సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూకబ్జా వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సుమోటోగా విచారణ చేపడుతున్నారు. బోండా ఉమ భూ కబ్జాలపై మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా ఈ విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో తమ భూములు కబ్జాకు గురైన బాధితులు ఆధారాలతో విచారణకు రావాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి బాధితులను ఆర్డీవో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
తప్పుడు పత్రాలతో స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని స్వాహా చేసేందుకు ఎమ్మెల్యే బోండా, ఆయన సతీమణి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రూ. 50 కోట్ల విలువచేసే 5.16 ఎకరాల భూమిని భార్య పేరిట బోండా ఉమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన మాట వినకుంటే అంతు చూస్తామని స్వాతంత్ర్య సమరయోధుడి వారసుడైన సురేశ్‌ను ఆయన బెదిరించారు.
బోండా ఉమ భూకబ్జాపై బాధితుడు సురేశ్ సీఐడీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ బోండా ఉమ తనను వేధిస్తున్నారని, తన స్థలంలో ఇంకా ప్రహరీగోడను తొలగించలేదని బాధితుడు సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చేపట్టిన ఈ సుమోటో విచారణ వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, బోండా ఉమ భూకబ్జాపై సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తానని సురేశ్ తెలిపారు. టీడీపీ హయాంలో కాపుల భూములు కబ్జాకు గురవుతున్నాయని, తనకు జరిగిన అన్యాయంపై కాపు సంఘాల నేతలను కలుస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment