దీపక్ రెడ్డి నుంచి కీలక వివరాల సేకరణ
- జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సీసీఎస్
- తాను కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానంటూ వెల్లడి
- ఆయనకు అన్ని విషయాలూ తెలుసన్న న్యాయవాది శైలేష్
సాక్షి, సిటీబ్యూరో : భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డితో పాటు సహ నిందితులైన న్యాయవాది శైలేష్ సక్సేన, శ్రీనివాస్‌ల పోలీసు కస్టడీ గవుడు గురువారంతో ముగిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు చేయించిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సీసీఎస్ అధికారులు దీపక్‌రెడ్డితో పాటు ఇతర నిందితుల్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించారు. ఎమ్మెల్సీ అయినా దీపక్‌రెడ్డిని పోలీసులు ఇతర నిందితుల మారిదిగానే ట్రీట్ చేశారు. సీసీఎస్ కార్యాలయం లోపలి వైపు 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో ఉన్న లాకప్ గదిలోనే ఉంచారు. విచారణ చేస్తున్న సమయంలోనే అక్కడ నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించారు.
రాత్రి వేళల్లో సైతం దీపక్‌రెడ్డి ఇతర నిందితులతో కలిసి పత్రికలు పరుచుకుని నేల పైనే పడుకున్నారు. భూ కబ్జాలు, బోగస్ డాక్యుమెంట్లు, యజమానుల సృష్టిపై ప్రధానంగా ఇతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే తాను కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానని, స్థలాలు ఖరీదు చేస్తున్నామంటూ శైలేష్ సక్సేన చెప్పడంతో అలా చేశానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలను ఎన్నికల ఆఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్నా ఎప్పటికైన తన సొంతం అవుతాయనే అలా చేశానని చెప్పినట్లు తెలిసింది.
మరోపక్క న్యాయవాది శైలేష్ సక్సేన విచారణలో కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులు సేకరించారు. బోగస్ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి సంగ్రహించారు? స్టాంపులు ఏ విధంగా తయారు చేశారు? తదితర వివరాలు రాబట్టారు. విచారణ నేపథ్యంలో దీపక్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటూ శైలేష్ సక్సేన చెప్పినట్లు తెలుస్తోంది. జీపీఏలు చేసుకునే సమయంలో ఆయనే స్వయంగా సంతకాలు చేశారని, కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చినప్పుడు ఆధీనంలోకి తీసుకోవడానికి దీపక్‌రెడ్డి సైతం వచ్చినట్లు వెల్లడించాడు. మరో నిందితుడైన శ్రీనివాస్ విచారణలో అత్యంత కీలక ఆధారాలు సీసీఎస్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో నిందితుల్ని మరో ఐదు రోజుల పోలీసుకస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.