శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు | Polavaram Project: Construction Works Speed Up, Completed by Next Year | Sakshi
Sakshi News home page

శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు

Published Wed, Feb 26 2020 8:21 AM | Last Updated on Wed, Feb 26 2020 9:40 AM

Polavaram Project: Construction Works Speed Up, Completed by Next Year - Sakshi

సాక్షి, పోలవరం: గోదావరి నదిపై మేఘా మహాయజ్ఞం ఆరంభమైంది. అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. కుయుక్తులతో, రాజకీయ కక్షలతో వేసే, వేయించే కేసులు, భారీ వరదల వంటి అవాంతరాలు ఎదురుకాని పక్షంలో దేశంలోనే పెద్దదైన బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రణాలికలు రూపొందించింది. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. పుష్కర కాలం క్రితం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ప్రాజెక్ట్ నిర్మాణం నత్త నడక కన్నా నెమ్మదిగా జరిగాయి.  

కాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారు. రివర్స్ టెండరింగ్ లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును ప్రభుత్వానికి రూ 628 కోట్లు ఆదా అయ్యేలా మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఆ వెంటనే పనుల వేగం పెరిగింది. ప్రభుత్వం, మేఘా సర్వశక్తులు సమీకరించి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాయి. 

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మేఘా పట్టుదల, కార్మికులు, సిబ్బంది వల్ల పనులు చకచకా నడుస్తున్నాయి. 3. 07 లక్షల ఘణపు మీటర్ల కాంక్రీట్ పనిని ఈ ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేయాలనీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న మేఘా అందుకు అవసమైన ఇంజనీరింగ్ సిబ్బంది, విభాగాల వారి నిపుణులు, అధునాతన యంత్రాలు, సుమారు ఐదు వేలకు పైగా కార్మికులను షిప్ట్‌ల వారీగా పని చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని పరిశీలించటంతో పాటు జలవనరులశాఖ అధికారులు, సిబ్బంది, మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఉత్సాహ పరచటంతో పాటు మార్గ నిర్ధేశం చేసేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 27న గురువారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. 

వచ్చే ఏడాది ఖరీఫ్ కాలానికి పోలవరం ప్రాజెక్ట్ జలాశయం లో ప్రధానమైన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ పూర్తి చేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా  పేరు గాంచిన కాళేశ్వరం, పట్టిసీమ, హంద్రీనీవా వంటి అనేక పధకాలను చేపట్టి పూర్తి  చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం పనులు చేపట్టటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే నమ్మకం ప్రజలు, అధికారులు, ముఖ్యంగా పోలవరం ఆయకట్టు ప్రాంత రైతులకు వచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్ వే లోనే 53 బ్లాక్ ల నిర్మాణం కీలకం. ఈ పనిని గడువులోగా పూర్తి చేసేందుకు మేఘా పనులు చేపట్టింది. అందుకు అవసరమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంది. 

బాబు తప్పిదంతో పనుల ఆలస్యానికి కారణం 
రివర్స్ టెండరింగ్ లో పనులు దక్కించుకున్న మేఘా వాటిని ప్రారంభించటానికి మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. తొలుత స్పిల్ వే నిర్మించిన అనంతరం కాపర్ డ్యామ్ వగైరా నిర్మిస్తే ముంపు సమస్య వచ్చేది కాదు.  కాపర్ డ్యామ్ వల్ల పలు ప్రాంతాలు మునిగి పోయాయి . పోలవరం స్పిల్ వే లో నాలుగు టి ఎం సి ల నీరు నిల్వ ఉంది. రోడ్స్ అన్ని పాడై పోయాయి. నీటిని తోడి, రోడ్స్ సరి చేసేందుకు మూడు నెలల విలువైన సమయాన్ని మేఘా వెచ్చించాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సమస్య లేకపోతె ప్రాజెక్ట్ పనుల్లో సింహభాగం చివరి దశకు వచ్చేవి. 

ప్రస్తుతం పోలవరం పనులు ఊపందుకున్నాయి. జలాశయంలో కీలకమైన స్పిల్‌వే లో 53 బ్లాకులను నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకు 55 మీటర్ల ఎత్తు ఉంటుంది . వీటిని పూర్తి చేసే పనులు ఊపందుకున్నాయి. ఒక బ్లాకులో ఒక మీటర్‌ ఎత్తు నిర్మించడానికి (కాంక్రీట్‌ వేయడానికి) నాలుగు రోజుల సమయం పడుతుంది. సరాసరిన ప్రతీరోజు 12 బ్లాకుల్లో ఎత్తు పెంచే పని చురుగ్గా జరుగుతోంది. ఈ మొత్తం స్పిల్‌వేలో రెండున్నర లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిచేయాలి. గత ఏడాది వరదల వల్ల ఎదురైనా అడ్డంకులను అధిగమించి జనవరి నెలాఖరు నాటికి 25 వేల క్యూబిక్‌ మీటర్ల పనిని ఎంఇఐఎల్‌ పూర్తిచేసింది. 

ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. మార్చిలో 50 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసి, మిగిలిన పనిని ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో పూర్తిచేయాలని మైల్ స్టోన్ గా పెట్టుకున్న మేఘా సంస్థ జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో ముందుకు సాగుతోంది. రోజుకు 15 వందల క్యూబిక్‌ మీటర్ల పనిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వేలోని పియర్స్, ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామ్ పునాది పనులు మేఘా మొదలుపెట్టింది. జలాశయంలో కీలకమైన మోడీ గ్యాపులలో 1,3కి సంబంధించిన డిజైన్లు ఆమోదం పొందే పని మేఘా చేపట్టింది. 

పోలవరం జలాశయం ఒక్కటైనా దీనిని మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గ్యాప్‌1తో పాటు స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్‌3ను 150 మీటర్ల పొడవుతో చిన్నపాటి కాంక్రీట్‌ డ్యామ్‌గా పూర్తిచేయాలి. గ్యాప్‌2లో ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యాం ఉంటుంది. దీనినే ప్రధానమైన జలాశయంగా పిలుస్తారు. దీని పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. గ్యాప్‌1లో కూడా ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామే నిర్మించాలి. దీని పొడవు 450 మీటర్లు ఉంటుంది. ప్రాజెక్ట్‌లో ర్యాక్‌ఫిల్‌ డ్యాం పనులు చేపట్టడానికి అవసరమైన వైబ్రో కంప్యాక్షన్‌ పరీక్షలను మేఘా నిర్వహిస్తోంది. అదే సమయంలో ప్రాజెక్ట్‌కు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణం వల్ల ప్రాజెక్ట్‌ పనిజరుగుతున్నప్పుడు వరదలు వస్తే నీటిని మళ్లించడం వీలవుతుంది. గ్యాప్‌1లో డయాఫ్రం వాల్, స్పిల్‌ వే ఎగువ, దిగువన కాంక్రీట్‌ పనులు ప్రారంభించడానికి మేఘా ఏర్పాట్లు చేసుకుంది. 

వచ్చే ఏప్రిల్‌కు పోలవరంలో మెజారిటీ పనులు పూర్తి 
పోలవరం ప్రాజెక్ట్‌లోని ముఖ్యమైన పనులను పూర్తిచేయడానికి మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ లక్ష్యాలను పెట్టుకోంది. స్పిల్‌వే కాంక్రీట్‌పనిని 5 నెలలో అంటే 2020 జూన్‌ నెలఖరు నాటికి పూర్తిచేయాలనేది ఆ లక్ష్యాలలో ఒకటి. ఇందులో భాగమైన బీమ్‌లు అంతకన్నా ముందే మే నెలఖరు నాటికి పూర్తిచేయాలనే ప్రణాళిక ప్రకారం పనులు వేగిరం అయ్యాయి. స్పిల్‌వేకు సంబంధించిన బ్రిడ్జ్‌ పనులు పూర్తికి ఏడు నెలల సమయం పడుతుంది. స్పిల్‌ వే చానెల్‌కు సంబంధించిన బ్రిడ్జ్‌ పనులు 2021 మే నాటికి పూర్తికావాలి. ఈ పని మొత్తంగా 14 నెలల సమయం పడుతుంది. 

ఇందుకు సంబంధి ఇప్పుడు డిజైన్ల అనుమతులు తీసుకొని చకచకా పనులు చేయనున్నారు. డివైడ్‌ వాల్, ట్రైనింగ్‌వాల్, గైడ్‌ వాల్‌ లాంటివి 5 నెలల్లో అంటే ఈ ఏడాది మే నెలఖరుకు పూర్తిచేయాలి. ప్రాజెక్ట్‌ కోటింగ్, సర్‌ఫేస్‌ డ్రస్సింగ్, తారు రహదారి లాంటి ఫినిషింగ్‌ పనులు 2021 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా ముప్పైవేలు సాగులోకి రావడంతో పాటు 80 టిఎంసీల నీటిని కృష్ణకు తరలించడమే కాకుండా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టు రబీలో స్థిరీకరించి ఎడమ కాలువ క్రింద లక్షా అరవైవేల ఎకరాలకు నీరందిస్తారు. విశాఖ నగరానికి తాగునీటి అవసరాల కోసం 23.44 టిఎంసీల నీరు అందిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement