‘బాబుకు గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది’
తిరుపతి : దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ దోషులను తప్పించే కుట్ర జరుగుతోందన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌పై కేసులు పెట్టడం దారుణమన్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్పా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు.
ఇలాంటి కేసులకు వైఎస్‌ఆర్ సీపీ భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని మిథున్ రెడ్డి వ‍్యాఖ్యానించారు. కాగా కృష్ణాజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.