
‘మహా’గణపతిం.. మనసాస్మరామి..
విజయవాడ కల్చరల్ : రాజధాని నగరం విజయవాడలో తొలిసారిగా ఏర్పాటుచేసిన 63 అడుగుల భారీ గణనాథుడు భక్తులను కనువిందు చేశాడు. మహా గణపతిని దర్శించేందుకు గురువారం లక్షలాదిగా తరలిరావడంతో దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డూండీ గణేశ సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో గురువారం ఉదయం కలశస్థాపన, మూర్తి ప్రాణప్రతిష్ఠ, ఏకవిశంతి పత్రిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రామారావు బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన 6,300 కేజీల లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్వామిని దర్శించి పూజలు చేశారు. సాయంత్రం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన నృత్యప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. లాస్య కూచిపూడి అకాడమి, అభినయ ఆర్ట్స్ అకాడమి చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు అలరించాయి. కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రేడియో జాకీ వేణుశ్రావణ్ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 11 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వేదిక కన్వీనర్ శ్రీనాథుని గంగాధర రామారావు ‘సాక్షి’కి తెలిపారు.
ట్రాఫిక్ సమస్య
భారీ గణనాథుడ్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించింది. బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. నిర్వాహకుల బంధుజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సామాన్యులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలుమార్లు భక్తులు నిర్వాహకులతో ఘర్షణ పడ్డారు.
వివాదాస్పద మైన చానల్ నిర్వాకం
డూండీ గణేశ సేవా సమితి నిర్వాహకులు 63 అడుగుల భారీ గణనాథుడిని ఏర్పాటుచేయగా, అదంతా తామే చేశామని, విగ్రహాన్ని కమిటీతో కలిపి తామే ఏర్పాటుచేశామని ఓ వార్త చానల్ ప్రసారం చేయడంపై కమిటీ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండుగ రోజు ఆ చానల్‌లో పలుమార్లు ఇదే విషయం ప్రసారం చేయడం, చానల్‌కు సంబంధించిన బ్యానర్లు విగ్రహం వద్ద ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కోగంటి సత్యం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉత్సవాలను డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నామని, చానల్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.