![Intelligence inquired on the Bonda uma land scam - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/30/bbmmds.jpg.webp?itok=2vNi0q74)
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి బొప్పికట్టించిన ‘బొండాగిరి’ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు బొండా వ్యవహారాల చిట్టాను సేకరించినట్టు సమాచారం. నగరంలో సాధారణ వ్యక్తిగా మొదలైన ప్రస్థానం, చిత్తూరు జిల్లాలో అజ్ఞాతవాసం, ఆపై రాజకీయంగా సాగిస్తున్న దందాల వరకు అన్ని వివరాలనూ సేకరించారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో ఆయన తనయుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్ రేస్, యువకుడి మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరుల ప్రమేయమున్న పలు వ్యవహరాలపై కూడా ఆరా తీశారు.
బ్రాహ్మణ సమాఖ్య నిర్వహణలో ఉన్న సత్యనారాయణపురం సీతారామ కళ్యాణమండపానికి తాళం వేయడం నుంచి మాదంశెట్టి సుమశ్రీకి చెందిన ప్లాట్‌ను ఆక్రమించుకోవడం (వైద్యం అందక ఆమె 13 ఏళ్ల కుమార్తె సాయిశ్రీ మృత్యువాత పడడం), విజయవాడ శివారు కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా సోదరుడు పెన్సింగ్ వేసి ఆక్రమించడం, సింగ్‌నగర్, పాయకాపురం బర్మాకాలనీల్లో ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు, ప్లాట్లు ఆక్రమించడం ఇలా అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారని సమాచారం. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే సతీమణి సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి రాంబాబు మరో ఆరుగురు ఉండటం సంచలనం రేపింది. ఈ అన్ని సంఘటనల వివరాలతో ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
బొండా ఉమాపై అనర్హత వేటువేయండి
విజయవాడ సిటీ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూకబ్జాలు, దందాలపై చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బొండా అనుచరులు గతంలో సుమశ్రీ అపార్ట్‌మెంట్‌ను ఆక్రమించుకోవడం, సెటిల్‌మెంట్లతో నిస్సహాయులను బెదిరించడం ఇలా ఎన్నో దారుణాలు వెలుగుచూసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment