టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుటుంబ భూబాగోతంపై ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. రూ.50కోట్ల విలువైన భూదందా కేసును నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే న్యాయ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు హఠాత్తుగా తెరపైకి వచ్చి విచారణ పేరుతో కేసును నీరుగార్చేందుకు రంగంలోకి దిగారు. ఇదే తరుణంలో ఈ కేసులో కీలకంగా మారిన స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబసభ్యులను తమకు అనుకూలంగా మార్చాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు కోటేశ్వరరావు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఐడీ ఉద్దేశపూర్వక జాప్యం
స్వాంతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి చెందిన 5.16 ఎకరాలను తప్పుడు పత్రాలతో బొండా ఉమా కుటుంబం తమ పరం చేసుకుంది. ఇందులో ఉమాకు అనుకూలంగా ఈ కేసును నీరుగార్చడానికి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. కేసు నమోదు వరకు ఉత్సాహంగా వ్యవహరించిన సీఐడీ అధికారులు హఠాత్తుగా నెమ్మదించారు. ఈ కేసులో ఏ–8గా ఉన్న బొండా ఉమా భార్య సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు నుంచి తనను తప్పించాలని పిటిషన్ వేశారు. దీనిని సీఐడీ అధికారులు వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో దర్యాప్తును 8 వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ అధికారులు ఈ కేసులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబానికి ఏకపక్షంగా సహకరించేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నినట్లు స్పష్టమైంది.
రంగంలోకి రెవెన్యూ అధికారులు
మరోవైపు రెవెన్యూ అధికారుల ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమాకు అనుకూలంగా ప్రభుత్వం కథ నడుపుతోంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులే సుమోటాగా ఈ కేసు విచారణను చేపట్టడం గమనార్హం. అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబసభ్యులను ప్రభావితం చేసేందుకు టీడీపీ పెద్దలు ఒత్తిడి పెంచారు. సూర్యనారాయణ పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఆ భూమిని విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చి అది వెంకటేశ్వరరావు సంతకమే అని చెప్పించాలన్నది ఎమ్మెల్యే బొండా వర్గీయుల పన్నాగం. ఇందుకు కొన్ని రోజులుగా ఆ కుటుంబసభ్యులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమచారం. ఆ కుటుంబసభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలను తమకు అనుకూలంగా మలచుకుని వ్యవహారాన్ని పూర్తిచేయాలన్నది వారి వ్యూహం. రెవెన్యూ అధికారులు ఓసారి ధ్రువీకరిస్తే చాలు తరువాత అధికారికంగా సీఐడీ కేసును పూర్తిగా నీరుగార్చవచ్చని భావిస్తున్నారు.
వారిపై చర్యలు తీసుకోండిపోలీసులను కోరిన కోటేశ్వరరావు
రూ.50కోట్ల భూదందా కోసం విజయవాడకు చెందిన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావును ఎమ్మెల్యే బొండా కుటుంబం బురిడీ కొట్టించింది. స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబం నుంచి ఆ భూమిని వారిద్దరూ కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బొండా భార్య సుజాతతోపాటు మరికొందరికి జీపీఏ రిజిస్ట్రేషన్ చేసినట్లు కథ నడిపించారు. కాగా, తనను ఈ భూబాగోతంలో ఇరికించిన బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని రామిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఉమా, ఆయన సన్నిహితుడు మాగంటి బాబు, కార్పొరేటర్ గండూరి మహేష్ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు కోటేశ్వరరావును బెదిరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన న్యాయవాది ద్వారా మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment