పోలవరం పరుగులు పెడుతోంది | Polavaram Project Works Speed Up To Complete on Time | Sakshi
Sakshi News home page

పోలవరం పరుగులు పెడుతోంది

Published Fri, Mar 20 2020 11:55 AM | Last Updated on Fri, Mar 20 2020 12:07 PM

Polavaram Project Works Speed Up To Complete on Time - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఊపందుకున్నాయి. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరం ముందుకు సాగుతోంది. (పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన సీఎం జగన్)

అనువైన సమయం- పనులు ముమ్మరం
నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా) పూర్తిస్థాయిలో తన శక్తి యుక్తులను ఈ ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించింది. నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు యత్నిస్తోంది. అనతికాలంలోనే ప్రాజెక్ట్‌ స్పిల్‌వేకు  సంబంధించి 62818 ఘనపు మీటర్ల పనిని చేయడంతో పాటు మిగిలిన పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టేందుకు ప్రాథమిక కసరత్తులను మేఘా వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌కు ప్రధానమైన పనులు వేగవంతం చేసేందుకు గోదావరి ఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ (VIBRO COMPACTION WORKS UNDER PROGRESS) పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం  (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం అయ్యాయి. 

కీలకమైన అనుమతులకు ప్రత్యేక అధికారులు
ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష్యం మేరకు పనులు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్లకు సంబంధించిన అనుమతులు సాధించడం చాలా కీలకమైనది. ఇప్పుడు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్లకు అనమతులు లభించకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మొదటికి వస్తుంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్ట్ను పరిశీలించి సమీక్షించినప్పుడు అనుమతులు త్వరగా మంజూరు చేస్తే నిర్దేశించిన గడువు ప్రకారం పనులను పూర్తిచేస్తామని మేఘా యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో డిజైన్ల అనుమతులు సాధించేందుకు ఢి​ల్లీ, హైదరాబాద్‌లోనూ ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పనులు శాస్త్రీయ పద్ధతిలో ఊపందుకున్నాయి. (ప్రాజెక్టుల బాటకు శ్రీకారం)

గత ప్రభుత్వ తప్పిదాలు
ప్రాజెక్ట్ పనులను మేఘా సంస్థ గత ఏడాది నవంబర్‌లో దక్కించుకున్నప్పటికీ వెంటనే పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. దాదాపు మూడు నెలల పాటు విలువైన సమయం వృధా అయ్యింది. అందుకు గత ప్రభుత్వం నాన్ ఇంజనీరింగ్ పద్ధతిలో పనులు చేపట్టడమే. ముంపు సమస్య తలెత్తి విలువైన సమయం వృధా కావడానికి చంద్రబాబు ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడమే కారణం. వాస్తవానికి ఇది ఇంజనీరింగ్ విధానాలకు వ్యతిరేకం. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఆయన ఒత్తిడికి తలొగ్గి 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించేందుకు అంగీకరించడం మరింత నష్టం చేకూర్చింది. ఇంతవరకు ఏ జలాశయ నిర్మాణాల్లోనూ లేనివిధంగా పోలవరంలో మాత్రమే ఈ విధమైన అనుమతి లభించింది. కాఫర్ డ్యామ్ అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణం జరిగేప్పుడు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం. దీనివల్ల గత ఏడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణం ప్రాంతంలో నిర్మించిన రహదారులు కొట్టుకుపోయాయి. (ట్రాన్స్ట్రాయ్.. డబ్బులేమయ్యాయ్?)

కనీసం 4 టిఎంసీల నీరు నిలువ ఉండడంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో దాదాపు మూడు నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని తరలించాల్సి వచ్చింది. దాంతో జనవరి నెలాఖరుకు కానీ పనులు ఉపందుకుకోవడం సాధ్యం కాలేదు.  గత ప్రభుత్వం స్పిల్వేతో పాటు కాఫర్ డ్యామ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. వాటిని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రాజెక్ట్‌లో ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్లు, స్పిల్వే, స్పిల్ చానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ చానెల్, కుడి-ఎడమ కాలువల అనుససంధానంతో పాటు జల విద్యుత్ కేంద్రం కీలకమైనవి. వీటిల్లో చాలా పనులు అసలు గత ప్రభుత్వం చేపట్టనే లేదు. 

జనవరి నుంచి స్పిల్వే పనులు ముమ్మరం చేసిన మేఘా ఇంజనీరింగ్ లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగిస్తోంది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21358 ఘ.మీ పనిని పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే బీమ్ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్‌లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్వాల్ పనులను ఉదృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి. (ముంపు ప్రాంతాల నివేదిక ఇవ్వండి)

నిజానికి చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ నత్తనడక నడిచింది. దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ కీలకమైన అనుమతులన్నీ అప్పుడే సాధించారాయన. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు. వైఎస్సార్‌ పాలనలోనే దాదాపు కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో 2010 నుంచి 2019 వరకు కేవలం స్పిల్వేలో కొంత పనితోపాటు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ మాత్రమే నిర్మించారు. ఇంతకు మించి అప్పుడు జరిగిందేమీ లేదు.  (కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం)

కీలకమైన డిజైన్లు: 
ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగం చేయించడంతో పాటు అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులల్లో అనుమతులు చాలా కీలకమైనవి. గత ప్రభుత్వ వీటిని నిర్లక్ష్యం చేసింది. మొత్తం ప్రాజెక్ట్లో 45 డిజైన్లు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి లభించలేదు. దీంతో త్వరితగతిన అనుమతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్‌కు ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. దీంతో పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం కలుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement