ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు?: ఎమ్మెల్యే రోజా | ysrcp mla roja takes on andhra pradesh government over diwakar bus accident issue | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు?: ఎమ్మెల్యే రోజా

Published Wed, Mar 1 2017 12:30 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు?: ఎమ్మెల్యే రోజా - Sakshi

ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు?: ఎమ్మెల్యే రోజా

తిరుపతి : కృష్ణాజిల్లాలో జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు  ప్రమాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహా వైఎస్‌ఆర్‌ సీపీ నేతలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అన్యాయం చేస్తోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్‌ ఎందుకు ఉలిక్కిపడ్డారని ఆమె సూటిగా ప్రశ్నించారు.  

ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేత పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. కలెక్టర్‌కు, వైఎస్‌ జగన్‌కు ఎలాంటి గొడవలు లేవని, అయితే ఆ సమయంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడిన ఓ క్లిప్పింగ్‌ను తన అనుకూల మీడియాలో పదేపదే ప్రసారం చేయించి అవమానించారన్నారు. వైఎస్‌ జగన్‌ తన వ్యక్తిగతం కోసం కాదని, ఆ కుటుంబాల గురించి మాట్లాడారన్నారు. బాధితుల పక్షాన నిలబడితే కేసులు పెడతారా అని అడిగారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే కొట్టిన రోజు ఇదే కలెక్టర్‌ ఎందుకు స్పందించలేదన్నారు.

ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తన ఇంట్లో జరిగే వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా ప్రజల సొమ్మును వాడుకునే ముఖ్యమంత్రికి బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో చిన్నచూపు ఎందుకన్నారు. విందులు, వినోదాలకు సమయం ఉంటుందని కానీ, బాధితులను పరామర్శించేంత తీరిక కూడా చంద్రబాబుకు లేదా అని రోజా ప్రశ్నలు సంధించారు.

అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కూడా తూతూమంత్రంగా బస్సు ప్రమాద బాధితులను పరామర్శించారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కరిచి చిన్నారి చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేశినేని, దివాకర్‌ ట్రావెల్స్‌ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని రోజా ధ్వజమత్తారు. దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై వెంటనే కేసులు నమోదు చేయాలని, లేకుంటే తాము న్యాయపోరాటానికి దిగుతామని ఆమె హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement