diwakar travels bus accident
-
బేతాళ కథ చంద్రన్యాయం
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! విక్రమార్క! ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పకపోతే ‘‘సూరిబాబు సోదరులు’’ ట్రావెల్స్‌లో ప్రయాణం చేసి దుర్మరణం పాలవుదువు గాక! పట్టువదలని విక్రమార్కుడు బజాజ్ బైక్ మీద దూసుకుంటూ వస్తున్నాడు. విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడు నవ్వాడు. ‘ఏంటి విక్రమార్కా ఎప్పుడూ లేంది కొత్తగా బైక్ మీద వస్తున్నావేంటి?’ అని అడిగాడు బేతాళుడు. ‘అవును బేతాళా..! నాకా వయసు మీదకొస్తోంది. ఇదివరకటిలా నిన్ను భుజాలపై మోయాలంటే నా వల్ల కావడం లేదు. ఆయాసం వచ్చేస్తోంది. అందుకే బైక్ అయితే నువ్వు వెనకాల కూర్చుంటావ్ హాయిగా పోవచ్చు’ అన్నాడు విక్రమార్కుడు. చెట్టు కొమ్మపై వేలాడుతోన్న బేతాళుడిని దింపి బైక్ పై వెనక కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు విక్రమార్కుడు. బేతాళుడు మెచ్చుకోలుగా చూసి... ‘అది సరే కానీ... ఇపుడు నీకో కథ చెబుతాను. అలసట తెలీకుండా సావధానంగా విను’ అని చెప్పడం మొదలు పెట్టాడు.‘విక్రమార్కా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యనే నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అపుడు ఆ బస్సు డ్రైవర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే అధికారులు తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తప్పు చేస్తే ఎలాగ అని ప్రతిపక్షానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దాంతో అధికారులనే నిలదీస్తారా అని జగన్ పై కేసులు పెట్టారు. నిన్న కాక మొన్న టిడిపి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో ఆర్టీయే కమిషనర్ కార్యాలయంపైనే దాడికి దిగారు. ఏకంగా గన్‌మెన్‌ని తోసి పారేశారు. ఇంత చేసినా వారిపై ఎలాంటి కేసులూ లేవు. జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టే ముందు మంత్రివర్గమే ప్రత్యేకంగా భేటీ అయి ఆయనపై కేసులు పెట్టాలని తీర్మానించింది. మరి ఆర్టీయే కమిషనర్‌పై దాడి విషయంలో మంత్రివర్గం సమావేశం కూడా కాలేదు. ఒకే ప్రభుత్వం అపుడు అలా. ఇపుడు ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటంటావ్? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో... నీ బైక్‌తో పాటు నువ్వు కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సు కింద పడిపోతావు’ అని బేతాళుడు హెచ్చరించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణం బండి గేర్ మార్చి... ‘బేతాళా.. జగన్మోహన్ రెడ్డి అధికారులను ప్రశ్నించిన ఘటనతో ప్రభుత్వం చేసిన తప్పు బయటపడిపోయింది. దివాకర్ ట్రావెల్స్ టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డిదే కాబట్టి ప్రభుత్వ పరువు పార్టీ ప్రతిష్ఠ కూడా నాశనమవుతాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ భయంతోనే అందరి దృష్టినీ మరల్చడానికి అసలు కేసు పక్కన పెట్టి జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక కేశినేని నాని, బోండా ఉమ విషయానికి వస్తే... వాళ్లిద్దరూ చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం చేశారు. అలాగని వారిని అరెస్ట్ చేశారనుకో అప్పుడూ పార్టీ పరువు పోతుంది. పైగా వాళ్లు సొంత పార్టీ వాళ్లు కాబట్టి కాపాడుకోక తప్పదు. అందుకే వాళ్ల చేత ఉత్తుత్తి సారీలు చెప్పించి చేతులు దులిపేసుకున్నారు’ అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుని సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు బైక్‌తో సహా మాయమై చెట్టుకు వేలాడాడు. – నానాయాజీ -
రిసీవ్ చేసుకోకుండా, రివర్స్ కేసులా?
విజయవాడ: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఎవరిని కాపాడేందుకు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినే సంఘాలుగా పోలీస్, ఐఏఎస్ సంఘాలు మారితే వాటి విశ్వసనీయత పోతుందని ఆయన గురువారమిక్కడ అన్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేతను ఆర్డీవో స్థాయి అధికారి రిసీవ్ చేసుకోవాలని, అలా చేయకపోగా, రివర్స్ కేసులు పెడుతున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు మల్లాది విష్ణు, శివాజీ, సుంకర పద్మ డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఐఏఎస్‌లు, పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. -
‘బాబుకు గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది’
తిరుపతి : దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ దోషులను తప్పించే కుట్ర జరుగుతోందన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌పై కేసులు పెట్టడం దారుణమన్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్పా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు వైఎస్ఆర్ సీపీ భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కృష్ణాజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. -
ఏపీలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా నేడు నిరసనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు రాక్షస, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 2వ తేదీన మండల కేంద్రాలన్నింటి లోనూ నిరసనలు, ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. పార్టీ అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, ఎం.అరుణ్‌కుమార్ బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే.. బాధితులను పరామర్శించడానికి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దుర్ఘటన స్థలానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరంకుశత్వం, అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు తెలుసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాల్సిన ప్రభుత్వం, జగన్‌పై కేసులు పెట్టడానికి ఉత్సాహం చూపిందన్నారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర అంతా జరిగిందని, అందుకు తాము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షంపై కొనసాగుతున్న ఈ దమననీతిని ప్రజలంతా ప్రశ్నించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అన్ని చోట్లా నిరసనలు తెలపాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత పరామర్శకు వెళితే కేసులా? బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించడం ఏ తరహా ప్రజాస్వామ్యమని పార్థసారథి ప్రశ్నించారు. అసలు జగన్ మంగళవారం ఆసుపత్రిలో ఏం అడిగారో తెలియజేసేందుకు పార్థసారథి వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. తొలినుంచి రాష్ట్రంలో ఏ దుర్ఘటన జరిగినా జగన్ అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శిస్తున్న సంగతి గుర్తుచేశారు. -
ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు?: ఎమ్మెల్యే రోజా
తిరుపతి : కృష్ణాజిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అన్యాయం చేస్తోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్ ఎందుకు ఉలిక్కిపడ్డారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేత పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. కలెక్టర్‌కు, వైఎస్ జగన్‌కు ఎలాంటి గొడవలు లేవని, అయితే ఆ సమయంలో వైఎస్ జగన్ మాట్లాడిన ఓ క్లిప్పింగ్‌ను తన అనుకూల మీడియాలో పదేపదే ప్రసారం చేయించి అవమానించారన్నారు. వైఎస్ జగన్ తన వ్యక్తిగతం కోసం కాదని, ఆ కుటుంబాల గురించి మాట్లాడారన్నారు. బాధితుల పక్షాన నిలబడితే కేసులు పెడతారా అని అడిగారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే కొట్టిన రోజు ఇదే కలెక్టర్ ఎందుకు స్పందించలేదన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తన ఇంట్లో జరిగే వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా ప్రజల సొమ్మును వాడుకునే ముఖ్యమంత్రికి బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో చిన్నచూపు ఎందుకన్నారు. విందులు, వినోదాలకు సమయం ఉంటుందని కానీ, బాధితులను పరామర్శించేంత తీరిక కూడా చంద్రబాబుకు లేదా అని రోజా ప్రశ్నలు సంధించారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కూడా తూతూమంత్రంగా బస్సు ప్రమాద బాధితులను పరామర్శించారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కరిచి చిన్నారి చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేశినేని, దివాకర్ ట్రావెల్స్ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని రోజా ధ్వజమత్తారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై వెంటనే కేసులు నమోదు చేయాలని, లేకుంటే తాము న్యాయపోరాటానికి దిగుతామని ఆమె హెచ్చరించారు.