Vijayawada parliament constituency
-
పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
బెజవాడ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. అటువంటి కంచుకోటలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందనే ధీమా కనిపిస్తోంది. టీడీపీ అడ్డాలో ఫ్యాన్ గిర్రున తిరిగి పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బెజవాడలో జరిగిన రాజకీయాలు.. పోలింగ్ జరిగిన తీరు చూశాక కచ్చితంగా సైకిల్ పార్టీ ఓటమి ఖాయం అంటున్నారు విశ్లేషకులు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఓ లుక్కేద్దాం.తెలుగుదేశం అడ్డాలో పాగా వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు, పన్నిన వ్యూహాలు ఫలించాయంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని ఈ సారి వైఎస్సార్ సిపి గెలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. 2004, 2009 ఎన్నికలలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని గెలుచుకోలేకపోయింది.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటును టిడిపి గెలుచుకుంది. 1984, 1991 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధ్రీశ్వరావు విజయవాడ ఎంపీగా గెలుపొందారు. మరలా 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయవాడ ఎంపీ సీటును దక్కించుకుంది. ఈ రెండుసార్లు కేశినేని నాని టీడీపీ ఎంపీగా గెలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేసి పరాజయం చెందారు. అదేవిధంగా 2019లో రాష్ట్రం అంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచినా..విజయవాడ ఎంపీ సీటు మాత్రం వైఎస్ఆర్సీపీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సిపికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో 44.36 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నానికి...వైఎస్సార్ సిపి అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌కు మధ్య ఒక శాతంలోపే ఓట్ల తేడా ఉండటం విశేషం. టిడిపి అభ్యర్ధి వైఎస్సార్ సిపిపై కేవలం 8726 ఓట్లతోనే గెలిచారు. దాదాపు గెలుచుకునే పరిస్ధితి వరకు వచ్చి కేవలం తొమ్మది వేల లోపు ఓట్ల తేడాతోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చెందారు. గతానుభవాలతో ఈసారి విజయవాడను దక్కించుకోవడానికి వైఎస్సార్ సిపి ముందునుంచి గట్టి ప్రయత్నమే చేసింది. సిఎం వైఎస్ జగన్ పాలన నచ్చి సిట్టింగ్ ఎంపి కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరారు. చేరిన మొదట రోజు నుంచి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ గట్టిగానే ప్రచారం చేశారు. ఇక టిడిపి తరపున నాని సోదరుడు కేశినేని చిన్ని బరిలో నిలిచారు.విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో 77.28 శాతం పోలింగ్ నమోదు అయితే, 2019 నాటికి పోలింగ్ 78.94 శాతానికి పెరిగింది. గత ఎన్నికలలో పెరిగిన పోలింగ్ శాతం వైఎస్సార్ సిపికే అనుకూలించింది. 2014 నాటికి టిడిపికి..వైఎస్సార్ సిపికి మధ్య ఆరు శాతం పైన ఓట్ల తేడా ఉంటే, 2019 నాటికి తేడా ఒక శాతం కంటే తక్కువకి దిగి వచ్చింది. ఈ సారి పోలింగ్ శాతం 79.36 శాతం నమోదైంది. ఈ సారి పెరిగిన పోలింగ్ శాతం కూడా వైఎస్సార్ సిపికే కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఏడు శాతం పోలింగ్ పెరగడం విశేషం. 2014 ఎన్నికలలో 65.87 శాతం పోలింగ్ నమోదు అయితే ఈ ఎన్నికలలో ఏకంగా 72.96 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే విజయవాడ తూర్పులో ఆరు శాతం, నందిగామలో దాదాపు నాలుగు శాతం పెరగడం విశేషం.ఈ ఎన్నికలలో మహిళా ఓటర్లు భారీగా పెరగడం కూడా వైఎస్సార్ సిపికే అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోల్చుకంటే దాదాపు 27 వేల మంది మహిళా ఓటర్లు అదనంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందడం వల్లే పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ స్ధానంలో ఈ సారి వైఎస్సార్ సిపి పాగా వేయడం ఖాయమని చెబుతున్నారు. కేశినేని బ్రదర్స్ మధ్య జరిగిన పోరులో గెలుపెవరిదనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతుండగా...గెలుపుపై వైఎస్సార్ సిపి మాత్రం ధీమాగా ఉంది. కేశినేని నాని బరిలో గట్టి అభ్యర్ధిగా ఉండటం కూడా వైఎస్సార్ సిపికి కలిసొచ్చిందంటున్నారు. -
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. అలాగని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు అని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనను దూరం పెడుతున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ►తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్ ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది.. అని అన్నారాయన. ►ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ►నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు అని కేశినేని నాని వివరించారు. ►నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడవ సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా అని కేశినేని నాని అన్నారు. -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
తొలి మహిళా ఎంపీలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి నారీమణులుగా గాయని మోతే వేదకుమారి (ఏలూరు), కె.అచ్చమాంబ (విజయవాడ) రికార్డులకు ఎక్కారు. ఏలూరుకు చెందిన వేదకుమారి టైలరింగ్, టైప్ రైటింగ్‌లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. రెండోసారి 1957 ఎన్నికల్లో వేదకుమారి కాంగ్రెస్ తరఫున పోటీచేసి తన ప్రత్యర్థి వీరమాచనేని విమలాదేవిపై గెలుపొందారు. 1962 ఎన్నికల్లో వీరమాచనేని విమలాదేవి (కమ్యూనిస్ట్) వేదకుమారిపై విజయం సాధించారు. 1957లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కొమర్రాజు అచ్చమాంబ విజయ కేతనం ఎగురవేశారు. ఆమె ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది కూడా. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఆమె సైద్ధాంతికంగా విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత ఎంపీగా ఎన్నికయ్యారు. -
టీడీపీలో పవన్ కల్లోలం!
విజయవాడ పార్లమెంట్ సీటుపై తెలుగు దేశం పార్టీలో గందరగోళం నెలకొనడానికి పవన్ కళ్యాణ్ కారణమని మీడియా కోడై కూస్తోంది. పవన్ వల్లే కేశినేని శ్రీనివాస్(నాని)కి విజయవాడ సీటు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడ స్థానానికి పవన్ కళ్యాణ్ తరపున అభ్యర్థిని సూచించమని టీడీపీ కోరిందట. దీంతో తనకు సన్నిహితుడైన నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పేరును పవన్ సూచించడంతో గందరగోళం మొదలయిందంటున్నారు. కేశినేని బుజ్జగించేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినట్టు సమాచారం. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఎంచుకోవాలని నానికి సూచించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేసేందుకు మానసికంగా సిద్దమయ్యానని, విజయవాడ సీటు తనకే ఇవ్వాలని చంద్రబాబును నాని కోరినట్టు తెలిసింది. విజయవాడ ఈస్ట్ స్థానంలో దేవినేని నెహ్రూ, వంగవీటి రాధలతో తలపడడం కష్టమని నాని భావిస్తున్నారు. పెనమలూరులో మాజీ మంత్రి పార్థసారథి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని వెనుకంజ వేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న తనకే టికెట్ వస్తుందని భావించిన కేశినేని నానికి ఇప్పుడు ఊహించని విధంగా పవన్ ఎఫెక్ట్ తగిలింది. పవన్ సూచించిన పొట్లూరికే విజయవాడ టీడీపీ టిక్కెట్ ఖాయమంటున్నారు. అసలు వరప్రసాదే వెనుకుండి పవన్ కళ్యాణ్‌తో జనసేన పార్టీ పెట్టించారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ పార్టీకి పెట్టుబడి పెట్టింది కూడా పొట్లూరి అని కూడా అంటున్నారు. అందుకే విజయవాడ సీటుకు ఆయన పేరును పవన్ సూచించారని చెబుతున్నారు. -
కేశినేనికి చంద్రబాబు షాక్!
విజయవాడ: కేశినేని శ్రీనివాస్(నాని)కి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై నాని పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. విజయవాడ లోక్‌సభ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో కేశినేని హతాశులయ్యారు. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాని సుముఖంగా లేరని సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తనకే ఎంపీ సీటు వస్తుందన్న దీమాతో ఉన్న నాని పార్టీ నిర్ణయంతో అవాక్కయ్యారు. సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు టిక్కెట్టు రాకపోవడంపై చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని నాని తెలిపారు. వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్రావులకు ఇప్పటికే చేయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేశినేనికి షాక్ ఇచ్చారు. కొత్త పేర్లను తెరపైకి తెచ్చారు. కేఎల్ యూనివర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, ఎన్నారై కోమటి జయరాం పేర్లపై అభిప్రాయ సేకరణ జరిపి చంద్రబాబు తనదైన రాజకీయం ప్రదర్శించారు. -
గెలుపే లక్ష్యం
సాక్షి, విజయవాడ : జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో అంతర్గత సమీక్షాసమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పరిస్థితిపై చర్చించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో పార్టీ అభ్యర్థుల పరిస్థితి, నిర్వహించిన ప్రచారశైలి, సమన్వయకర్తల పనితీరు అంశాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని సమన్వయకర్తలు భుజాన వేసుకుని పనిచేయడం అభినందనీయమని, అన్ని ఎన్నికల్లోనూ ఇదే కొనసాగించాలని సూచించారు. అనంతరం ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలు, 836 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం అన్నిస్థానాల్లో పోటీలో ఉన్నారా? లేక స్థానికంగా పొత్తులు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీకి దూరంగా ఉన్నారా? అనే అంశంపై నియోజకవర్గాలవారీగా సమీక్షించారు. జెడ్పీ పీఠం మనదే.. జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని, పార్టీ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో నిత్యం రెండు పూటల ప్రచార కార్యక్రమాలు సాగాలని సూచించారు. దివంగత వైఎస్సార్ హయాంలో రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ముఖ్య నేతలు వస్తారని వివరించారు. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో ఇక్కడ ఇబ్బందులు తల్తెతకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతితో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ప్రచారం గురించి చర్చించారు. పార్టీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్, కుక్కల విద్యాసాగర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు జోగి రమేష్ (మైలవరం), జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), పడమట సురేష్‌బాబు (పెనమలూరు), ఉప్పులేటి కల్పన (పామర్రు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), రక్షణనిధి (తిరువూరు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), దూలం నాగేశ్వరరావు(కైకలూరు) పాల్గొన్నారు. కోనేరుతో నేతల భేటీ.. పార్టీ సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని కోనేరు సూచించారు.