గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ఎన్‌ఐఆర్‌డీలో అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాం తాలు అభివృద్ధి చెందడం పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ)లో ‘ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్’ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పేదరికం ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ఉపాధిహామీ, పీఎంజీఎస్‌వై, రూరల్ హెల్త్ మిషన్, స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింద న్నారు. గ్రామీణాభివృద్ధికి తెలం గాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా చూపేలా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
గ్రామస్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి అన్నారు. నవంబర్ 27వరకు కొనసాగనున్న అంతర్జాతీయ శిక్షణా శిబిరానికి టాంజానియా, నైజీరియా, శ్రీలంక, సూడాన్, జింబాబ్వే, ఫిజి, ఈజిప్ట్, కజికిస్తాన్, మలేషియా, మాల్దీవులు తదితర 20 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్ డీ డెరైక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి, ఎన్‌ఐఆర్‌డీ ప్రతినిధులు శంకర్ ఛటర్జీ, చిన్నాదురై, ఆరుణ జయమణి తదితరులు పాల్గొన్నారు.