Land case
-
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం నిందితులకు సహకరించిన జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు.కాగా సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. అయితే అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. ఇటీవల పోలీసులు పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు. -
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
-
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: రాజధాని భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తేలింది. చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’! -
సీఎం షిండేకు ఎదురుదెబ్బ.. ఆ కేసులో హైకోర్టు మొట్టికాయలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ ల్యాండ్ కేసులో బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంవీఏ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నాగ్‌పూర్ అభివృద్ధి ట్రస్టును ఎలా ఆదేశించారని ప్రశ్నించింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ(ఎంవీఏ) ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు ఏక్నాథ్ షిండే. 2021లో మురికివాడల పేదల కోసం కేటాయించిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే 16 మంది బిల్డర్స్‌కు కేటాయించారు షిండే. దీనిపై ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ షిండే ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. రూ.83 కోట్లు విలువ చేసే భూమికి నాగ్‌పూర్ అభివృద్ధి ట్రస్టుకు కేవలం రూ.2 కోట్ల లోపే దక్కాయని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చేస్తున్న బాంబే హైకోర్టు.. ఆ 5 ఎకరాలు భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసుపై సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 2023, జనవరి 4కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే.. ఆమె సమాధానం వింటే అభినందించకుండా ఉండలేరు -
సెప్టెంబర్ 7కు హైదర్‌నగర్ భూముల కేసు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : హైదర్‌నగర్ భూములకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు 7కు వాయిదా వేసింది. హైదర్‌నగర్ సర్వే నంబర్ 172లోని 98 ఎకరాల భూమి తమదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషన్లో లోపాలుంటే సరిచేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈ భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్, ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. -
భూకుంభకోణం: ముఖ్యమంత్రికి భారీ ఊరట
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఆ కేసు విషయంలో విచారణ ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పదేళ్ల కిందట సీఎంగా ఉన్న యడియూరప్ప 24 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్తలో చార్జిషీటు కూడా దాఖలైంది. ఈ చార్జిషీట్ ఆధారంగా విచారణ చేయాలని ప్రత్యేక కోర్టుకు కర్నాటక హైకోర్టు గతనెలలో ఆదేశించింది. దీంతో యడియూరప్ప పదవికి గండం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కర్నాటక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. దీంతో యడియూరప్పకు భారీ ఊరట లభించింది. -
29న అయోధ్యపై విచారణ రద్దు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉండగా, వారిలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండరనీ, కాబట్టి కేసు విచారణను ఆ రోజున రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు రిజస్ట్రీ ఓ నోటీసు విడుదల చేసింది. సీజేఐ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో పాలుపంచుకునేందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎన్వీ రమణలు విముఖత చూపారు. వారి స్థానంలో జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లు ధర్మాసనంలో చేరారు. -
‘బొండా’గిరీ.. ఏదీ దారి?
సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుటుంబ భూబాగోతంపై ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. రూ.50కోట్ల విలువైన భూదందా కేసును నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే న్యాయ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు హఠాత్తుగా తెరపైకి వచ్చి విచారణ పేరుతో కేసును నీరుగార్చేందుకు రంగంలోకి దిగారు. ఇదే తరుణంలో ఈ కేసులో కీలకంగా మారిన స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబసభ్యులను తమకు అనుకూలంగా మార్చాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు కోటేశ్వరరావు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ ఉద్దేశపూర్వక జాప్యం స్వాంతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి చెందిన 5.16 ఎకరాలను తప్పుడు పత్రాలతో బొండా ఉమా కుటుంబం తమ పరం చేసుకుంది. ఇందులో ఉమాకు అనుకూలంగా ఈ కేసును నీరుగార్చడానికి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. కేసు నమోదు వరకు ఉత్సాహంగా వ్యవహరించిన సీఐడీ అధికారులు హఠాత్తుగా నెమ్మదించారు. ఈ కేసులో ఏ–8గా ఉన్న బొండా ఉమా భార్య సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు నుంచి తనను తప్పించాలని పిటిషన్ వేశారు. దీనిని సీఐడీ అధికారులు వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో దర్యాప్తును 8 వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ అధికారులు ఈ కేసులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబానికి ఏకపక్షంగా సహకరించేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నినట్లు స్పష్టమైంది. రంగంలోకి రెవెన్యూ అధికారులు మరోవైపు రెవెన్యూ అధికారుల ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమాకు అనుకూలంగా ప్రభుత్వం కథ నడుపుతోంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులే సుమోటాగా ఈ కేసు విచారణను చేపట్టడం గమనార్హం. అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబసభ్యులను ప్రభావితం చేసేందుకు టీడీపీ పెద్దలు ఒత్తిడి పెంచారు. సూర్యనారాయణ పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఆ భూమిని విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చి అది వెంకటేశ్వరరావు సంతకమే అని చెప్పించాలన్నది ఎమ్మెల్యే బొండా వర్గీయుల పన్నాగం. ఇందుకు కొన్ని రోజులుగా ఆ కుటుంబసభ్యులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమచారం. ఆ కుటుంబసభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలను తమకు అనుకూలంగా మలచుకుని వ్యవహారాన్ని పూర్తిచేయాలన్నది వారి వ్యూహం. రెవెన్యూ అధికారులు ఓసారి ధ్రువీకరిస్తే చాలు తరువాత అధికారికంగా సీఐడీ కేసును పూర్తిగా నీరుగార్చవచ్చని భావిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోండిపోలీసులను కోరిన కోటేశ్వరరావు రూ.50కోట్ల భూదందా కోసం విజయవాడకు చెందిన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావును ఎమ్మెల్యే బొండా కుటుంబం బురిడీ కొట్టించింది. స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబం నుంచి ఆ భూమిని వారిద్దరూ కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బొండా భార్య సుజాతతోపాటు మరికొందరికి జీపీఏ రిజిస్ట్రేషన్ చేసినట్లు కథ నడిపించారు. కాగా, తనను ఈ భూబాగోతంలో ఇరికించిన బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని రామిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఉమా, ఆయన సన్నిహితుడు మాగంటి బాబు, కార్పొరేటర్ గండూరి మహేష్ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు కోటేశ్వరరావును బెదిరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన న్యాయవాది ద్వారా మరోసారి పోలీసులను ఆశ్రయించారు. -
దేవుడి భూముల్ని లీజుకు ఎలా చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: దేవుడి భూముల్ని లీజుకు ఎలా ఇస్తారని తెలంగాణ సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. విక్టోరియా హోంకు చెందిన భూమి దేవాదాయ శాఖ పేరిట రిజిస్టర్ అయిందని, అందులో పది ఎకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఎలా లీజుకిస్తారని నిలదీసింది. ప్రభుత్వ భూమి మాదిరిగానే దేవుడి భూమిని కూడా తాము లీజుకు ఇవ్వొచ్చని ప్రభుత్వం చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని నిజాం కాలం నాటి విక్టోరియా హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు పది ఎకరాలు లీజుకు ఇవ్వడాన్ని అదే హోంకు చెందిన పూర్వపు విద్యార్థి ఎల్.బుచ్చిరెడ్డి సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం మరోసారి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. -
పోలీసుల హైడ్రామా !
‘సరస్వతి’ భూముల కేసు * నిందితులను కోర్టుకు తరలింపులో ఆద్యంతం గోప్యం * తొలుత మధ్యాహ్నం అని చెప్పి రాత్రి వేళ వరకు తాత్సారం.... * బంధువులను స్టేషన్ నుంచి పంపి తరిమికొట్టిన పోలీసులు * సంబంధం లేని వారినీ కేసులో ఇరికించారని వెల్లువెత్తిన ఆరోపణలు * మీడియాకు సైతం వివరాలు వెల్లడించని వైనం పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో కొద్దిరోజుల కిందట జరిగిన సరస్వతి ఇండస్ట్రీస్ భూముల వివాదంలో నిందితులను కోర్టుకు తరలించటంలో హైడ్రామా నడిచింది. తొలుత మధ్యాహ్నం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసు అధికారులు నిందితులను బయటకు తీసుకువచ్చి రాత్రి వేళ వరకు తాత్సారం చేశారు. వారిని కోర్టుకు తీసుకువెళ్లేందుకు ఒక స్కూలు బస్సును మధ్యాహ్నం 3 గంటలకే రప్పించినా ఎంతకీ ఎక్కించలేదు. * తొలుత నిందితుల తరఫు బంధువులన స్టేషన్ నుంచి బయటకు పంపిన పోలీసులు, అక్కడ నుంచి వెళ్లి బయట కూర్చున్న వారిని ఆ ప్రాంతాల్లో లేకుండా తరిమి తరిమి కొట్టారు. * మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆద్యంతం గోప్యంగా వ్యవహరించారు. దీంతో నిందితులతోపాటు విలేకరులు కూడా గంటల తరబడి పోలీస్‌స్టేషన్ వద్ద వేచిచూడాల్సి వచ్చింది. * సాధారణంగా ఏ కేసులోనైనా నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చి కేసు వివరాలు వెల్లడించిన తర్వాత కోర్టుకు తరలించటం జరుగుతుంటుంది. ఈ కేసులో మాత్రం అటువంటిదేమీ లేకుండా, కేసు వివరాలు చెప్పకుండా గోప్యంగా వ్యవహరించటాన్ని బట్టి అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే పోలీసు అధికారులు వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు. * ఈ కేసులో అసలైన నిందితులను కాకుండా, ఎలాంటి సంబంధం లేనివారిని ఇరికించారని, ఆ విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో మీడియాకు సమాచారం ఇవ్వలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తొలివిడతగా 29 మందిపై... * సరస్వతీ ఇండస్ట్రీస్ భూముల వివాదంలో మాచర్ల పరిసర ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు 40 మందికి పైగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. * వారిలో తొలివిడత గురువారం 29 మందిని కోర్టులో హాజరు పరిచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. * వీరిలో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మిగిలినవారిపై 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. * రాత్రి 8.30 గంటల వరకు నిందితులను కోర్టుకు తరలించే ప్రయత్నంలోనే అధికారులు ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. అధికార పార్టీకి తొత్తులుగా... సాక్షి, గుంటూరు: పరిశ్రమ స్థాపించి వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం రైతుల వద్ద నుంచి మార్కెట్ కంటే రెట్టింపు ధరకు భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. * దీనిలో భాగంగా ఈ నెల 7న తాము కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్న భూముల్లో వేసిన పంటలను తొలగించేందుకు వెళ్లిన సరస్వతి యాజమాన్యంపై టీడీపీకి చెందిన కొందరు దాడులకు దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సరస్వతి యాజమాన్యంపైనే అధికార పార్టీ నేతల అండతో పోలీసులు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. * వివిధ గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా ఉండే బలమైన వ్యక్తులను ఈ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. * గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో లేకపోయినప్పటికీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307, 354, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటే పోలీసుల తీరు ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి పూట వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి సోదాల పేరుతో పోలీసులు నానా యాగి చేస్తున్నారు. కేసులో అనేక లొసుగులు... * సరస్వతి భూముల వద్ద ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడినప్పటికీ కేవలం ఒక వర్గంపై మాత్రమే కేసులు నమోదు చేసి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. * సరస్వతి భూములతో సంబంధం లేని బచ్చలపూరి రవి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారు 250 మందిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అధికార పార్టీ చేపట్టిన కక్షసాధింపు చర్యల్లో పోలీసులు భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి. * రైతులను రెచ్చగొట్టి భూముల వద్దకు తీసుకు వచ్చిన టీడీపీ నేతలు వారిని ఆత్మహత్యలకు ఉసిగొలిపి కిరోసిన్ పోసుకునేలా చేశారు. అయితే పోలీసు కేసుల్లో మాత్రం వారిపై హత్యాయత్నం జరిగినట్టుగా నమోదు చేశారు. * 250 మందిపై ఒకేసారి హత్యాయత్నం, ఎస్సీలను కులం పేరుతో దూషించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేయడం ఎలా సాధ్యమో పోలీసులు, అధికారపార్టీ నేతలకే తెలియాలి. కేసుకు సంబంధం లేని వారిని ఇరికించం సరస్వతి భూముల వద్ద ఈ నెల 7న జరిగిన సంఘటనలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు మినహా ఎవరిపై తప్పుడు కేసులు పెట్టే సమస్య లేదు. చట్టప్రకారం మా విధి మేము నిర్వర్తిస్తాం. - రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ