బోడా సుజాత, ఆమె భర్త, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు(ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న ఫొటో)
సాక్షి, విజయవాడ : అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల మరో అక్రమపర్వం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. సదరు కోటేశ్వర్‌రావును రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిమరీ సంతకాలు చేయించారు. కబ్జా విషయం తెలిసిన వెంటనే సమరయోధుల కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదంతా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది.
అప్పుకోసం వెళితే ఇరికించారు : సీఐడీ దర్యాప్తులో గుట్టురట్టుకావడంతో భూవిక్రేతగా వ్యవహరించిన కోటేశ్వరరావు ఇరకాటంలో పడ్డాడు. సీఐడీ సోదాలతో బెదిరిపోయిన ఆయన.. టీడీపీ నాయకుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించాడు. ‘‘ఐదు లక్షల అప్పు కోసం కార్పొరేటర్ గండూరి మహేశ్(బోండా అనుచరుడు) దగ్గరికి వెళ్లాను. అందుకోసం కొన్ని కాగితాలపై సంతకాలు చేయించారు. తీరా సీఐడీ పోలీసులు మా ఇంట్లో సోదాలు చేసేదాకా తెలియదు.. నేను సంతకాలు పెట్టింది భూమికి సంబంధించిన పత్రాలని! వెంటనే మహేశ్‌కు ఫోన్ చేసి అడిగితే.. ‘భూమి నీదేనని పోలీసులకు చెప్పు. అలా కాకుంటే ఇబ్బందులు తప్పవ’ని అన్నాడు. ఈ క్రమంలోనే బెదిరింపులు కూడా వచ్చాయి. అంత విలువైన భూమి నాకే ఉంటే ఐదు లక్షల అప్పు ఎందుకు చేస్తాను? టీడీపీ నాయకుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. పోలీసులే కాపాడాలి’’ అని రామిరెడ్డి కోటేశ్వర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment