‘ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయి’ | First regional workshop under the Panchayat Sammelan At Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయి’

Published Tue, Oct 22 2024 9:23 PM | Last Updated on Tue, Oct 22 2024 9:25 PM

First regional workshop under the Panchayat Sammelan At Hyderabad

హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ‌రాజ్‌ సంస్థ(ఎన్ఐఆర్‌డీ&పీఆర్)లో 'జీవన సౌలభ్యం: చివరి అంచె వరకూ మెరుగైన సేవలు’ అనే అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో తొలి ప్రాంతీయ వర్క్‌షాప్‌ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి  వివేక్ భరద్వాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీని సమర్థవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. గ్రామీణ స్వావలంబనకు, ప్రజలు స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు సేవా భావంతో సమర్థవంతమైన సేవలను అందించడం కీలకమని  చెప్పారు.

నాణ్యమైన సేవలను  పొందటానికి, ప్రజలు పన్నులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయటానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఆయన వివరించారు. స్వయం సమృద్ధ ఆదాయం ద్వారా పంచాయతీలు స్వావలంబన సాధించడానికి వీలు కల్పిస్తుందన్నారు. విజయవంతమైన సేవలను అందించే పద్ధతులను కాగితాల్లో పొందుపరచాలని, ఇతర పంచాయితీలకు స్ఫూర్తినిచ్చేలా వాటితో పంచుకోవాలని తెలిపారు. 

సేవలందించటంలో ఆదర్శంగా నిలుస్తోన్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నమూనా ప్రక్రియలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వాటితో కలిసి పనిచేయాలని కోరారు. గతంలో కంప్యూటర్లు అందుబాటులో లేని వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు 22,164 కంప్యూటర్లను అందించేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండటం గణనీయంగా మెరుగుపడుతుంది. 3,301 గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి కూడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇందులో కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్‌సీలు) ఉంటాయని, క్షేత్రస్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డీ&పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ. నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సానుకూల మార్పును తీసుకురావాల్సిన బాధ్యత పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. “పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులను అత్యాధునిక పరికరాలు, సాంకేతికతో సన్నద్ధం చేయడం ద్వారా క్షేత్రస్థాయి నుంచే పరిపాలనా విప్లవానికి రంగం సిద్ధం చేస్తున్నాం” అని వ్యాఖ్యానించారు

ఈ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించినందుకు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ లోకేష్ కుమార్ డీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు. పంచాయితీ సమ్మేళనంలో నిర్వహించనున్న నాలుగు ప్రాంతీయ వర్క్‌షాప్‌లలో ఇది మొదటిది. సృజనాత్మక విధానాలపై చర్చించడం, క్షేత్రస్థాయిలో సేవలను పెంపొందించడం కోసం అనుభవాలను పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని.. సేవలను అందించడంలో సవాళ్లు, అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా జీవన సౌలభ్యం అనే ఇతివృత్తంతో చర్చాగోష్ఠులను నిర్వహించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌(ఎన్ఐసీ) అన్‌లైన్ ద్వారా సేవలను అందించేందుకు ఉపయోగపడే సర్వీస్ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించింది. క్షేత్రస్థాయిలో కమ్యూనికేషన్, సేవలను అందించటాన్ని క్రమబద్ధీకరించడంలో కృత్రిమ మేధ, డిజిటల్ ప్రజా వేదికలకు(డీపీజీ- డిజిటల్ పబ్లిక్ గూడ్స్) ఉన్న సామర్థ్యాన్ని వాధ్వానీ ఫౌండేషన్, భాషిని, యునిసెఫ్‌లు చూపించాయి. సేవల సమర్థతను మదింపు చేయడానికి, మెరుగుపరచటానికి ఫ్రేమ్‌వర్క్‌లను అందించే.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే విషయంలో ప్రామాణికతలను నిర్ణయించటంపై ఎన్‌ఐఆర్‌డీ&పీఆర్ ఒక సెషన్ నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement