ఏపీలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా నేడు నిరసనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు రాక్షస, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 2వ తేదీన మండల కేంద్రాలన్నింటి లోనూ నిరసనలు, ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. పార్టీ అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, ఎం.అరుణ్‌కుమార్ బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే.. బాధితులను పరామర్శించడానికి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దుర్ఘటన స్థలానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరంకుశత్వం, అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాద కారణాలు తెలుసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాల్సిన ప్రభుత్వం, జగన్‌పై కేసులు పెట్టడానికి ఉత్సాహం చూపిందన్నారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర అంతా జరిగిందని, అందుకు తాము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షంపై కొనసాగుతున్న ఈ దమననీతిని ప్రజలంతా ప్రశ్నించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అన్ని చోట్లా నిరసనలు తెలపాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్ష నేత పరామర్శకు వెళితే కేసులా?
బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించడం ఏ తరహా ప్రజాస్వామ్యమని పార్థసారథి ప్రశ్నించారు. అసలు జగన్ మంగళవారం ఆసుపత్రిలో ఏం అడిగారో తెలియజేసేందుకు పార్థసారథి వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. తొలినుంచి రాష్ట్రంలో ఏ దుర్ఘటన జరిగినా జగన్ అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శిస్తున్న సంగతి గుర్తుచేశారు.