సాక్షి, విజయవాడ : ఆశావహుల సంఖ్య పెరిగిపోవడంతో విజయవాడ పార్లమెంట్ స్థానంపై ప్రతిష్టంభన తొలగలేదు. పాదయాత్ర సందర్భంగా ఎంపీ సీటు ఇస్తామంటూ కేశినేని శ్రీనివాస్ (నాని)ని తెరపైకి తెచ్చి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు ఖర్చుచేయించారు. ఇప్పుడాయన స్థానంలో పారిశ్రామికవేత్త పీవీపీ ప్రసాద్, ఎన్‌ఆర్‌ఐ కోమటి జయరాం పేర్లు పరిశీలిస్తున్నారు. పార్టీకి రూ.25 కోట్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఏదో విధంగా చంద్రబాబును ఒప్పించి భీపారం తెచ్చుకునేందుకు కేశినేని శ్రీనివాస్ హైదరాబాద్‌లోనే మకాంవేశారు.
సీటు వచ్చేదెవరికో.. రానిదెవరికో..
అవనిగడ్డ సీటు కోసం స్థానిక నేతలతోపాటు పార్టీలోకి నూతనంగా వచ్చిన మాజీ మంత్రి బుద్ధప్రసాద్, ముత్తంశెట్టి కృష్ణారావు పోటీ పడుతున్నారు. బుద్ధప్రసాద్ తాను సీనియర్‌ని అంటుంటే, జెడ్పీ ఎన్నికల్లో రూ.25 కోట్లు ఖర్చుచేసినందున తనకే ఇవ్వాలని ముత్తంశెట్టి పట్టుబడుతున్నారు.
కైకలూరు సీటును ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కోరుతుండగా, మాజీ మంత్రి పిన్నమనేని కూడా కన్నేశారు.
బందరు సీటుకు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్రతోపాటు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ లంకిశెట్టి బాలాజీల మధ్య పోటీ నడుస్తోంది.
నూజివీడు సీటు కోసం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, బచ్చుల అర్జునుడు మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.పద్మజ్యోతితో మంచి డీల్ కుదిరితే ఆమెకు తిరువూరు, నందిగామల్లో ఒక సీటు కేటాయించాలని.. లేనిపక్షంలో అక్కడ పార్టీ తరఫున పనిచేస్తున్న నల్లగట్ల స్వామిదాస్, తంగిరాల ప్రభాకర్‌లకే సీటు కేటాయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గరంగరంగా గన్నవరం..
గన్నవరం పేరెత్తితేనే టీడీపీ నేతలకు వెన్నుల్లో చలిపుట్టుకొస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, ఆయన సోదరుడు దాసరి జైరమేష్ హైదరాబాద్‌లోనే మకాం పెట్టి సీటు తమకే కావాలంటూ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వల్లభనేని వంశీ మోహన్ కూడా ఈ సీటు కోసం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. టికెట్ విషయంలో ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చివరి నిమిషం వరకు ఈ సీటు ఖరారు కాదంటున్నారు.
ఈ సీట్ల మాటేమిటి..
విజయవాడ సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయించగా.. తనకే కావాలంటూ బొండా ఉమామహేశ్వరరావు పట్టుబడుతున్నారు.
దీంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం ముస్లింలతోపాటు వైశ్యులు రంగంలోకి దిగారు. వన్‌టౌన్‌కు చెందిన ఒక ఆడిటర్ రూ.5 కోట్లతో సీఎం రమేష్ వద్ద కూర్చుని సీటు కోసం పైరవీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మరికొంతమంది వైశ్యులు రంగంలోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లిం పెద్దలు హైదరాబాద్ వెళ్లి నాగుల్‌మీరా లేదా ఖలీల్‌లలో ఒకరికి సీటు ఇవ్వాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
తూర్పు సీటు కోసం గద్దె రామ్మోహన్, సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీటు దక్కకపోతే తిరుగుబాటు చేయడానికి రామ్మోహన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సినీనటుడు బాలకృష్ణ సీటు ఖరారయితే తప్ప పెనమలూరు సీటు ఖరారు కాదు. ఇక్కడ నుంచి కూడా ఐదారుగురు ఆశావహులు ఉండడంతో ఈ సీటు కేటాయింపు చివర్లో జరగవచ్చు.