సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం పర్యటన అనంతరం నిర‍్మాణపు పనుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అరుదైన పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ హైడ్రాలిక్ క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రక్రియ ప్రారంభించింది. అలాగే ప్రాజెక్ట్‌లోని కీలకమైన 48 గేట్ల ఏర్పాటు కోసం అవసరమైన ఆర్మ్స్ (ఇరుసు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ముందుగా స్పిల్‌వేకి కీలకమైన గేట్ల అమరికను అధికారులు ప్రారంభించారు. గేట్లను లిఫ్ట్ చేసే ఆర్మ్ గడ్డర్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెట్టారు.
ఈ మేరకు గురువారం ఉదయం మేఘా సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 45 పిల్లర్‌కు ఆర్మ్ గడ్డర్‌ను అనుసంధానం చేశారు. గేట్లు అమర్చేందుకు కీలకమైన ఆర్మ్ గడ్డర్ కీలకమైనవని ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు తెలిపారు. వచ్చే సంవత్సరం మే చివరి నాటికి పూర్తిస్థాయిలో 48 గేట్లకు సంబంధించిన పనులను పూర్తి చేస్తామన్నారు. నిర్ధేశించిన సమయానికి పనులు పూర్తి చేస్తామని దానికి సంబంధించి అధికారులు, మెగా సంస్థ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్)
ఆర్మ్ గడ్డర్ల ఉపయోగం
ఒక్కో గేటుకు ఎనిమిది ఆర్మ్ గడ్డర్లు ఉంటాయి. అదే విధంగా నాలుగు హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి. కుడి పక్కన నాలుగు, ఎడమ పక్కన నాలుగు ఆర్మ్ గడ్డర్లు ఉంటాయి. వీటిని ఆర్మ్ అసెంబ్లింగ్ అంటారు. ఆర్మ్ అసెంబ్లింగ్ మొత్తం31టన్నులు ఉంటుంది. మొత్తం 12 గడ్డర్లు ఉంటాయి. ఇలా 48 గేట్లుకు సంబంధించి 384 ఆర్మ్ గడ్డర్లు,192 హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి. ఒక్కో ఆర్మ్ గడ్డర్ 16మీటర్లు పొడవు ఉంటుంది. ఆర్మ్ గడ్డర్లు, హారిజాంటల్ గడ్డర్లు అసెంబ్లింగ్ చేసిన తరువాత స్కిన్ ప్లేట్ అమర్చుతారు. ఈ ఆర్మ్ గడ్డర్లు సాయంతో గేట్లకు సంబంధించిన స్కిన్ ప్లేట్‌ను పైకి లేపుతారు. ఎంత ఎత్తుకు గేటును లేపాలనుకుంటే అంత ఎత్తులో లేపడానికి ఈ ఆర్మ్ గడ్డర్లు ఉపయోగపడతాయి.
ఇక గేట్లు ఎత్తడానికి, దించడానికి ఈ ఆర్మ్ గడ్డర్లే ఆధారం. ట్రూనియన్ గడ్డర్లకు ప్రిస్ట్రెస్సింగ్ చేసి ఈ ఆర్మ్ గడ్డర్లు ఏర్పాటు చేస్తారు. గేట్ స్కిన్ ప్లేట్ లిప్ట్ చేయడానికి ఒక్కోగేటుకు 8 స్కిన్ ప్లేట్లు ఉంటాయి. వీటిని అన్నింటిని ఒక్కటిగా చేస్తే గేటు తయారు అవుతుంది. గేట్లును ఎత్తడానికి హైడ్రాలిక్ సిలిండర్లు సాయంతో లిప్ట్ చేస్తారు. మొత్తం 48 గేట్లుకుగానూ 96 హైడ్రాలిక్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఒక్కోగేటు 20.835 మీటర్లు ఎత్తు,15.96 మీటర్లు వెడల్పు ఉంటుంది. మొత్తం గేట్లు నిర్మాణానికి 18వేల టన్నుల స్టీల్ వినియోగిస్తారు. ఒక్కో గేటు 275 టన్నుల బరువు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment