గూండాగిరీ బాధ్యులపై చర్యలేంటి?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన ఘటనలో బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ సాధారణ పరి పాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్య దర్శి, కమిషనర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు టీడీపీ నేతలైన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, మేయర్ కోనేరు శ్రీధర్‌లకు సైతం నోటీసు లిచ్చింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ 13కు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల బరితెగింపుపై ‘సాక్షి’లో గత నెల 27న ‘ఐపీఎస్‌పై గూండాగిరీ’ పేరుతో ప్రచురితమైన వార్తా కథనాన్ని చూసి స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు దీనిని ఏసీజే దష్టికి తీసు కెళ్లారు. దీనిని ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కమిటీకి నివేదించగా, మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు ఏసీజే ‘సాక్షి’ కథనాన్ని పిల్‌గా పరిగణించారు.