సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంతో టీడీపీ సర్కారు తాత్కాలిక చర్యలతో మరోసారి మభ్యపెట్టేందుకు ఉపక్రమించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోవడంతో ఇప్పటికే తమపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా ఏమి చేస్తే ప్రజలను మరోసారి మభ్య పెట్టవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో నిఘా వర్గాలు ప్రజల నుంచి ఈమేరకు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో నిర్వహించిన సర్వేలో కూడా టీడీపీ సర్కారు వైఫల్యాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడి కావడంతో ఎక్కువ ఖర్చు కాని తాత్కాలిక పనులు చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
నమ్మటం లేదనే నిర్ణయానికి వచ్చిన అధినేత
టీడీపీ గత ఎన్నికలకు ముందు చెప్పిన రైతు, డ్వాక్రా రుణాల మాఫీ హామీని నెరవేర్చకపోవడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పడకపోవడం, నిరుద్యోగ భృతి అదిగో.. ఇదిగో అంటూ నాలుగేళ్లుగా కాలయాపన చేయడం లాంటి అనేక వైఫల్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు ఇక ఏ మాత్రమూ నమ్మకం లేదన్న అభిప్రాయానికి స్వయంగా ప్రభుత్వాధినేతలే వచ్చా రు. దీంతో గత ఎన్నికలకు ముందు ప్రకటించిన దీర్ఘకాలిక హామీలను నెరవేర్చకుండా ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు తాత్కాలిక ఉపశమ నం కల్పించడం ద్వారా దృష్టి మళ్లించి ఏదో ఒకటి చేశామనే అభిప్రాయం ఏర్పడేలా సర్కారు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ సమస్యలను తీరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై కొద్దిగైనా నమ్మకం కలుగుతుందనే కోణంలో మండలాలవారీగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయిస్తోంది.
గత సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు
‘మీ మండలంలో ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయి? చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు ఏమైనా కట్టాల్సి ఉందా? ఏ పనులు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది?’ తదితర వివరాలను ప్రజల నుంచి ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇంటెలిజెన్స్ జరిపిన సర్వేలో ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో తాజా సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. సమస్యలు పరిష్కరించాలంటూ 1100 టోల్ ఫ్రీ నెంబరుకు కుప్పలు తెప్పలుగా ఫోన్లు రావడం, వాటిని పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే వర్గాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
టీడీపీపై ప్రజలకు నమ్మకం లేదు
అధికార టీడీపీపై ప్రజల్లో నమ్మకం లేదని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఏ ఒక్క పనీ కావడం లేదని, కొద్దిపాటి సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినవారికే దక్కుతున్నాయని ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పెద్దగా భారం పడని సమస్యలను గుర్తించి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రజలు చెబుతున్న సమస్యలు ఏమిటి? వాటి ద్వారా ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత? అనే వివరాలను కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తద్వారా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రాజధాని నిర్మాణం లాంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చి తాత్కాలిక చర్యలతో వ్యతిరేకత తగ్గించుకోవాలనే దిశగా టీడీపీ సర్కారు పావులు కదుపుతోంది.
రాజకీయాల కోసం అధికార యంత్రాంగం
ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గతంలో కూడా ప్రభుత్వం సర్వే నిర్వహించింది. పింఛను వస్తోందా? రేషన్‌కార్డు ఉందా? బూత్ స్థాయిలో బలమైన నాయకులు ఎవరు? వారిని ప్రభావితం చేసే వారు ఎవరు? లాంటి అంశాలతో సర్వే చేపట్టింది. దీనికోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా రెండు నెలల పాటు ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఇప్పుడు మరోసారి 66 ప్రశ్నలతో రాజకీయ కోణంలో సర్వే చేయడం, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించడం చర్చనీయాంశమవుతోంది.
సర్వేలో స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత
‘రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకూ స్పష్టంగా తెలుసు. తమకు న్యాయం జరగడం లేదని అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో అసంతృప్తి నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చడం, వాల్మీకులకు ఎస్టీ హోదా లాంటి సామాజిక వర్గాల సమస్యలతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాజధాని నిర్మాణం తదితర అంశాల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్లే నమ్మకం పెరిగేందుకు ఏం చేయాలన్న దానిపై సర్వే చేస్తున్నాం. ప్రభుత్వంపై వ్యతిరేకత మా సర్వేలో స్పష్టంగా కనపడుతోంది. ఇదే అంశాన్ని నివేదికలో పొందుపరుస్తాం’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇంటెలిజెన్స్ సీఐ వెల్లడించారు.
సర్వేలో కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకూ...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సర్వేను ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహిస్తున్నాయి. మండలానికి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వే వివరాలను నియోజకవర్గ స్థాయిలో ఒక ఎస్‌ఐ ర్యాంకు అధికారి క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్లవారీగా సీఐ స్థాయి అధికారి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం డీఎస్పీ స్థాయి అధికారికి ఈ వివరాలను అందచేస్తున్నారు. జిల్లా నివేదికను ఎస్పీ స్థాయి అధికారి ఇంటెలిజెన్స్ డీఐజీకి సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లోని అధికారి ద్వారా సీఎంకు చేరుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment