nird
-
‘ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయి’
హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీ&పీఆర్)లో 'జీవన సౌలభ్యం: చివరి అంచె వరకూ మెరుగైన సేవలు’ అనే అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో తొలి ప్రాంతీయ వర్క్‌షాప్ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీని సమర్థవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. గ్రామీణ స్వావలంబనకు, ప్రజలు స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు సేవా భావంతో సమర్థవంతమైన సేవలను అందించడం కీలకమని చెప్పారు.నాణ్యమైన సేవలను పొందటానికి, ప్రజలు పన్నులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయటానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఆయన వివరించారు. స్వయం సమృద్ధ ఆదాయం ద్వారా పంచాయతీలు స్వావలంబన సాధించడానికి వీలు కల్పిస్తుందన్నారు. విజయవంతమైన సేవలను అందించే పద్ధతులను కాగితాల్లో పొందుపరచాలని, ఇతర పంచాయితీలకు స్ఫూర్తినిచ్చేలా వాటితో పంచుకోవాలని తెలిపారు. సేవలందించటంలో ఆదర్శంగా నిలుస్తోన్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నమూనా ప్రక్రియలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వాటితో కలిసి పనిచేయాలని కోరారు. గతంలో కంప్యూటర్లు అందుబాటులో లేని వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు 22,164 కంప్యూటర్లను అందించేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండటం గణనీయంగా మెరుగుపడుతుంది. 3,301 గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి కూడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇందులో కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు) ఉంటాయని, క్షేత్రస్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ&పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ. నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సానుకూల మార్పును తీసుకురావాల్సిన బాధ్యత పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. “పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులను అత్యాధునిక పరికరాలు, సాంకేతికతో సన్నద్ధం చేయడం ద్వారా క్షేత్రస్థాయి నుంచే పరిపాలనా విప్లవానికి రంగం సిద్ధం చేస్తున్నాం” అని వ్యాఖ్యానించారుఈ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించినందుకు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ లోకేష్ కుమార్ డీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు. పంచాయితీ సమ్మేళనంలో నిర్వహించనున్న నాలుగు ప్రాంతీయ వర్క్‌షాప్‌లలో ఇది మొదటిది. సృజనాత్మక విధానాలపై చర్చించడం, క్షేత్రస్థాయిలో సేవలను పెంపొందించడం కోసం అనుభవాలను పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని.. సేవలను అందించడంలో సవాళ్లు, అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా జీవన సౌలభ్యం అనే ఇతివృత్తంతో చర్చాగోష్ఠులను నిర్వహించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) అన్లైన్ ద్వారా సేవలను అందించేందుకు ఉపయోగపడే సర్వీస్ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించింది. క్షేత్రస్థాయిలో కమ్యూనికేషన్, సేవలను అందించటాన్ని క్రమబద్ధీకరించడంలో కృత్రిమ మేధ, డిజిటల్ ప్రజా వేదికలకు(డీపీజీ- డిజిటల్ పబ్లిక్ గూడ్స్) ఉన్న సామర్థ్యాన్ని వాధ్వానీ ఫౌండేషన్, భాషిని, యునిసెఫ్‌లు చూపించాయి. సేవల సమర్థతను మదింపు చేయడానికి, మెరుగుపరచటానికి ఫ్రేమ్‌వర్క్‌లను అందించే.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే విషయంలో ప్రామాణికతలను నిర్ణయించటంపై ఎన్ఐఆర్డీ&పీఆర్ ఒక సెషన్ నిర్వహించింది. -
ఎన్ఐఆర్డీలో శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు
కర్నూలు : ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన 23 మంది మహిళలు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో జీవనోపాధి శిక్షణకు వెళ్లారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వారు ఎస్పీ ఆకె రవికృష్ణను కలిశారు. గ్రామానికి చెందిన ప్రతి మహిళ ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. పేపర్ ప్లేట్లు, ఇటుకలు, పచ్చళ్లు, రెడిమేడ్ డ్రస్సులు తయారీ, సోలార్ లైట్లు, జ్యూట్ బ్యాగులు, సబ్బుల తయారీపై శిక్షణ పొందనున్నారు. కార్యక్రమంలో కోడుమూరు వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, గ్రామ జ్యోతి ప్రాజెక్డు డైరెక్టర్ అబ్దుల్ సలాం పాల్గొన్నారు. -
ప్రత్యేక శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ చొరవతో హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో ప్రత్యేక శిక్షణ పొందేందుకు 35 మంది కప్పట్రాళ్ల మహిళలు ఎంపికయ్యారు. వారందరూ సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..కప్పట్రాళ్లలో ప్రతి మహిళ సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఇందుకోసం తనవంతు సాయం అందిస్తానని తెలిపారు. కేవలం వ్యవసాయమే కాకుండా ఇతర వనరులపై దృష్టి సారించాలని సూచించారు. కప్పట్రాళ్ల మహిళలు హైదరాబాద్‌కు శిక్షణ కోసం వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని టీజీవీ గ్రూపు ద్వారా సమకూర్చుతామని ఆ సంస్థల చైర్మన్ టీజీ భరత్ అన్నారు. అనంతరం 35 మంది మహిళలతో కూడిన అమరజ్యోతి వాహనాన్ని జెండా ఊపి హైదరాబాద్‌కు ఎస్పీ, టీజీ భరత్ సాగనంపారు. కార్యక్రమంలో సెర్పు ఆర్గనైజర్ విజయభారతి, కోడుమూరు వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, గ్రామజ్యోతి సోషల్ ఆర్గనైజర్ నారాయణ పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ఎన్ఐఆర్డీలో అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాం తాలు అభివృద్ధి చెందడం పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ)లో ‘ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పేదరికం ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ఉపాధిహామీ, పీఎంజీఎస్‌వై, రూరల్ హెల్త్ మిషన్, స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింద న్నారు. గ్రామీణాభివృద్ధికి తెలం గాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా చూపేలా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి అన్నారు. నవంబర్ 27వరకు కొనసాగనున్న అంతర్జాతీయ శిక్షణా శిబిరానికి టాంజానియా, నైజీరియా, శ్రీలంక, సూడాన్, జింబాబ్వే, ఫిజి, ఈజిప్ట్, కజికిస్తాన్, మలేషియా, మాల్దీవులు తదితర 20 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్ డీ డెరైక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి, ఎన్ఐఆర్డీ ప్రతినిధులు శంకర్ ఛటర్జీ, చిన్నాదురై, ఆరుణ జయమణి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాల పనితీరు భేష్
భూదాన్‌పోచంపల్లి తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు, సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుందని పలు రాష్ట్రాలకు చెందిన అధికారుల బృం దం కొనియాడింది. హైదరాబాద్‌లోని జాతీ య గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ) ఆధ్వర్యంలో కర్నాటక, తమిళనాడు, ఒడిశా, హర్యానా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గోవా, గుజ రాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదే శ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన 20 మంది గ్రామీణాభివృద్ధి అధికారుల బృందం బుధవారం పో చంపల్లిని సందర్శించింది. మండల మహి ళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సం ఘాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. సంఘాల ఏర్పాటు, సంఘంలో ఉండే సభ్యుల సంఖ్య, రికార్డుల నిర్వహణ, బ్యాం కుల ద్వారా తీసుకుంటున్న రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకొం టున్నారో అడిగి తెలసుకున్నారు. అనంతరం పెద్దరావులపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఐకేపీ నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా పరి శీలించారు. తాను కూడా ఓ మహిళా సం ఘంలో సభ్యురాలిగా ఉండి ప్రస్తుతం మం డల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాయని సార సరస్వతీ తెలపడంతో అధికారులను ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మిషన్ ఎగ్జిక్యూటివ్ స్వర్ణలత మాట్లాడు తూ ఎన్ఐఆర్డీలో గ్రామీణాభివృద్ధి-స్వ య ం ఉపాధిలో మహిళలు అనే అంశంలో శిక్షణ పొం దుతున్న అంతరాష్ట్ర అధికారుల బృందం తెలంగాణలోని మహిళా సంఘాలు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేం ద్రాల నిర్వహణను అధ్యయనం చేయడాని కి క్షేత్ర పర్యట నిమిత్తం వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో న్యూఢిల్లీ మిషన్ ఎగ్జిక్యూటివ్ సీమా భాస్క ర్, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఏపీఎం హరినాయక్, ఏరియా కోర్డినేటర్ శ్రీని వా స్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, సీఆర్పీ ల క్ష్మి, సీసీ వసంత, సర్పంచ్ గుర్రం విఠల్, ఎంపీటీసీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధి కోర్సులకు కేరాఫ్.. ఎన్ఐఆర్డీ
ఇన్స్టిట్యూట్ వాచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ).. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1964లో ఏర్పాటైన సంస్థ. తొలుత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాలు, పరిశోధనలు, విశ్లేషణలకే పరిమితమైన ఈ సంస్థ 2008 నుంచి గ్రామీణాభివృద్ధికి సంబంధించి అకడెమిక్ శిక్షణను కూడా ప్రారంభించింది. తక్కువ వ్యవధిలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందింది. గ్రామీణాభివృద్ధి నిర్వహణ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎన్ఐఆర్డీపై ఫోకస్.. ఎన్ఐఆర్డీ నిర్వహిస్తున్న కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్ వెలువడుతుంది. పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రస్తుతం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్ఐఆర్డీ జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు, తర్వాత దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి/ మార్చి నెలల్లో ఉంటుంది. దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు. ఇది నిర్వివాదాంశం. ఇదే కారణంగా దేశంలో గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించిన పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు, అవసరమైన కార్యనిర్వాహక నైపుణ్యాలను అందించేందుకు తగిన వేదిక ఉండాలని భావించిన కేంద్ర ప్రభుత్వం 1964లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఉద్యోగులకు శిక్షణతో మొదలై ఎన్ఐఆర్డీ తొలుత గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఆయా పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు పరిమితమైంది. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా పంచాయతీరాజ్, డీఆర్డీఏ, రూరల్ డెవలప్మెంట్ తదితర అనేక శాఖలకు చెందిన వేల మంది ఉద్యోగులు, అధికారులు కార్యనిర్వాహక నైపుణ్యాలు సాధించారు. 2008 నుంచి విద్యార్థుల కోసం 2008 వరకు రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ తీరుతెన్నుల విశ్లేషణ, సలహాలు, నివేదికలు, అంతర్గత శిక్షణకు పరిమితమైన ఎన్ఐఆర్డీ.. తాజా గ్రాడ్యుయేట్లను కూడా దేశ ప్రగతి చోదకులుగా రూపొందించాలని సంకల్పించింది. ఇందుకోసం వారికి ముందుగానే ఆయా అంశాలపై అవగాహన కల్పించాలని భావించింది. ఈ రెండు ప్రధాన లక్ష్యాలుగా అకడెమిక్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. మొట్టమొదటిసారి 2008లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడాది వ్యవధి గల ఈ కోర్సులో విద్యార్థులకు గ్రామీణాభివృద్ధికి చెందిన అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు.. రెండు వారాల ఫీల్డ్ విజిట్స్, ఇంటర్న్షిప్స్ వంటి కార్యక్రమాలను తప్పనిసరి చేసింది. వీటి ద్వారా విద్యార్థులకు క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోవడం, వాటికి తగిన పరిష్కారాలు సూచించేలా నైపుణ్యాలు లభిస్తాయి. అకడెమిక్ అవార్డ్లు 2008లో పూర్తిస్థాయిలో అకడెమిక్ కోర్సుల వైపు అడుగులు వేసిన ఎన్ఐఆర్డీ స్వల్ప వ్యవధిలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. 2012లో బ్లూంబర్గ్ - యూటీవీ నుంచి బీ-స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్; 2013లో డీఎన్ఏ- ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అవార్డ్లు లభించడమే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయంగానూ గుర్తింపు ఎన్ఐఆర్డీకి అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. యునెస్కో, యునిసెఫ్ వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలతోపాటు మరెన్నో అంతర్జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థల గుర్తింపు కూడా పొందింది. అంతేకాకుండా ఆయా సంస్థలతో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలను ఏర్పర్చుకుంది. ప్లేస్‌మెంట్స్.. నో టెన్షన్ ఎన్ఐఆర్డీలో పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ భరోసా లభిస్తోంది. ప్రతి బ్యాచ్‌లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు సగటున రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కొలువులను ఖాయం చేసుకుంటున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసిన నేపథ్యంలో పలు కార్పొరేట్ సంస్థలతోపాటు జాతీయ ఉపాధి హామీ పథకం, ఇతర గ్రామీణాభివృద్ధి పథకాల నిర్వాహక సంస్థలు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఆధునిక సదుపాయాలతో క్యాంపస్ ఎన్ఐఆర్డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు.. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వినియోగించుకునేలా ఆధునిక కంప్యూటర్స్, లేబొరేటరీ, వేల సంఖ్యలో పుస్తకాలతో ల్యాబ్, హాస్టల్ వసతి వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నిరంతరం ఓరియెంటేషన్ లెక్చర్స్, సెమినార్స్ ద్వారా విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు.. తద్వారా కోర్సు పూర్తి చేసుకునే సమయానికి పూర్తి స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఎన్ఐఆర్డీ. వెబ్సైట్: www.nird.org.in దూర విద్య కోర్సులు కూడా ఏడాది వ్యవధిలో పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్‌మెంట్‌తోపాటు.. ఈ రంగంలోని ఔత్సాహిక విద్యార్థులు, ఉద్యోగస్తుల కోసం దూర విద్య కోర్సులు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మూడు కోర్సులు దూర విద్యా విధానంలో అందుబాటులో ఉన్నాయి. అవి.. * పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్మెంట్ కోర్సు వ్యవధి: సంవత్సరం. * పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్, కోర్సు వ్యవధి: ఏడాది * పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ జియో స్పాటియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. కోర్సు వ్యవధి: ఆరు నెలలు ఇన్స్టిట్యూట్ డిస్టెన్స్ విభాగంలో అందిస్తున్న మూడు కోర్సులకు.. యూజీసీ నేతృత్వంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనుమతి కూడా ఉంది. యువతను, ఇతర ఔత్సాహికులను గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇన్స్టిట్యూట్.. ఎన్ఐఆర్డీ. ఎన్నో దశాబ్దాలుగా ఈ రంగానికి సంబంధించి అకడెమిక్, రీసెర్చ్ పరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్ఐఆర్డీలో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో రూరల్ డెవలప్మెంట్ అంశాలతోపాటు స్కిల్ డెవలప్మెంట్, ఐసీటీ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ తదితర అన్ని విభాగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూ.. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎన్ఐఆర్డీ ముందుకు సాగుతోంది. అటు రీసెర్చ్ కోణంలోనూ వందల సంఖ్యలో జర్నల్స్‌ను ప్రచురించి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. - ఎస్.ఎం. ఇలియాస్ హెడ్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, ఎన్ఐఆర్డీ - హైదరాబాద్