పీఠాధిపతుల ర్యాలీని నీరుగార్చేందుకు ప్రభుత్వ యత్నం
నిర్వహించేందుకే హిందూధర్మ పరిరక్షణ కమిటీ నిర్ణయం
టీడీపీ, బీజేపీ నేతల మధ్య ముదిరిన వివాదం
గోశాలలో ఇరువర్గాల బాహాబాహీ
నరేంద్రమోదీపై ఎంపీ కేశినేని నాని ఫైర్
హుటాహుటిన ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు
కేంద్రం, రాష్ట్రంలో మిత్రపక్షాలుగా అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆలయాల కూల్చివేత అంశం చిచ్చురగిల్చింది. పైచేయి సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సోమవారం విజయవాడలో పీఠాధిపతులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్న నేపథ్యంలో పరిస్థితిని చల్లబరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన ఐదుగురు మంత్రులతో కమిటీని వేసింది.
విజయవాడ : ఆలయాలను రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగా కూల్చివేయడంతో పది రోజులుగా విజయవాడ నగరం వేడెక్కింది. సాక్షిలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో రాజధాని పరిధిలో ఏ ఇద్దరు కలిసినా ఆలయాల కూల్చివేతపైనే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ అంశమే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో నేపథ్యంలో సోమవారం పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు, స్వామీజీలు, హిందూ ధర్మపరిరక్షణ సమితి ముఖ్యలు వన్‌టౌన్‌లోని వినాయకుడు గుడి నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని విజయవంతం చేసేందుకు హిందూధర్మ పరిరక్షణ కమిటీ ప్రయత్నిస్తుండగా, నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం చర్యలు ప్రారంభించింది. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ నేతలు ఆలయాల కూల్చివేత విషయంలో వైరివర్గాలుగా మారారు. అంతటితో ఆగకుండా ఆదివారం బాహాబాహీకి దిగారు. ఫలితంగా నగరంలో ఉద్రిక్తత నెలకొంది. పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.
మంత్రుల కమిటీ ఏర్పాటు
ఆలయాలను కూల్చివేసిన పదిరోజుల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఐదుగురు మంత్రులతో కమిటీని వేశారు. మాణిక్యాలరావు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాసరావుతో కూడిన ఈ కమిటీ ఆది వారం సాయంత్రం హడావుడిగా సమావేశమై ఆలయాల కూల్చివేతపై చర్చించింది. ఈ సమావేశానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. భేటీ అనంతరం కూల్చిన ఆలయాలను పరిశీలించిన కమిటీ వాటిని పునర్నిర్మిస్తామంటూ హామీ ఇచ్చింది. ఎప్పటిలోగా నిర్మిస్తామనేది స్పష్టమైన హామీ ఇవ్వలేదు. బీజేపీ నేతలతోనూ మాట్లాడామని.. ఇక ఆలయాలు విషయంలో ఏ విధమైన ఇబ్బందీ ఉండబోదంటూ సర్ది చెప్పేందుకు మంత్రులు ప్రయత్నించారు. మంత్రుల హామీతో తృప్తి చెందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు సోమవారం పీఠాధిపతుల ర్యాలీని యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయాల కూల్చివేతపై భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ర్యాలీకి పీఠాధిపతులు, మఠాధిపతులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రాకపోయినా వెనక్కు తగ్గకూడదని భావిస్తున్నారు.
బీజేపీ నేతలపై బుద్దా వర్గం దాడి
బీజేపీ నేతలకు మిత్రపక్షం నుంచే ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. నగరంలో కూల్చివేసిన ఆలయాలను పరిశీలించిన అనంతరం గోశాలను పరిశీలించిన బీజేపీ అత్యుత్తమ కమిటీ ప్రతినిధులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ప్రధాన కార్యాదర్శి సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వర్గంతో వచ్చి వారిని అడ్డుకున్నారు. విలేకరులతో మాట్లాడకుండా వాగ్వాదానికి దిగారు. రెండు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగడంతో పోలీ సులు కల్పించుకుని బీజేపీ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో సురేష్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడాల్సి వచ్చింది.