► మేయర్, అసమ్మతి గ్రూపులు వేర్వేరుగా శిబిరాలు
► టీడీపీలో కలకలం రేపిన ‘సాక్షి’ కథనం
► ఇంటెలిజెన్స్ ఆరా
► ‘వీళ్లు మారరంతే..’ అంటూ చంద్రబాబు సీరియస్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీ కుమ్ములాటల పంచాయితీ మహానాడుకు చేరింది. మేయర్, అసమ్మతి వర్గాలు వేర్వేరుగా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. అసమ్మతి వర్గం నేతలు గురువారం బయలుదేరి తిరుపతి వెళ్లారు. మహానాడు తరువాత తాడోపేడో తేల్చేద్దామని అసమ్మతి వర్గం జబ్బలు చరుస్తోంది. ఇప్పటి వరకు 23 మంది కార్పొరేటర్ల సంతకాలను సేకరించిన అసమ్మతి వర్గం గడిచిన రెండు రోజులుగా తన బలాన్ని పెంచుకోలేకపోయింది. నెలకు రెండు లక్షల మామూళ్ల ప్లాన్ ఆశించినస్థాయిలో విజయవంతం కాకపోవడంతో నేతలు కంగుతింటున్నారు. ఇదే అదనుగా భావించిన మేయర్ గ్రూపు అసమ్మతిని చీల్చేందుకు ఎత్తులు వేస్తోంది. ఐదుగురు కార్పొరేటర్లతో మేయర్ కోనేరు శ్రీధర్ స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు భోగట్టా. తాము తొందరపడ్డామని, ఇకపై తప్పు చేయబోమని వారు స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో తమ వర్గం కార్పొరేటర్ల చేజారిపోకుండా ఉండేందుకు మహానాడులో ప్రత్యేకంగా హోటల్ గదులను అసమ్మతి వర్గం నాయకులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మేయర్ గ్రూపునకు సంబంధించి వ్యవహారాలను ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు చూసుకుంటున్నట్లు వినికిడి.
ఒక్క చాన్స్ ఇచ్చినా చాలు..
అసమ్మతి గ్రూపు నుంచి ముప్పా వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ, పి.త్రిమూర్తిరాజు మేయర్ చైర్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఏడాదికి ఒకరికి చొప్పున మేయర్‌గా అవకాశం ఇచ్చినా చాలు అనే ప్రతిపాదనను అధిష్టానం వద్ద వినిపించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ముప్పా, చెన్నపాటి అభ్యర్థిత్వాలపై సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ముప్పా అభ్యర్థిత్వాన్ని గద్దె రామ్మోహన్ బలపరుస్తుండగా, బొండా ఉమా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గాంధీ విషయంలో ఇది రివర్స్ అయింది. త్రిమూర్తిరాజుకు ఏకగ్రీవంగా ఆమోదిస్తే సామాజిక సమీకరణలు తేడా వచ్చే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శ్రీధర్‌తో తనకు ఎలాంటి వైరం లేదని, డిప్యూటీ మేయర్ గోగుల రమణను మార్చాలన్నదే తన అభిప్రాయమని బొండా తన సన్నిహిత వర్గం వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు కోనేరు శ్రీధర్‌కు అనుకూలంగా మారుతున్నాయి. మరోపక్క అసమ్మతి వర్గం మామూళ్ల వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. ‘ముదురుతున్న చైర్‌వార్’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనం టీడీపీలో కలకలం రేపింది.
ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నెలవారీ మామూళ్లు ఎర వేసిన మాట వాస్తవమేనని విచారణలో తేలింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ కార్పొరేటర్ మామూళ్ల వ్యవహారాన్ని ధృవీకరించనట్లు భోగట్టా. సంతకం చేస్తే నెలకు రూ.2 లక్షలు ఇస్తామని అసమ్మతి వర్గం నేతలు చెప్పారని, తాను అందుకు అంగీకరించలేదని ఆ కార్పొరేటర్ ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద తెలిపినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది.
బాబు సీరియస్!
నగరపాలక సంస్థ టీడీపీలో మూడు రోజులుగా సాగుతున్న టీడీపీ పాలి‘ట్రిక్స్’పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ‘ఎన్ని చెప్పినా వీళ్లు (కార్పొరేటర్లు) మారరు.. మంత్రి ఉమా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది’ అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక బాబుకు అందినట్లు తెలుస్తోంది. మహానాడు అయ్యాక కార్పొరేటర్లకు క్లాస్ తీయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని భోగట్టా.
మహానాడుకు చేరిన టీడీపీ కుమ్ములాటలు
Published Fri, May 27 2016 1:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement