బెజవాడలో బొండాగిరి! | TDP leader Bonda Uma land scam | Sakshi
Sakshi News home page

బెజవాడలో బొండాగిరి!

Published Mon, Jan 29 2018 3:52 AM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM

TDP leader Bonda Uma land scam - Sakshi

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, సతీమణి బొండా సుజాత

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరంలో 5.16 ఎకరాల భూమి.. విలువ రూ.50 కోట్లు పైమాటే... యజమానులు సాదాసీదా వ్యక్తులు. ఇంకేముంది టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రహరీ 
కట్టేశారు... తప్పుడు పత్రాలు సృష్టించి దానికి తన భార్యను యజమానిని చేసేశారు. ఆ భూమికి వారసుడినని వచ్చిన వ్యక్తిపై తన మనుషులతో దౌర్జన్యం చేసి వెల్లగొట్టారు. విషయం వెలుగులోకి వచ్చి సీఐడీ కేసు నమోదు కావడంతో అధికారదర్పం ప్రదర్శిస్తున్నారు. తమ మాట వినకుంటే అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.   
 
స్వాతంత్య్రసమరయోధుడి కుటుంబం నేపథ్యం ఇదీ... 
విజయవాడ మొగల్రాజపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్య్రసమరయోధుడు. అప్పట్లో కర్నూలు జైల్లో మూడేళ్లు శిక్ష అనుభవించారు కూడా. ఆయనకు ప్రభుత్వం 1952లో విజయవాడలోని సింగ్‌నగర్‌లో 10.16 ఎకరాల భూమి కేటాయించింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో వెంటకేశ్వరరావుకు వివాహం కాలేదు. రామకృష్ణకు వివాహమై పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు 1981లో, పెద్ద కుమారుడు వెంటకేశ్వరరావు 2013లో చనిపోయారు.

ఈ నేపథ్యంలో ఆ భూమిపై విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కన్నుపడింది. ప్రస్తుతం అక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.10కోట్లు పైనే ఉంది. ఆ లెక్కన దాని విలువ రూ.50కోట్లుపైమాటే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లు ఒప్పంద పత్రాలు సృష్టించారు. (వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు.) అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లు మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి డెవలప్‌మెంట్‌ కోసం రాసిచ్చినట్లు పత్రాలు సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్, నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపాలాగా ఉంచారు. 

కోటేశ్వరరావును బురిడీ కొట్టించింది ఇలా...  
ఈ భూమాయ కోసం అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను కూడా ఎమ్మెల్యే బోండా పకడ్బందీగా బురిడీ కొట్టించారు. కోటేశ్వరరావు తన ఇంటిని తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడైన కార్పొరేటర్‌ మహేష్‌ను సంప్రదించారు. అందులో భాగంగా విజయవాడ గాంధీ నగర్‌లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లిన కోటేశ్వరరావుతో పలు పత్రాలపై సంతకాలు చేయించారు. ఆ తరువాత సాంకేతిక కారణాలతో అప్పు ఇవ్వలేమని చెప్పి పంపించేశారు. ఆ రోజు కోటేశ్వరరావు చేసిన సంతకాలతోనే కథ నడిచింది. వెంకటేశ్వరరావు నుంచి భూమిని కోటేశ్వరరావు కొనుగోలు చేసినట్లు... దాన్నే ఎమ్మెల్యే భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి పవర్‌ ఆఫ్‌ అటార్నీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు మార్చారు. కాగా అతనితో పాటు భూమి రాయించినట్లు ఉన్న మరో వ్యక్తి అబ్దుల్‌ మస్తాన్‌ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.  

వెలుగులోకి వచ్చిందిలా...  
 తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు సురేష్‌బాబు (రామకృష్ణ కుమారుడు) అక్కడకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో అక్కడికి వెళ్లిన సురేష్‌పై ఎమ్మెల్యే మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్‌ సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల క్రితం సీఐడీ విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించించారు. భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు తనకు ఆ భూమి విషయమే తెలీదని... రిజిస్ట్రేషన్‌ చేస్తానని ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను చేసిన సంతకాలను ఇలా వాడుకున్నారని కోటేశ్వరరావుకు అర్థమై అదే విషయాన్ని వారికి చెప్పారు. దీంతో సీఐడీ వారు బోండా ఉమా భార్య సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి బాబు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.   
 
ఒప్పుకోకుంటే చంపేస్తాం అంటూ కోటేశ్వరరావుకు బోండా వర్గీయుల బెదిరింపులు 
తమ భూబాగోతం బట్టబయలు కావడం, అందులో కోటేశ్వరరావు వాంగ్మూలం కీలకం కావడంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. తాము చెప్పినట్లు చేస్తే భారీ మొత్తం ఇవ్వడంతోపాటు కేసు నుంచి బయటపడేస్తామని ఆశ చూపుతున్నారు. లేకుంటే అంతు చూస్తామని బోండాకు అత్యంత సన్నిహితుడైన కార్పొరేటర్‌ గండూరి మహేష్‌ బెదిరిస్తున్నారు. దాంతో భీతిల్లిన కోటేశ్వరరావు బోండా ఉమా వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ను ఆదివారం కోరారు. 
 
మా భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం కబ్జా చేసింది: కేసిరెడ్డి సురేష్‌బాబు  
‘స్వాతంత్య్ర సమరయోథుడైన మా తాతగారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం కబ్జా చేసింది. సామాన్యులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే బోండా ఉమానే తన భార్య సుజాత పేరిట భూమి కబ్జా చేస్తే ఇక మాకు దిక్కెవరు? దీనిపై మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి’ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement