సాక్షి, విజయవాడ : జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో అంతర్గత సమీక్షాసమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పరిస్థితిపై చర్చించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో పార్టీ అభ్యర్థుల పరిస్థితి, నిర్వహించిన ప్రచారశైలి, సమన్వయకర్తల పనితీరు అంశాలపై చర్చించారు.
పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని సమన్వయకర్తలు భుజాన వేసుకుని పనిచేయడం అభినందనీయమని, అన్ని ఎన్నికల్లోనూ ఇదే కొనసాగించాలని సూచించారు. అనంతరం ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలు, 836 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం అన్నిస్థానాల్లో పోటీలో ఉన్నారా? లేక స్థానికంగా పొత్తులు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీకి దూరంగా ఉన్నారా? అనే అంశంపై నియోజకవర్గాలవారీగా సమీక్షించారు.
జెడ్పీ పీఠం మనదే..
జెడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని, పార్టీ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో నిత్యం రెండు పూటల ప్రచార కార్యక్రమాలు సాగాలని సూచించారు. దివంగత వైఎస్సార్ హయాంలో రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ముఖ్య నేతలు వస్తారని వివరించారు. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో ఇక్కడ ఇబ్బందులు తల్తెతకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పార్టీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతితో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ప్రచారం గురించి చర్చించారు. పార్టీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్, కుక్కల విద్యాసాగర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు జోగి రమేష్ (మైలవరం), జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), పడమట సురేష్‌బాబు (పెనమలూరు), ఉప్పులేటి కల్పన (పామర్రు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), రక్షణనిధి (తిరువూరు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), దూలం నాగేశ్వరరావు(కైకలూరు) పాల్గొన్నారు.
కోనేరుతో నేతల భేటీ..
పార్టీ సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని కోనేరు సూచించారు.
గెలుపే లక్ష్యం
Published Wed, Apr 2 2014 1:43 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM
Advertisement