land grabbing case
-
మల్లారెడ్డికి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికు మరో షాక్ తగిలింది. పేట్‌బషీర్‌బాద్ పోలీసులు ఆయనపై భూకబ్జా కేసు నమోదు చేశారు. మొత్తం ఏడు సెక్షన్లతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపైనా కేసు నమోదయినట్లు సమాచారం.పేట్ బషీర్‌బాద్‌లో 32 గుంటల భూమిని కబ్జా చేశారని, ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని సాఫ్ట్వేర్ ఉద్యోగి శేరి శ్రీనివాస్‌రెడ్డి పేట్‌బషీర్‌బాద్ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.ఆ వివాదం మరిచిపోకముందే..ఇటీవలె సుచిత్ర సర్కిల్ సమీపంలోని మిలటరి కాంపౌండ్ వాల్ రోడ్డులో మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల సర్వే నెంబర్ 82లోని భూమిలో గత నెల 18వ తేదీన మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి జోక్యంతో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. ఆ సమయంలో మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ జైలుకు సైతం తరలించారు. మరోవైపు.. ఈ భూవివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది కూడా. దీంతో ఈ వివాదాస్పద భూమిలో అధికారులు ఒకటికి రెండుసార్లు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారులు 33 గుంటలు మల్లారెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు తేల్చారు. సర్వే నెంబరు 82లోని 33 గుంటల భూమిని ఆయన కబ్జా చేసినట్లు కోర్టుకు నివేదిక అందజేశారు. ఇక.. అయితే ఈ వివాదంలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు చివరకు.. మేడ్చల్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈలోపే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం గమనార్హం. -
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా. ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు. -
బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదైంది. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్‌నం.14లో భూకబ్జా చేశారంటూ కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ డ్యాకుమెంట్లతో భూ కబ్జాకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేయగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు: సంతోష్ తనపై చేసిన భూకబ్జా ఆరోపణలు అవాస్తవమని జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. ఫోర్జరీ అనే మాటకు తావులేదు. అది వాస్తవం కాదు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి’’ అని సంతోష్ వివరణ ఇచ్చారు. ‘‘ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి, నా ఆధీనంలోనే ఉంది. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలి వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు’’ అని సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా? -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్‌స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్‌స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్‌స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్‌స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్‌స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్‌లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్‌స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్‌స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్‌స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్‌స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్‌స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్‌ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
టీడీపీ నేత అనుచరులు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అండదండలతో నకిలీ ఇంటి పన్ను పుస్తకాలతో భూ దందా సాగించిన ఇద్దరు భూ కబ్జాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడ సర్వేనెంబర్ 388 వికలాంగుల కాలనీ లో 180 గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. టీడీపీ నేత అండదండలతో సాగిన ఈ నిర్వాకంలో భూ కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసు యంత్రాంగాలు కదలికతో ఈ వ్యవహారంలో ఇద్దరు అరెస్టు కాగా, మరొక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత టీడీపీ ఇంచార్జ్ చిక్కల విజయబాబు అండదండలతో అతని వద్ద పనిచేసిన డ్రైవర్ మల్లెల విజయ్ కుమార్, గంట లక్ష్మణ్ కుమార్, తమ్మినేని రమణ వీరు ముగ్గురూ కలిసి భూ అక్రమాలకు తెరతీశారు. మధురవాడ వికలాంగుల కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 336లో రెండు 90 గజలు బిట్లు దాదాపుగా 180 గజాలు ప్రభుత్వ భూమిని 2014 ఈ సంవత్సరం నుండి అక్కడ నివసిస్తున్నట్లు నకిలీ జీవీఎంసీ ఇంటి పన్ను పుస్తకాలను చూపించి గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పట్టాల పండుగలో క్రమబద్ధీకరణ చేయించుకొని సుమారు కోటి రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడినట్లు ఆధారాలు వెలువడ్డాయి. ఇవే కాకుండా కాలనీల్లో పలు స్థల యజమానులను భయబ్రాంతులకు గురి చేసి స్థలాలను కాజేసినట్లు ఇప్పటికే పలు ఆధారాల దొరికాయని వాటి మేరకు స్థానికుల ఫిర్యాదుతో చిన్న గదిలి మండలం తహసిల్దార్ ఆర్ నరసింహమూర్తి ఆదేశాలు మేరకు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వీరి ముగ్గురి పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేసి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. భూ కబ్జాలకు పాల్పడిన నిందితులు ఏ 1 మల్లెల విజయ్ కుమార్, ఏ3 నిందితుడు తమ్మినేని రమణలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, ఏ 2 నిందితుడైన గంట లక్ష్మణ్ కుమార్ పరారీలో ఉన్నాడని అతనిని కూడా గాలించి పట్టుకుంటామని సీఐ రవికుమార్ వెల్లడించారు. -
భూ కబ్జా కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్
పీఎం పాలెం(భీమిలి): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గతంలో జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్ వేసి భవన నిర్మాణం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని అప్పట్లోనే కూల్చేశారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే స్థలంలో నిర్మాణం చేపట్టగా విషయం తెలుసుకున్న అధికారులు మళ్లీ కూల్చివేశారు. కొన్నాళ్ల తర్వాత జీవీఎంసీ, హౌసింగ్ బోర్డు అధికారులను మాయ చేసిన జహనార అదే స్థలంలో భవనం నిర్మించేసింది. అప్పట్లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే స్థలం సొంతం చేసుకుని దర్జాగా భవన నిర్మాణం పూర్తి చేసేసింది. అనంతరం టీడీపీ అధికారం కోల్పోయినప్పటికీ ఆక్రమణల్లో ఆరితేరిన షేక్ జహనార మాత్రం వెనక్కు తగ్గలేదు. తాజాగా ఈ నెల 13న సర్వే నంబరు 20/4లో ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. లారీలతో కంకర తీసుకొచ్చి యంత్రాల సహాయంతో పనులు చేపట్టింది. విషయం తెలుసుకున్న విశాఖ రూరల్ తహసీల్దార్ కె.నరసింగరావు ఆదేశాల మేర కు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పనులు నిలుపుదల చేయించారు. అనంతరం తహసీల్దారు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు టీడీపీ మహిళా నేత షేక్ జహనారను సోమవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. -
పోలీసులపైకి ‘రివర్స్’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనా పోలీసులపై తప్పుడు రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వారికి తలనొప్పిగా మారారు. హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు, దర్యాప్తు అధికారి ఏసీపీ విజయ్‌కుమార్‌తో పాటు డీసీపీ అవినాష్ మహంతి తదితరులపై వరుసపెట్టి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో శైలేష్ దాఖలు చేసిన మూడింటితో కలిపి మొత్తం 60 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సీసీఎస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాదులు శైలేష్ సక్సేనా, సంజయ్ సక్సేనా తదితరులు భోజగుట్టతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్న 4 ఖరీదైన స్థలాలపై కన్నేశారు. బోగస్ డాక్యుమెంట్లు, నకిలీ యజమానులను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రూ.వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో పరిచయం చేస్తూ పలు స్థలాలపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారంపై నమోదైన ఆరు కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేశారు. దీపక్‌రెడ్డితో పాటు శైలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ పథకమే.. అప్పట్లో బాధితులుగా ఉండి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై శైలేష్ ప్రైవేట్ కేసులు నమోదు చేశారు. వారంతా ఉద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదులు చేశారని, రాజకీయ కారణాలతోనే సీసీఎస్ అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. సివిల్ వివాదాల్లో సీసీఎస్ పోలీసులు తలదూర్చి తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. శైలేష్ సక్సేనా దాఖలు చేసే రిట్ పిటిషన్లలో అధికంగా అధికారుల పేర్లతోనే వేస్తున్నారు. దీంతో అధికారులే సొంతంగా లాయర్లను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. -
బోండా ఉమా భార్యకు నోటీసులు
సాక్షి, విజయవాడ : భూకబ్జా ఆరోపణల కేసులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు భార్య సుజాతకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆయన అనుచరుడు మాగంటి బాబుకు కూడా నోటీసులిచ్చారు. బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఆర్డీవో అధికారులు సోమవారం సబ్‌కలెక్టర్‌కు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీవో విచారణ చేపట్టనున్నారు. 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. -
బోండా భూకబ్జా.. కలెక్టర్ విచారణ... కానీ!
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూకబ్జా వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సుమోటోగా విచారణ చేపడుతున్నారు. బోండా ఉమ భూ కబ్జాలపై మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా ఈ విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో తమ భూములు కబ్జాకు గురైన బాధితులు ఆధారాలతో విచారణకు రావాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి బాధితులను ఆర్డీవో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని స్వాహా చేసేందుకు ఎమ్మెల్యే బోండా, ఆయన సతీమణి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రూ. 50 కోట్ల విలువచేసే 5.16 ఎకరాల భూమిని భార్య పేరిట బోండా ఉమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన మాట వినకుంటే అంతు చూస్తామని స్వాతంత్ర్య సమరయోధుడి వారసుడైన సురేశ్‌ను ఆయన బెదిరించారు. బోండా ఉమ భూకబ్జాపై బాధితుడు సురేశ్ సీఐడీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ బోండా ఉమ తనను వేధిస్తున్నారని, తన స్థలంలో ఇంకా ప్రహరీగోడను తొలగించలేదని బాధితుడు సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చేపట్టిన ఈ సుమోటో విచారణ వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, బోండా ఉమ భూకబ్జాపై సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తానని సురేశ్ తెలిపారు. టీడీపీ హయాంలో కాపుల భూములు కబ్జాకు గురవుతున్నాయని, తనకు జరిగిన అన్యాయంపై కాపు సంఘాల నేతలను కలుస్తానని చెప్పారు. -
బోండా ఉమ భూకబ్జా ఎపిసోడులో కీలక మలుపు!
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబం భూకబ్జా ఎసిసోడులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ భూభాగోతంపై ఫిర్యాదు చేసిన బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు ఆర్డీవో విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 24న విచారణకు హాజరై బోండా ఉమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. -
బెజవాడలో భూకుంభకోణం ; బోండా సుజాతపై కేసు
సాక్షి, విజయవాడ : అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల మరో అక్రమపర్వం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. సదరు కోటేశ్వర్‌రావును రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిమరీ సంతకాలు చేయించారు. కబ్జా విషయం తెలిసిన వెంటనే సమరయోధుల కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదంతా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది. అప్పుకోసం వెళితే ఇరికించారు : సీఐడీ దర్యాప్తులో గుట్టురట్టుకావడంతో భూవిక్రేతగా వ్యవహరించిన కోటేశ్వరరావు ఇరకాటంలో పడ్డాడు. సీఐడీ సోదాలతో బెదిరిపోయిన ఆయన.. టీడీపీ నాయకుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించాడు. ‘‘ఐదు లక్షల అప్పు కోసం కార్పొరేటర్ గండూరి మహేశ్(బోండా అనుచరుడు) దగ్గరికి వెళ్లాను. అందుకోసం కొన్ని కాగితాలపై సంతకాలు చేయించారు. తీరా సీఐడీ పోలీసులు మా ఇంట్లో సోదాలు చేసేదాకా తెలియదు.. నేను సంతకాలు పెట్టింది భూమికి సంబంధించిన పత్రాలని! వెంటనే మహేశ్‌కు ఫోన్ చేసి అడిగితే.. ‘భూమి నీదేనని పోలీసులకు చెప్పు. అలా కాకుంటే ఇబ్బందులు తప్పవ’ని అన్నాడు. ఈ క్రమంలోనే బెదిరింపులు కూడా వచ్చాయి. అంత విలువైన భూమి నాకే ఉంటే ఐదు లక్షల అప్పు ఎందుకు చేస్తాను? టీడీపీ నాయకుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. పోలీసులే కాపాడాలి’’ అని రామిరెడ్డి కోటేశ్వర్రావు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే తనయుడుపై భూకబ్జా కేసు
-
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్ : భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నగరంలో పలుచోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరికొద్దిసేపట్లో దీపక్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. -
దీపక్ రెడ్డి నుంచి కీలక వివరాల సేకరణ
- జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సీసీఎస్ - తాను కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానంటూ వెల్లడి - ఆయనకు అన్ని విషయాలూ తెలుసన్న న్యాయవాది శైలేష్ సాక్షి, సిటీబ్యూరో : భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డితో పాటు సహ నిందితులైన న్యాయవాది శైలేష్ సక్సేన, శ్రీనివాస్‌ల పోలీసు కస్టడీ గవుడు గురువారంతో ముగిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు చేయించిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్ అధికారులు దీపక్‌రెడ్డితో పాటు ఇతర నిందితుల్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించారు. ఎమ్మెల్సీ అయినా దీపక్‌రెడ్డిని పోలీసులు ఇతర నిందితుల మారిదిగానే ట్రీట్ చేశారు. సీసీఎస్ కార్యాలయం లోపలి వైపు 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో ఉన్న లాకప్ గదిలోనే ఉంచారు. విచారణ చేస్తున్న సమయంలోనే అక్కడ నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించారు. రాత్రి వేళల్లో సైతం దీపక్‌రెడ్డి ఇతర నిందితులతో కలిసి పత్రికలు పరుచుకుని నేల పైనే పడుకున్నారు. భూ కబ్జాలు, బోగస్ డాక్యుమెంట్లు, యజమానుల సృష్టిపై ప్రధానంగా ఇతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే తాను కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానని, స్థలాలు ఖరీదు చేస్తున్నామంటూ శైలేష్ సక్సేన చెప్పడంతో అలా చేశానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలను ఎన్నికల ఆఫిడవిట్లో ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్నా ఎప్పటికైన తన సొంతం అవుతాయనే అలా చేశానని చెప్పినట్లు తెలిసింది. మరోపక్క న్యాయవాది శైలేష్ సక్సేన విచారణలో కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులు సేకరించారు. బోగస్ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి సంగ్రహించారు? స్టాంపులు ఏ విధంగా తయారు చేశారు? తదితర వివరాలు రాబట్టారు. విచారణ నేపథ్యంలో దీపక్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటూ శైలేష్ సక్సేన చెప్పినట్లు తెలుస్తోంది. జీపీఏలు చేసుకునే సమయంలో ఆయనే స్వయంగా సంతకాలు చేశారని, కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చినప్పుడు ఆధీనంలోకి తీసుకోవడానికి దీపక్‌రెడ్డి సైతం వచ్చినట్లు వెల్లడించాడు. మరో నిందితుడైన శ్రీనివాస్ విచారణలో అత్యంత కీలక ఆధారాలు సీసీఎస్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో నిందితుల్ని మరో ఐదు రోజుల పోలీసుకస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిపై భూకబ్జా కేసు
శంషాబాద్: భూకబ్జా కేసులో బీజేవైఎం జిల్లా అధ్యక్షడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సహా 9 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. శంషాబాద్ మండలం తోండుపల్లి గ్రామంలో భూకబ్జా చేశారనే ఆరోపణలతో తొమ్మిదిమందిపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 6/2 నుంచి 6/7 వరకు గల 18 ఎకరాల భూమిని కబ్జా చేశారని హైదరాబాద్‌కు చెందిన పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బైతి శ్రీధర్, టీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచేర్ల శ్రీనివాస్‌లతో పాటు శ్రీకాంత్, బైతి శ్రీనివాస్, రాచమల్ల రాజు, కుమార్, శ్రీశైలం, శేఖర్, ఆనంద్‌లపై శంషాబాద్ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ఆప్ మరో ఎమ్మెల్యే అరెస్ట్
భూకబ్జా, మోసం కేసులో అదుపులోకి.. న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక భూకబ్జా కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం ఇది రెండోసారి. తూర్పు ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మనోజ్కుమార్పై భూకబ్జా ఆరోపణలున్నాయి. దీంతోపాటు ఆయన మోసానికి పాల్పడ్డారని ఏడాది కిందట కేసు కూడా నమోదైంది. ఈ కేసులో పోలీసులు మనోజ్‌కుమార్‌ను గురువారం విచారణకు పిలిపించారు. కొంతసేపు ప్రశ్నించిన అనంతరం.. అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471(నకిలీ పత్రాలను అసలైనవిగా చూపడం), 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) సెక్షన్లను నమోదు చేసినట్లు ఢిల్లీ ఉత్తర రేంజ్ జాయింట్ కమిషనర్ సంజయ్ బెనివాల్ చెప్పారు. మనోజ్‌కుమార్‌ను ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 2 రోజుల పోలీసు కస్టడీకి జడ్జి అప్పగించారు. కాగా బీజేపీ ఢిల్లీ పోలీసులను ఆప్‌పై రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని ఆప్ మండిపడింది. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల మధ్య విభేదాల వల్లే, తాను ఆప్ ఎమ్మెల్యే కావడం వల్లే అరెస్టు చేశారని మనోజ్ పేర్కొన్నారు. ఏడాది కిందే కేసు నమోదైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదని.. ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అరెస్టు చేయడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్‌పై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా సెప్టెంబర్ 7 వరకు గడువిచ్చింది.