ఆయకట్టు.. అంతా కనికట్టు!  | TDP Govt Borrowed funds heavily with high interest in the name of Water Projects | Sakshi
Sakshi News home page

ఆయకట్టు.. అంతా కనికట్టు! 

Published Tue, Jun 19 2018 4:36 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

TDP Govt Borrowed funds heavily with high interest in the name of  Water Projects - Sakshi

‘‘పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తాం. కొత్తగా 35.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’’. 
.. సాగునీటి ప్రాజెక్టులపై జూలై 28, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు 
 
నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.52,400.8 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు రూ.8,330.55 కోట్లు, నీరు–చెట్టు కింద చేసిన వ్యయం రూ.13,608.42 కోట్లను మినహాయిస్తే– పెండింగ్‌ ప్రాజెక్టుల పనులకు రూ.31,001.11 కోట్లు వ్యయం చేసింది. అంటే.. శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన మొత్తం కంటే ప్రభుత్వం రూ.13,633.11 కోట్లు అధికంగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. మరి.. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయా? కొత్తగా 35.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందాయా? రాష్ట్రం సస్యశ్యామలమైందా?.. 
తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వంశధార, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ సహా పెండింగ్‌ ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది.. జూన్‌ 8, 2014న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తామని జూలై 28, 2014న శ్వేతపత్రం విడుదల చేశారు. అంతేకాక, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా కొత్తగా 35.04 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.52,400.08 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రూ.8,330.55 కోట్లు ఖర్చు చేశారు. నీరు–చెట్టు కింద చేపట్టిన పనులకు రూ.13,608.42 కోట్లు వ్యయం చేశారు. ఈ రెండు పోనూ మిగిలిన ప్రాజెక్టుల పనులకు రూ.31,001.11 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. శ్వేతపత్రంలో ప్రకటించిన మొత్తం కన్నా రూ.13,633.11 కోట్లు అధికంగా ఖర్చుచేశారు. కానీ, ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. అలాగే, కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించిన దాఖలాల్లేవు. ప్రభుత్వం మాత్రం.. కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 13.08లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. 

కమీషన్‌ల కోసం 60సీ అస్త్రం 
జలయజ్ఞం కింద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన 11 ప్రాజెక్టుల పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులు పూర్తిచేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ 11 ప్రాజెక్టులను కేవలం రూ.780 కోట్లతో పూర్తిచేయవచ్చునని అప్పట్లో అధికారులు సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. కానీ, కమీషన్లు ఇవ్వకపోవడంతో టీడీపీ సర్కార్‌ పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసింది. స్టీలు, సిమెంటు, డీజిల్‌ వంటి ధరలు తగ్గినా ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే తాజాగా పనులను అప్పగించేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు, ఎస్పీ టక్కర్‌లు వద్దని వారించినా ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇవ్వడానికి    వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనుల్లో పరిమాణం పెరిగితే ఆ మేరకు కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇవ్వడానికీ ఉత్తర్వులు జారీచేశారు. అంతటితో ఆగలేదు.. ఏప్రిల్‌ 1, 2013 తర్వాత అంటే కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల పనులకూ పై ఉత్తర్వులూ వర్తించేలా ఆదేశాలిచ్చారు. ఫలితంగా.. అంచనా వ్యయం భారీగా పెరిగింది. అయినా, ఆ పనులను పూర్తి చేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఎప్పుడో పూర్తయి, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు మళ్లీ ప్రారంభించి.. అది తన ఘనతగా చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతుండడంపై అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వరకూ ఇదే కథ. 

తగ్గిపోతున్న ఆయకట్టు 
రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి 199.04 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్ర విభజనకు ముందే సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోరు బావుల కింద 104.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందేవి. కానీ.. గత నాలుగేళ్లుగా ఆయకట్టు తగ్గిపోతూ వస్తోంది. గరిష్ఠంగా 76 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీళ్లు అందించినట్లు జలవనరుల శాఖ రికార్డులే చెబుతుంటే క్షేత్ర స్థాయిలో ఆ మేరకు కూడా నీళ్లు అందిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, కమీషన్‌ల కోసం చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ.. గత మూడేళ్లలో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడాన్ని సర్కార్‌ దాచిపెడుతుండటం గమనార్హం.  

అక్షయపాత్రలుగా సాగునీటి ప్రాజెక్టులు 
వంద రూపాయలతో పూర్తయ్యే పనికి రూ.పది వేలు ఎవరైనా ఖర్చు చేస్తారా? పైగా అప్పులు చేస్తారా?.. ఎవ్వరూ చెయ్యరు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదే పనిచేస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచేశారు. దాంతో ఏర్పడిన నిధుల కొరతను భర్తీ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ) ద్వారా అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 7.90 శాతం వడ్డీతో రూ.3వేల కోట్ల అప్పును ప్రభుత్వం సమీకరించింది. మరో రూ.2వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతిచ్చింది. ప్రాజెక్టుల పనుల కోసం తక్షణమే ఇంకో రూ.10,796.53 కోట్ల నిధులు అవసరమని ఇటీవల జలవనరుల శాఖ ఈఎన్‌సీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇలా అప్పులు తీసుకోవడంపై ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) వంటి సంస్థల నుంచి రుణం తీసుకుంటే.. వాటిని విదేశీ రుణంతో చేపట్టే ప్రాజెక్టులు (ఈఏపీ)గా కేంద్రం పరిగణిస్తుందని, ఆ మేరకు రుణం చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కూడా లభిస్తుందని వారు చెబుతున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీడబ్ల్యూఆర్‌డీసీ ద్వారా కనీసం రూ.30వేల కోట్లను అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మొత్తం మీద రాష్ట్రాన్ని సుభిక్షం చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వ పెద్దలు కమీషన్‌ల కోసం అక్షయపాత్రలుగా మార్చుకున్నారని అధికార వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పనులన్నీ కోటరీ కాంట్రాక్టర్లకే.. 
పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటువేసి, అంచనా వ్యయాన్ని పెంచేసి.. ఎక్కువ కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారు. దీంతో ముఖ్యనేత ‘కోటరీ’కే పనులు దక్కుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఇదే తంతు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్, ఆర్థికమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌తో వ్యాపార సంబంధం ఉన్న హెచ్‌ఈఎస్, బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ వంటి సంస్థలకే నాలుగేళ్లుగా అధిక శాతం పనులను కట్టబెట్టారు. 
- హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వంశధార, వెలిగొండ ప్రాజెక్టుల్లో సీఎం రమేష్‌ సంస్థకు సింహభాగం పనులు కట్టబెట్టారు. 
- పోలవరం కుడి కాలువ పనుల్లో బొల్లినేని శీనయ్యకు.. కృష్ణా పుష్కరాలు, పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎక్కువ భాగం సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement