బేతాళ కథ చంద్రన్యాయం
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్‌లుక్!
విక్రమార్క! ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పకపోతే ‘‘సూరిబాబు సోదరులు’’ ట్రావెల్స్‌లో ప్రయాణం చేసి దుర్మరణం పాలవుదువు గాక!
పట్టువదలని విక్రమార్కుడు బజాజ్ బైక్ మీద దూసుకుంటూ వస్తున్నాడు. విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడు నవ్వాడు. ‘ఏంటి విక్రమార్కా ఎప్పుడూ లేంది కొత్తగా బైక్ మీద వస్తున్నావేంటి?’ అని అడిగాడు బేతాళుడు. ‘అవును బేతాళా..! నాకా వయసు మీదకొస్తోంది. ఇదివరకటిలా నిన్ను భుజాలపై మోయాలంటే నా వల్ల కావడం లేదు. ఆయాసం వచ్చేస్తోంది. అందుకే బైక్ అయితే నువ్వు వెనకాల కూర్చుంటావ్ హాయిగా పోవచ్చు’ అన్నాడు విక్రమార్కుడు. చెట్టు కొమ్మపై వేలాడుతోన్న బేతాళుడిని దింపి బైక్ పై వెనక కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు విక్రమార్కుడు.
బేతాళుడు మెచ్చుకోలుగా చూసి... ‘అది సరే కానీ... ఇపుడు నీకో కథ చెబుతాను. అలసట తెలీకుండా సావధానంగా విను’ అని చెప్పడం మొదలు పెట్టాడు.‘విక్రమార్కా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యనే నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అపుడు ఆ బస్సు డ్రైవర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే అధికారులు తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తప్పు చేస్తే ఎలాగ అని ప్రతిపక్షానికి చెందిన జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దాంతో అధికారులనే నిలదీస్తారా అని జగన్ పై కేసులు పెట్టారు.
నిన్న కాక మొన్న టిడిపి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో ఆర్టీయే కమిషనర్ కార్యాలయంపైనే దాడికి దిగారు. ఏకంగా గన్‌మెన్‌ని తోసి పారేశారు. ఇంత చేసినా వారిపై ఎలాంటి కేసులూ లేవు. జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టే ముందు మంత్రివర్గమే ప్రత్యేకంగా భేటీ అయి ఆయనపై కేసులు పెట్టాలని తీర్మానించింది. మరి ఆర్టీయే కమిషనర్‌పై దాడి విషయంలో మంత్రివర్గం సమావేశం కూడా కాలేదు. ఒకే ప్రభుత్వం అపుడు అలా. ఇపుడు ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటంటావ్? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో... నీ బైక్‌తో పాటు నువ్వు కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సు కింద పడిపోతావు’ అని బేతాళుడు హెచ్చరించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణం బండి గేర్ మార్చి... ‘బేతాళా.. జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ప్రశ్నించిన ఘటనతో ప్రభుత్వం చేసిన తప్పు బయటపడిపోయింది.
దివాకర్ ట్రావెల్స్ టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డిదే కాబట్టి ప్రభుత్వ పరువు పార్టీ ప్రతిష్ఠ కూడా నాశనమవుతాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ భయంతోనే అందరి దృష్టినీ మరల్చడానికి అసలు కేసు పక్కన పెట్టి జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక కేశినేని నాని, బోండా ఉమ విషయానికి వస్తే... వాళ్లిద్దరూ చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం చేశారు. అలాగని వారిని అరెస్ట్ చేశారనుకో అప్పుడూ పార్టీ పరువు పోతుంది. పైగా వాళ్లు సొంత పార్టీ వాళ్లు కాబట్టి కాపాడుకోక తప్పదు. అందుకే వాళ్ల చేత ఉత్తుత్తి సారీలు చెప్పించి చేతులు దులిపేసుకున్నారు’ అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుని సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు బైక్‌తో సహా మాయమై చెట్టుకు వేలాడాడు.
– నానాయాజీ