టీడీపీలో పవన్ కల్లోలం!
విజయవాడ పార్లమెంట్ సీటుపై తెలుగు దేశం పార్టీలో గందరగోళం నెలకొనడానికి పవన్ కళ్యాణ్ కారణమని మీడియా కోడై కూస్తోంది. పవన్ వల్లే కేశినేని శ్రీనివాస్(నాని)కి విజయవాడ సీటు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడ స్థానానికి పవన్ కళ్యాణ్ తరపున అభ్యర్థిని సూచించమని టీడీపీ కోరిందట. దీంతో తనకు సన్నిహితుడైన నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పేరును పవన్ సూచించడంతో గందరగోళం మొదలయిందంటున్నారు.
కేశినేని బుజ్జగించేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినట్టు సమాచారం. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఎంచుకోవాలని నానికి సూచించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేసేందుకు మానసికంగా సిద్దమయ్యానని, విజయవాడ సీటు తనకే ఇవ్వాలని చంద్రబాబును నాని కోరినట్టు తెలిసింది. విజయవాడ ఈస్ట్ స్థానంలో దేవినేని నెహ్రూ, వంగవీటి రాధలతో తలపడడం కష్టమని నాని భావిస్తున్నారు. పెనమలూరులో మాజీ మంత్రి పార్థసారథి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని వెనుకంజ వేస్తున్నారు.
విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న తనకే టికెట్ వస్తుందని భావించిన కేశినేని నానికి ఇప్పుడు ఊహించని విధంగా పవన్ ఎఫెక్ట్ తగిలింది. పవన్ సూచించిన పొట్లూరికే విజయవాడ టీడీపీ టిక్కెట్ ఖాయమంటున్నారు. అసలు వరప్రసాదే వెనుకుండి పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీ పెట్టించారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ పార్టీకి పెట్టుబడి పెట్టింది కూడా పొట్లూరి అని కూడా అంటున్నారు. అందుకే విజయవాడ సీటుకు ఆయన పేరును పవన్ సూచించారని చెబుతున్నారు.