పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా? | YSRCP Double Excitement On Vijayawada Parliament Seat, More Details Inside | Sakshi
Sakshi News home page

పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?

Published Thu, May 30 2024 5:01 PM | Last Updated on Thu, May 30 2024 6:22 PM

YSRCP Double Excitement Vijayawada Parliament Seat

బెజవాడ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. అటువంటి కంచుకోటలో ఈసారి వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరబోతోందనే ధీమా కనిపిస్తోంది. టీడీపీ అడ్డాలో ఫ్యాన్‌ గిర్రున తిరిగి పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. బెజవాడలో జరిగిన రాజకీయాలు.. పోలింగ్‌ జరిగిన తీరు చూశాక కచ్చితంగా సైకిల్ పార్టీ ఓటమి ఖాయం అంటున్నారు విశ్లేషకులు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఓ లుక్కేద్దాం.

తెలుగుదేశం అడ్డాలో పాగా వేయడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు, పన్నిన వ్యూహాలు ఫలించాయంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని ఈ సారి వైఎస్సార్ సిపి గెలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. 2004, 2009 ఎన్నికలలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని గెలుచుకోలేకపోయింది.

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటును టిడిపి గెలుచుకుంది. 1984, 1991 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధ్రీశ్వరావు విజయవాడ ఎంపీగా గెలుపొందారు. మరలా 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయవాడ ఎంపీ సీటును దక్కించుకుంది. ఈ రెండుసార్లు కేశినేని నాని టీడీపీ ఎంపీగా గెలిచారు. 2014లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్‌ పోటీ చేసి పరాజయం చెందారు. అదేవిధంగా 2019లో రాష్ట్రం అంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచినా..విజయవాడ ఎంపీ సీటు మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్‌ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు.  

2019 ఎన్నికల్లో వైఎస్సార్ సిపికి విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో 44.36 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నానికి...వైఎస్సార్ సిపి అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌కు మధ్య ఒక శాతంలోపే ఓట్ల తేడా ఉండటం విశేషం. టిడిపి అభ్యర్ధి వైఎస్సార్ సిపిపై కేవలం 8726 ఓట్లతోనే గెలిచారు. దాదాపు గెలుచుకునే పరిస్ధితి వరకు వచ్చి కేవలం తొమ్మది వేల లోపు ఓట్ల తేడాతోనే వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఓటమి చెందారు. గతానుభవాలతో ఈసారి విజయవాడను దక్కించుకోవడానికి వైఎస్సార్ సిపి ముందునుంచి గట్టి ప్రయత్నమే చేసింది. సిఎం వైఎస్ జగన్ పాలన నచ్చి సిట్టింగ్ ఎంపి కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరారు. చేరిన మొదట రోజు నుంచి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ గట్టిగానే ప్రచారం చేశారు. ఇక టిడిపి తరపున నాని సోదరుడు కేశినేని చిన్ని బరిలో నిలిచారు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో 77.28 శాతం పోలింగ్ నమోదు అయితే, 2019 నాటికి పోలింగ్ 78.94 శాతానికి పెరిగింది. గత ఎన్నికలలో పెరిగిన పోలింగ్ శాతం వైఎస్సార్ సిపికే అనుకూలించింది. 2014 నాటికి టిడిపికి..వైఎస్సార్ సిపికి మధ్య ఆరు శాతం పైన ఓట్ల తేడా ఉంటే, 2019 నాటికి తేడా ఒక శాతం కంటే తక్కువకి దిగి వచ్చింది. ఈ సారి పోలింగ్ శాతం 79.36 శాతం నమోదైంది. ఈ సారి పెరిగిన పోలింగ్ శాతం కూడా వైఎస్సార్ సిపికే కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఏడు శాతం పోలింగ్ పెరగడం విశేషం. 2014 ఎన్నికలలో 65.87 శాతం పోలింగ్ నమోదు అయితే ఈ ఎన్నికలలో ఏకంగా 72.96 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే విజయవాడ తూర్పులో ఆరు శాతం, నందిగామలో దాదాపు నాలుగు శాతం పెరగడం విశేషం.

ఈ ఎన్నికలలో మహిళా ఓటర్లు భారీగా పెరగడం కూడా వైఎస్సార్ సిపికే అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోల్చుకంటే దాదాపు 27 వేల మంది మహిళా ఓటర్లు అదనంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందడం వల్లే పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ స్ధానంలో ఈ సారి వైఎస్సార్ సిపి పాగా వేయడం ఖాయమని చెబుతున్నారు. కేశినేని బ్రదర్స్‌ మధ్య జరిగిన పోరులో గెలుపెవరిదనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతుండగా...గెలుపుపై వైఎస్సార్ సిపి మాత్రం ధీమాగా ఉంది.  కేశినేని నాని బరిలో గట్టి అభ్యర్ధిగా ఉండటం కూడా వైఎస్సార్ సిపికి కలిసొచ్చిందంటున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement