తక్కువ వ్యవధిలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందింది. గ్రామీణాభివృద్ధి నిర్వహణ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎన్‌ఐఆర్‌డీపై ఫోకస్..
 
ఎన్‌ఐఆర్‌డీ నిర్వహిస్తున్న కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్ వెలువడుతుంది. పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రస్తుతం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌ఐఆర్‌డీ జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు, తర్వాత దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి/ మార్చి నెలల్లో ఉంటుంది.  
 
దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు. ఇది నిర్వివాదాంశం. ఇదే కారణంగా దేశంలో గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించిన పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు, అవసరమైన కార్యనిర్వాహక నైపుణ్యాలను అందించేందుకు తగిన వేదిక ఉండాలని భావించిన కేంద్ర ప్రభుత్వం 1964లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్థ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్.
 
ఉద్యోగులకు శిక్షణతో మొదలై
ఎన్‌ఐఆర్‌డీ తొలుత గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఆయా పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు పరిమితమైంది. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ, రూరల్ డెవలప్‌మెంట్ తదితర అనేక శాఖలకు చెందిన వేల మంది ఉద్యోగులు, అధికారులు కార్యనిర్వాహక నైపుణ్యాలు సాధించారు.
 
2008 నుంచి విద్యార్థుల కోసం
2008 వరకు రూరల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ తీరుతెన్నుల విశ్లేషణ, సలహాలు, నివేదికలు, అంతర్గత శిక్షణకు పరిమితమైన ఎన్‌ఐఆర్‌డీ.. తాజా గ్రాడ్యుయేట్లను కూడా దేశ ప్రగతి చోదకులుగా రూపొందించాలని సంకల్పించింది. ఇందుకోసం వారికి ముందుగానే ఆయా అంశాలపై అవగాహన కల్పించాలని భావించింది. ఈ రెండు ప్రధాన లక్ష్యాలుగా అకడెమిక్ శిక్షణకు శ్రీకారం చుట్టింది.
 
మొట్టమొదటిసారి 2008లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడాది వ్యవధి గల ఈ కోర్సులో విద్యార్థులకు గ్రామీణాభివృద్ధికి చెందిన అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు..  రెండు వారాల ఫీల్డ్ విజిట్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి కార్యక్రమాలను తప్పనిసరి చేసింది. వీటి  ద్వారా విద్యార్థులకు క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోవడం, వాటికి తగిన పరిష్కారాలు సూచించేలా నైపుణ్యాలు లభిస్తాయి.
 
అకడెమిక్ అవార్డ్‌లు
2008లో పూర్తిస్థాయిలో అకడెమిక్ కోర్సుల వైపు అడుగులు వేసిన ఎన్‌ఐఆర్‌డీ స్వల్ప వ్యవధిలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. 2012లో బ్లూంబర్గ్ - యూటీవీ నుంచి బీ-స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్; 2013లో డీఎన్‌ఏ- ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ అవార్డ్‌లు లభించడమే ఇందుకు నిదర్శనం.
 
అంతర్జాతీయంగానూ గుర్తింపు
ఎన్‌ఐఆర్‌డీకి అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. యునెస్కో, యునిసెఫ్ వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలతోపాటు మరెన్నో అంతర్జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థల గుర్తింపు కూడా పొందింది. అంతేకాకుండా ఆయా సంస్థలతో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలను ఏర్పర్చుకుంది.
 
ప్లేస్‌మెంట్స్.. నో టెన్షన్
ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ భరోసా లభిస్తోంది. ప్రతి బ్యాచ్‌లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు సగటున రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో కొలువులను ఖాయం చేసుకుంటున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసిన నేపథ్యంలో పలు కార్పొరేట్ సంస్థలతోపాటు జాతీయ ఉపాధి హామీ పథకం, ఇతర గ్రామీణాభివృద్ధి పథకాల నిర్వాహక సంస్థలు కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
 
ఆధునిక సదుపాయాలతో క్యాంపస్
ఎన్‌ఐఆర్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు.. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వినియోగించుకునేలా ఆధునిక కంప్యూటర్స్, లేబొరేటరీ, వేల సంఖ్యలో పుస్తకాలతో ల్యాబ్, హాస్టల్ వసతి వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
 
అంతేకాకుండా నిరంతరం ఓరియెంటేషన్ లెక్చర్స్, సెమినార్స్ ద్వారా విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు.. తద్వారా కోర్సు పూర్తి చేసుకునే సమయానికి పూర్తి స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఎన్‌ఐఆర్‌డీ. వెబ్‌సైట్: www.nird.org.in
 
దూర విద్య కోర్సులు కూడా

ఏడాది వ్యవధిలో పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌తోపాటు.. ఈ రంగంలోని ఔత్సాహిక విద్యార్థులు, ఉద్యోగస్తుల కోసం దూర విద్య కోర్సులు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మూడు కోర్సులు దూర విద్యా విధానంలో అందుబాటులో ఉన్నాయి. అవి..
* పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్
కోర్సు వ్యవధి: సంవత్సరం.
పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్, కోర్సు వ్యవధి: ఏడాది
పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ జియో స్పాటియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్.
 కోర్సు వ్యవధి: ఆరు నెలలు
 ఇన్‌స్టిట్యూట్ డిస్టెన్స్ విభాగంలో అందిస్తున్న మూడు కోర్సులకు..
 యూజీసీ నేతృత్వంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనుమతి కూడా ఉంది.
 
 
యువతను, ఇతర ఔత్సాహికులను గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్.. ఎన్‌ఐఆర్‌డీ. ఎన్నో దశాబ్దాలుగా ఈ రంగానికి సంబంధించి అకడెమిక్, రీసెర్చ్ పరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్‌ఐఆర్‌డీలో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో రూరల్ డెవలప్‌మెంట్ అంశాలతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్, ఐసీటీ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ తదితర అన్ని విభాగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూ.. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎన్‌ఐఆర్‌డీ ముందుకు సాగుతోంది. అటు రీసెర్చ్ కోణంలోనూ వందల సంఖ్యలో జర్నల్స్‌ను ప్రచురించి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.
- ఎస్.ఎం. ఇలియాస్ హెడ్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, ఎన్‌ఐఆర్‌డీ - హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement