పోలవరంలో మరో ముందడుగు | Polavaram Project: Spillway Work Almost Completed | Sakshi
Sakshi News home page

పోలవరంలో మరో ముందడుగు 

Published Tue, Jul 7 2020 8:49 AM | Last Updated on Tue, Jul 7 2020 4:57 PM

Polavaram Project: Spillway Work Almost Completed - Sakshi

సాక్షి, అమరావతి: దశాబ్ధాల ఆంధ్రప్రదేశ్‌ కల నెరవేరబోతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలవరం ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. ఆ కలను ఇప్పుడు పట్టుదలతో నెరవేర్చబోతున్నారు. పోలవరంలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసేలా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. (నిర్లక్ష్యమే కారణం)

ఇందుకోసం నిన్న పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పనులు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. దీనివల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. వానాకాలం వచ్చినా.. గోదావరి వరద పొంగినా పనులు ఆగకుండా పనులు చేపట్టారు. ప్రపంచంలోనే ఎవరూ చేయడానికి సాహసించని అద్భుతమైన టెక్నాలజీతో పోలవారాన్ని పరుగులు పెడుతున్నారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద గడ్డర్లు ఏర్పాటు
పోలవరంలో ఈ వానాకాలం అత్యధిక వరద వస్తుంటుంది. ఈ వరద కారణంగా గోదావరిలో ప్రాజెక్టులు కట్టడం చాలా కష్టమయ్యేది.. అందుకే కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసింది. పనులు ఆగకుండా వానాకాలం వరదలోనూ పనులు చేసేలా ప్లాన్ చేసింది. పోలవరంకు ఉన్న మొత్తం గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్ల మీద మొదటి గడ్డర్ ను అమర్చటం మేఘా సంస్ధ నిపుణులు, నీటిపారుదల అధికారులు పర్యవేక్షణలో ప్రారంభమయ్యింది. ఒక్కో గడ్డర్‌ సామర్థ్యం ఎంత పెద్దదంటే ఒక్కొక్క దాని బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్ట, కీలకమైన పని ఇది. ఇక ప్రాజెక్టులోని  స్పిల్‌ వే లోని 52  బ్లాక్స్‌ కు సంబంధించిన పియర్స్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. స్పిల్‌వే పియర్స్‌ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో సింహ భాగం పూర్తి అయినట్లే.  ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి.

బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప కాదు. ఇరుకైన పియర్స్ పై కాంక్రిటింగ్, అదీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నియమనిబంధనలకు అనుగుణంగా చేయటం అనేది క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన పనిని కూడా పోలవరంలో పూర్తి చేస్తున్నారు. స్పిల్‌ వే మొత్తం దూరం 1.2 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్‌ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా పోలవరంలో స్పిల్ వే నిర్మిస్తున్నారు. జలాశయంలో నీటిని నిల్వ చేసి  వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు కీలకమైనదే స్పిల్‌వే. స్పిల్‌వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ ముఖ్యమైనది. గేట్లు పనిచేయడానికే గడ్డర్లు ఉపయోగపడతాయి. వాటిపై హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు.

బరువు 62 టన్నులు.. భారీ గడ్దర్లు..
పోలవరం స్పిల్‌వే పియర్స్‌ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గడ్దర్‌ బరువు 62 టన్నులు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్‌ వే పై ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండునెలల్లో వీటిని సిద్ధం చేశారు. మిగిలిన వాటిని సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్దర్‌ తయారీకి 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్త 196 గడ్డెర్లకు గాను 1960 టన్నుల స్టీల్, 4900 టన్నుల కాంక్రీట్ ను వినియోగించారు. స్పిల్‌  వే పై గడ్డెర్లను ఒక క్రమ పద్దతిలో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు నెల రోజు సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. 

ఆ తరువాత దానిపై  కాంక్రీట్‌ తో రోడ్‌ నిర్మిస్తారు.  ఈ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. అంటే స్పిల్‌ వే పనులు దాదాపు పూర్తి అయినట్లే. స్పిల్‌ వే లో ఒక వైపు గడ్డెర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు  ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణ సంస్థ మేఘా  చర్యలు తీసుకుంటోంది. గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్‌ ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్దర్‌ రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది. గడ్డెర్ల ఏర్పాటు, రోడ్‌ నిర్మాణం పూర్తి అయితే గోదావరికి ఎంత వరద వచ్చినా  పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు. ఇప్పుడా పనులు పోలవరంలో విజయవంతంగా పూర్తవుతున్నాయి.

జెట్ స్పీడుతో పోలవరం పనులు..
పోలవరం పనులను మేఘా సంస్థ జెట్ స్పీడుతో చేపడుతోంది. ఏపీ ప్రజల సాగు, తాగు, విద్యుత్ అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారంగా పనులను వాయువేగంతో ఉరకెలేత్తిస్తోంది. మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది.  అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో  పనులు సాగుతున్నాయి.

ముఖ్యమంత్ర కల సాకారం దిశగా..
ఇలా ఏపీ కలల ప్రాజెక్టు వడివడిగా సాగుతోంది. వానాకాలంలోనూ పనులు ఆగకుండా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ వాడుతో కాంట్రాక్ట్ సంస్థ మేఘా పనులు పూర్తి చేస్తోంది. వచ్చే ఏడాదిలోనే ఏపీ ప్రజల తాగు, సాగునీటి అందించేలా ప్రాజెక్టు పరుగులు పెడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement