రెండేళ్లుగా తనను పార్టీలో కుదురుగా ఉండనివ్వకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్న తెలుగుదేశాన్ని వీడిన కేశినేని నాని ఇప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనను కాదని తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు కేశినేని నానిని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించగా ఇప్పటికే ఆయన తన పనులు మొదలు పెట్టారు. కేడర్‌తో సమావేశం కావడం, వారిని తనవెంట నడిపించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తన పరిధిలోని విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలతోబాటు తిరువూరు, మైలవరం.. నందిగామ.. జగ్గయ్యపేటల్లోని తన కేడర్‌తో కూడా భేటీలు నిర్వహిస్తూ ఎప్పటిలా తనకు మద్దతుఇవ్వాల్సిందిగా కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది.
కేశినేని నాని తన ప్రధాన అనుచరులు.. నాయకులతో కూడిన వాట్సాప్ గ్రూపులో మొన్న ఆయన తరఫున ఒక మెసేజ్ పోస్ట్ చేసారు. కేశినేని నాని ఇకపై వైఎస్సార్‌సీపీతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఆయన ఆలోచలను.. నిర్ణయాలు.. అడుగుల గమనాన్ని అంగీకరించి, ఆమోదించేవాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ గ్రూపులో ఉండాలని, ఆయన ఆలోచనలు, నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు సదరు గ్రూపు నుంచి వెళ్లిపోవచ్చని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే నాని అలా టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ వెంట నడవడాన్ని అంగీకరించాలని వాళ్లు గ్రూపు నుంచి వెళ్లిపోవాలని అందులో తేల్చి చెప్పేశారు. అయితే, అలా చెప్పినప్పటికీ ఒక్కరు కూడా గ్రూపు నుంచి వెళ్లలేదని తెలుస్తోంది.
అంటే వారంతా నాని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లే అని తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కేశినేని నాని వెంట వైఎస్సార్‌సీపీ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన సైతం తన బలాన్ని.. బలగాన్ని నిరూపించుకుని ఎన్నికల్లో తన పట్టును రుజువు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
వాస్తవానికి కేశినేని నాని వెంట తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోబాటు ఇంకా పెద్ద సంఖ్యలో గ్రామ, మండల స్థాయి నాయకులూ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తామంతా ఈసారి ఐక్యంగా కదులుతామని, నాని మొన్న చెప్పినట్లు జిల్లాలో 60 శాతం వరకూ టీడీపీ కేడర్‌ను తమ వెంట తీసుకుపోతామని వారు అంటున్నారు. రెండుసార్లు గెలిచిన నాని ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ సామాజికవర్గంలో కూడా ఆలోచన మొదలైంది. మళ్ళీ వచ్చేది జగన్.. గెలిచేది జగన్ అని వారు భావిస్తున్నారు. దీంతో ఎన్టీయార్ జిల్లాలో ఈసారి తెలుగుదేశానికి గట్టి దెబ్బ తప్పదు అని తెలుస్తోంది.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment