Kesineni Travels
-
కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్
సాక్షి, విజయవాడ : కార్మికుల సమస్యలు ఉన్నంత కాలం ఎర్రజెండా పార్టీలు ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...కేశినేని నాని వ్యాఖ్యలను ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేశినేని రాజకీయాల్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు గానీ ఎర్రజెండా పోరాటాలు మాత్రం ఉంటాయని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలు తీర్చకుండా పార్టీల పేరుతో విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్విటర్లో కమ్యూనిస్టు పార్టీపై ఇలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పోరాడతారని పేర్కొన్నారు. అటువంటి పార్టీలపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగామారి పోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది. — Kesineni Nani (@kesineni_nani) July 27, 2019 -
జీతాల కోసం రోడ్డెక్కిన కేశినేని ట్రావెల్స్ కార్మికులు
సాక్షి, విజయవాడ : కొంత కాలంగా కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని కార్మికులు లెనిన్ సెంటర్లో నిరసన చేపట్టారు. కార్మికులకు ఎగవేసిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల నుంచి కేశినేని ట్రావెల్స్ బాధితులు లేబర్ కోర్టులో పోరాడుతుంటే, అధికారం అడ్డం పెట్టుకొని లేబర్ ఆఫీసర్‌ను సైతం తమ వైపు తిప్పుకున్నారని విమర్శించారు. కార్మికులక చెల్లించాల్సిన ఎనిమిది నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎన్నికల అఫిడవిట్లో సైతం కార్మికులకు జీతాలు చెల్లించాలని పేర్కొన్నారని స్పష్టం చేశారు. కేశినేని ట్రావెల్స్ బాధితుడు రంగారావు మాట్లాడుతూ.. బకాయి పడిన జీతాల కోసం మూడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నామని, కోర్టును ఆశ్రయించిన సత్వర న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ నాని మనుషులు బెదిరిస్తున్నారని, కొంతమంది కార్మికులను సైతం భయపెట్టి, దాడులు చేసి తమ వైపు తిప్పుకున్నారన్నారని ఆందోళన చెందుతున్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా, ఇచ్చింది తీసుకోవలని తమ కార్యకర్తలతో కొట్టించారన్నారు. ఒక్కో కార్మికుడికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతాలు రావాల్సి ఉందని, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ హోదాలో ఉండి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. -
ఏడాదిగా జీతాలివ్వని కేశినేని..!
- పైగా అదనంగా 3 నెలల వేతనం చెల్లించినట్టు అసత్య ప్రచారం - దీంతో కేశినేని కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సిబ్బంది సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన ట్రావెల్స్ సంస్థ తమ సిబ్బందిని నట్టేట ముంచింది. దాదాపు ఏడాదిగా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కేశినేని ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డునపడ్డారు. పైగా బకాయిలతో పాటు అదనంగా మూడు నెలలు జీతాలు చెల్లించినట్లు అసత్య ప్రచారం చేయించుకుంటోంది. దీంతో కంగుతిన్న ఏపీ, తెలంగాణలోని డ్రైవర్లు, ఇతర సిబ్బంది సోమవారం విజయవాడలోని కేశినేని కార్యాలయానికి చేరుకుని సంస్థ ప్రతినిధులను నిలదీశారు. ఈ నెల 15లోగా జీతాలు చెల్లించకుంటే తమ కుటుంబాలతో సహా ఈ నెల 17న ఆందోళన దిగుతామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలోని కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది దాదాపు 80 మంది సోమవారం విజయవాడలోని సంస్థ కార్యాలయానికి వచ్చారు. రావాల్సిన బకాయిలపై సంస్థ ప్రతినిధులను నిలదీశారు. కానీ డ్రైవర్ల గోడును ఆ ప్రతినిధులు పట్టించుకోలేదు. ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో ఉన్నారని, ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరని కసురుకున్నారు. అంతకుమించి మాట్లాడితే పోలీసులతో లోపలేయిస్తామని బెదిరించారు. దీంతో సంస్థ ప్రతినిధులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేశినేని నాని ఆంతరంగికుడు ఫణి అక్కడికి చేరుకుని డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ నెల 15న వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేస్తామని, లేకపోతే 16న ఎంపీ కేశినేని నానితో చర్చకు అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారు. ఈ నెల15లోగా జీతాలు చెల్లించకపోతే కుటుంబసభ్యులతో కలసి 17న విజయవాడలో ర్యాలీ నిర్వహించి, కేశినేని నాని కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని డ్రైవర్లు, ఇతర సిబ్బంది హెచ్చరించారు.