మరో ‘సామాజిక’ నాటకం! | Another commission to change the status of social classes | Sakshi
Sakshi News home page

మరో ‘సామాజిక’ నాటకం!

Published Wed, Jun 20 2018 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Another commission to change the status of social classes - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మరో సామాజిక డ్రామాకు తెరతీసింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల హోదా మార్పుపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హత ఉన్న సామాజిక వర్గాలను ఎస్సీలుగా, ఎస్టీలుగా గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సామాజికవేత్తలు, ఉద్యమకారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కాపులు, వాల్మీకులకు టీడీపీ దగా 
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 600లకుపైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేసింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కురుబలను ఎస్సీల్లో.. వడ్డెరలు, మత్స్యకారులు, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించి, న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. తమకు రిజర్వేషన్‌లు కల్పించాలని కాపులు ఉద్యమించడంతో రెండున్నరేళ్ల క్రితం జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్‌ ఛైర్మన్‌ మంజునాథ నివేదిక ఇవ్వకుండానే కాపులకు రిజర్వేషన్‌లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. వెనుకబడిన తరగతికి చెందిన వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ శాసనసభలో తీర్మానం చేశారు.

ఆ తర్వాత ఏనాడూ కాపులకు రిజర్వేషన్‌లు కల్పించాలని గానీ.. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని గానీ టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో బీజేపీతో అంటకాగిన టీడీపీ.. కాపులు, వాల్మీకులకు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. తాజాగా ఇతర సామాజిక వర్గాలను సైతం వంచించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాటకం ప్రారంభించింది. ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో కేవలం ఆ సామాజిక వర్గాలను సంతృప్తిపర్చడం కోసమే టీడీపీ సర్కారు ఈ డ్రామా ఆడిందని అప్పట్లో ఆయా సామాజికవర్గాల ఉద్యమకారులు స్పష్టం చేశారు. 

ఈ నాలుగేళ్లూ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? 
తమను ఎస్సీల్లో చేర్చాలని రజకులు, నాయీ బ్రాహ్మణులు.. ఎస్టీల్లో చేర్చాలని మత్స్యకారులు, వడ్డెరలు డిమాండ్‌ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సామాజిక హోదా మార్పుపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిషన్‌ వేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు ప్రసార, సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రజకులు, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, వడ్డెర్లకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. నాలుగేళ్లపాటూ ఆ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని సాక్షాత్తూ ఆయా సామాజిక వర్గాలే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఆ సామాజిక వర్గాలను మళ్లీ మోసం చేయడానికే కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


పాలిటెక్నిక్, డి–ఫార్మసీ కాలేజీల్లో ఫీజుల పెంపు 
సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం ఏపీడబ్ల్యూఆర్‌డీసీ ద్వారా భారీ ఎత్తున రుణాలను సమీకరించాలని ప్రభుత్వం కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ పాలిటెక్నిక్, డి–ఫార్మసీ కాలేజీల్లో ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చింది. మంగళవారం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాలువ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు. 

మంత్రివర్గం నిర్ణయాలు... 
- తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ) విస్తరణకు ఆమోదం. రూ.2,827.5 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా 52,930 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. ఈఎంసీ రెండో దశకు రూ.30.27 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. 
కాకినాడ వద్ద వాణిజ్య ఓడరేవును అభివృద్ధి చేయడానికి కాకినాడ సెజ్‌కు అనుమతి. కాకినాడ సెజ్, ఓడరేవుల అభివృద్ధికి రూ.200 కోట్లతో మౌలిక సదుపాయాలు. 
మచిలీపట్నం పోర్డుకు అనుబంధంగా పారిశ్రామికవాడను అభివృద్ధి చేసేందుకు మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడా)కు రూ.1385 కోట్ల రుణం తీసుకోవడానికి  అంగీకారం. 
ఒంగోలు డెయిరీ పునరుద్ధరణకు రూ.35 కోట్ల రుణం ఇవ్వడానికి ఆమోదం. 
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరతను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల అభివృద్ధి సంస్థ ద్వారా భారీ ఎత్తున రుణాలు సమీకరించాలి. ఈ ప్రాజెక్టులను బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలి. 
భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం గూడెపువలసలో 27.87 ఎకరాల సేకరణ. ఎకరానికి రూ.33 లక్షల చొప్పున పరిహారం.  
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌)కు పూర్తిస్థాయి పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.  
రాష్ట్రంలో 2019 జనవరి నాటికి పట్టణాలు, గ్రామాల్లో 19 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. వివాదం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నిర్మించుకున్న ఇళ్ల స్థలాలను క్రమద్ధీకరించడానికి ఆమోదం. 
ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఫీజులను రూ15,500 నుంచి రూ.25,000 వరకూ, ఎంట్రెన్స్‌ ఫీజును రూ.3,800 నుంచి రూ.4,700 వరకూ పెంచుకోవడానికి యాజమాన్యాలకు అనుమతి. డి–ఫార్మసీ కాలేజీల్లో ఫీజులను రూ.17,000 నుంచి రూ.25,000కు  పెంచుకోవడానికి అంగీకారం.  
వేతన సవరణ సంఘానికి(పీఆర్‌సీ) 16 మంది సిబ్బంది కేటాయింపు.  
వెలిగొండ ప్రాజెక్టు కాలువలో అదనపు పనులకు అదనంగా రూ.38.78 కోట్లు చెల్లించేందుకు అంగీకారం. 
కియా కార్ల పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో కొత్తగా పోలీసు స్టేషన్‌ ఏర్పాటు. 
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ మెడికల్, డెంటల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ యాక్ట్‌–2007 రద్దు. దీనివల్ల సెమీ అటానమస్‌ కాలేజీలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. వాటిలో పని చేస్తున్న వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ అవుతాయి. 
భూములు రిజిస్ట్రేషన్‌ అయిన 45 రోజుల్లోగా ఆటోమాటిక్‌ మ్యూటేషన్‌ చేయడానికి అనుమతి.
రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. 

మంత్రి గంటా డుమ్మాపై దాటవేత 
సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్‌ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కాకపోవడంపై మంత్రి కాలువ శ్రీనివాసులు సమాధానం దాటవేశారు. గురువారం విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసేందుకు గంటా అక్కడే ఉండిపోయారని చెప్పారు. కానీ, అదే జిల్లాకు చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. మంత్రి కాలువ సమాధానం దాటవేశారు. ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ చేసిన రాజీనామాను ఆమోదించబోమని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement