ఏడాదిగా జీతాలివ్వని కేశినేని..!
- పైగా అదనంగా 3 నెలల వేతనం చెల్లించినట్టు అసత్య ప్రచారం
- దీంతో కేశినేని కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సిబ్బంది
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన ట్రావెల్స్ సంస్థ తమ సిబ్బందిని నట్టేట ముంచింది. దాదాపు ఏడాదిగా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కేశినేని ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డునపడ్డారు. పైగా బకాయిలతో పాటు అదనంగా మూడు నెలలు జీతాలు చెల్లించినట్లు అసత్య ప్రచారం చేయించుకుంటోంది. దీంతో కంగుతిన్న ఏపీ, తెలంగాణలోని డ్రైవర్లు, ఇతర సిబ్బంది సోమవారం విజయవాడలోని కేశినేని కార్యాలయానికి చేరుకుని సంస్థ ప్రతినిధులను నిలదీశారు. ఈ నెల 15లోగా జీతాలు చెల్లించకుంటే తమ కుటుంబాలతో సహా ఈ నెల 17న ఆందోళన దిగుతామని హెచ్చరించారు.
ఏపీ, తెలంగాణలోని కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది దాదాపు 80 మంది సోమవారం విజయవాడలోని సంస్థ కార్యాలయానికి వచ్చారు. రావాల్సిన బకాయిలపై సంస్థ ప్రతినిధులను నిలదీశారు. కానీ డ్రైవర్ల గోడును ఆ ప్రతినిధులు పట్టించుకోలేదు. ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో ఉన్నారని, ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరని కసురుకున్నారు. అంతకుమించి మాట్లాడితే పోలీసులతో లోపలేయిస్తామని బెదిరించారు. దీంతో సంస్థ ప్రతినిధులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేశినేని నాని ఆంతరంగికుడు ఫణి అక్కడికి చేరుకుని డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ నెల 15న వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేస్తామని, లేకపోతే 16న ఎంపీ కేశినేని నానితో చర్చకు అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారు. ఈ నెల15లోగా జీతాలు చెల్లించకపోతే కుటుంబసభ్యులతో కలసి 17న విజయవాడలో ర్యాలీ నిర్వహించి, కేశినేని నాని కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని డ్రైవర్లు, ఇతర సిబ్బంది హెచ్చరించారు.