పోలీసుల హైడ్రామా ! | 'Saraswati' land case | Sakshi
Sakshi News home page

పోలీసుల హైడ్రామా !

Published Fri, Oct 17 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

పోలీసుల హైడ్రామా !

పోలీసుల హైడ్రామా !

‘సరస్వతి’ భూముల కేసు
* నిందితులను కోర్టుకు తరలింపులో ఆద్యంతం గోప్యం
* తొలుత మధ్యాహ్నం అని చెప్పి రాత్రి వేళ వరకు తాత్సారం....
* బంధువులను స్టేషన్ నుంచి పంపి తరిమికొట్టిన పోలీసులు
* సంబంధం లేని వారినీ కేసులో ఇరికించారని వెల్లువెత్తిన ఆరోపణలు
* మీడియాకు సైతం వివరాలు వెల్లడించని వైనం

పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో కొద్దిరోజుల కిందట జరిగిన సరస్వతి ఇండస్ట్రీస్ భూముల వివాదంలో నిందితులను కోర్టుకు తరలించటంలో హైడ్రామా నడిచింది.  తొలుత మధ్యాహ్నం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసు అధికారులు నిందితులను బయటకు తీసుకువచ్చి రాత్రి వేళ వరకు తాత్సారం చేశారు. వారిని కోర్టుకు తీసుకువెళ్లేందుకు ఒక స్కూలు బస్సును మధ్యాహ్నం 3 గంటలకే రప్పించినా ఎంతకీ ఎక్కించలేదు.
* తొలుత నిందితుల తరఫు బంధువులన స్టేషన్ నుంచి బయటకు పంపిన పోలీసులు, అక్కడ నుంచి వెళ్లి బయట కూర్చున్న వారిని ఆ ప్రాంతాల్లో లేకుండా తరిమి తరిమి కొట్టారు.
* మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆద్యంతం గోప్యంగా వ్యవహరించారు. దీంతో నిందితులతోపాటు విలేకరులు కూడా గంటల తరబడి పోలీస్‌స్టేషన్ వద్ద వేచిచూడాల్సి వచ్చింది.
* సాధారణంగా ఏ కేసులోనైనా నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చి కేసు వివరాలు వెల్లడించిన తర్వాత కోర్టుకు తరలించటం జరుగుతుంటుంది. ఈ కేసులో మాత్రం అటువంటిదేమీ లేకుండా, కేసు వివరాలు చెప్పకుండా గోప్యంగా వ్యవహరించటాన్ని బట్టి అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే పోలీసు అధికారులు వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు.
* ఈ కేసులో అసలైన నిందితులను కాకుండా, ఎలాంటి సంబంధం లేనివారిని ఇరికించారని, ఆ విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో మీడియాకు సమాచారం ఇవ్వలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

తొలివిడతగా 29 మందిపై...
* సరస్వతీ ఇండస్ట్రీస్ భూముల వివాదంలో మాచర్ల పరిసర ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు 40 మందికి పైగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
* వారిలో తొలివిడత గురువారం 29 మందిని కోర్టులో హాజరు పరిచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
* వీరిలో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మిగిలినవారిపై 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
* రాత్రి 8.30 గంటల వరకు నిందితులను కోర్టుకు తరలించే ప్రయత్నంలోనే అధికారులు ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది.

అధికార పార్టీకి తొత్తులుగా...
సాక్షి, గుంటూరు: పరిశ్రమ స్థాపించి వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం రైతుల వద్ద నుంచి మార్కెట్ కంటే రెట్టింపు ధరకు భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.
* దీనిలో భాగంగా ఈ నెల 7న తాము కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్న భూముల్లో వేసిన పంటలను తొలగించేందుకు వెళ్లిన సరస్వతి యాజమాన్యంపై టీడీపీకి చెందిన కొందరు దాడులకు దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సరస్వతి యాజమాన్యంపైనే అధికార పార్టీ నేతల అండతో పోలీసులు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
* వివిధ గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా ఉండే బలమైన వ్యక్తులను ఈ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
* గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో లేకపోయినప్పటికీ  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307, 354, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటే పోలీసుల తీరు ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి పూట వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి సోదాల పేరుతో పోలీసులు నానా యాగి చేస్తున్నారు.
 
కేసులో అనేక లొసుగులు...
* సరస్వతి భూముల వద్ద ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడినప్పటికీ కేవలం ఒక వర్గంపై మాత్రమే కేసులు నమోదు చేసి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు.
* సరస్వతి భూములతో సంబంధం లేని బచ్చలపూరి రవి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారు 250 మందిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అధికార పార్టీ చేపట్టిన కక్షసాధింపు చర్యల్లో పోలీసులు భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
* రైతులను రెచ్చగొట్టి భూముల వద్దకు తీసుకు వచ్చిన టీడీపీ నేతలు వారిని ఆత్మహత్యలకు ఉసిగొలిపి కిరోసిన్ పోసుకునేలా చేశారు. అయితే పోలీసు కేసుల్లో మాత్రం వారిపై హత్యాయత్నం జరిగినట్టుగా నమోదు చేశారు.
* 250 మందిపై ఒకేసారి హత్యాయత్నం, ఎస్సీలను కులం పేరుతో దూషించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేయడం ఎలా సాధ్యమో పోలీసులు, అధికారపార్టీ నేతలకే తెలియాలి.
 
కేసుకు సంబంధం లేని వారిని ఇరికించం
సరస్వతి భూముల వద్ద ఈ నెల 7న జరిగిన సంఘటనలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు మినహా ఎవరిపై తప్పుడు కేసులు పెట్టే సమస్య లేదు. చట్టప్రకారం మా విధి మేము నిర్వర్తిస్తాం.
 - రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement