నారాయణ విద్యా సంస్థలో తనిఖీల్లో పట్టుబడిన నగదును చూపిస్తున్న ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి (ఇన్‌సెట్‌లో) టీడీపీ నేత నారాయణ
నల్లధనం చేరవేతకు ఓ డొల్ల సంస్థ.. నెల్లూరు కేంద్రంగా ‘ఎన్‌స్పైరా’ ఏర్పాటు
నల్ల కంపెనీ డైరెక్టర్లుగా కుమార్తె, అల్లుడు
విద్యాసంస్థ పేరుతో అక్రమంగా పన్ను రాయితీలు
ఇటు పన్నులు ఎగవేత.. అటు నల్లధనం తరలింపు
అదే సంస్థ ద్వారా అమరావతి భూ దందా
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు.
మరోవైపు ఎన్‌స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్‌స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్‌ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్‌స్పై నిర్వాకాలు ఇవిగో..
నిధులు మళ్లించేందుకే..
నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్‌స్పైర మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు.
అమరావతి భూ దందా..
టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి.
ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు.
అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్‌డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు.
అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ
నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్‌స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్‌స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్‌లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు.
ఓ వ్యాపార సంస్థ ఎన్‌స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్‌స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్‌స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు.
నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్‌స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్‌స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్‌ఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
రూ.10 కోట్ల పన్నుల ఎగవేత
లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్‌స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్‌ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment